21
1 సముద్రతీరాన ఉన్న ఎడారి✽ విషయం దేవోక్తి:దక్షిణ ప్రదేశంలో సుడిగాలులు వీచే విధంగా
ఎడారినుంచి భయంకర దేశంనుంచి విపత్తు వస్తూ ఉంది.
2 క్రూరమైన సంఘటనలను సూచించే దర్శనం
నాకు కనబడింది. ద్రోహులు ద్రోహం చేస్తారు.
దోపిడీగాళ్ళు దోచుకొంటారు.
“ఏలాం దేశమా! బయలుదేరు!
మాదీ దేశమా! ముట్టడి వెయ్యి!
అది కలిగించిన మూలుగులన్నిటినీ నేను మానిపిస్తాను.”
3 ✽ఇందుచేత నా నడుముకు చాలా వేదన పట్టింది.
స్త్రీకి పట్టిన కాన్పునొప్పులలాంటి నొప్పులు నాకు కలిగాయి.
నేను విన్నదాని కారణంగా అల్లాడిపోతున్నాను.
చూచినదాని కారణంగా హడలిపోతున్నాను.
4 నాకు జారుగుండె పడింది.
మహా భయం నాకు ముంచుకువస్తూ ఉంది.
నాకు చాలా ఇష్టమైన సంధ్యవేళ భయంకరమైపోయింది.
5 ✽భోజనం కోసం బల్లలను సిద్ధం చేస్తున్నారు,
తివాసీలు పరుస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు
అధిపతులారా, లెండి! డాళ్ళకు చమురు రాయండి!
6 ✽ఎందుకంటే ప్రభువు నాతో ఇలా అన్నాడు:
“నీవు వెళ్ళి కావలివాణ్ణి పెట్టు.
అతడు తనకు కనిపించేదానిని తెలియజేయాలి.
7 రౌతులు జత జతలుగా రావడం, గాడిదల వరుస,
ఒంటెల వరుస రావడం అతడికి కనిపించినప్పుడు
అతడు మెళుకువగా ఉండాలి, చాలా మెళుకువగా ఉండాలి.”
8 సింహం గర్జించేవిధంగా కావలివాడు బిగ్గరగా అరచాడు:
“నా యజమానీ! పగలు నేను ఎప్పుడూ
కావలిగోపురం మీద నిలుచునే ఉన్నాను.
రాత్రి అంతా కావలి కాస్తూ ఉన్నాను.
9 ✝ఇదిగో! జతజతలుగా రౌతుల గుంపు వస్తూ ఉంది.
‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది!
దాని దేవతల విగ్రహాలన్నిటినీ ఆయన నేలమీద
పడేసి ముక్కలు చేశాడు’ అంటున్నాడొకడు.”
10 కళ్ళంలో నూర్చబడ్డ✽ నా జనమా!
ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనలప్రభూ అయిన యెహోవా
నాకు వినిపించిన✽ సంగతి మీకు తెలియజేస్తున్నాను.
11 దూమా✽ విషయం దేవోక్తి:
“కావలివాడా! రాత్రి ఎంత వేళైంది? కావలివాడా!
రాత్రి ఎంత వేళైంది?” అని ఒక వ్యక్తి శేయీరు కొండనుంచి
కేక వేసి నన్ను అడుగుతున్నాడు.
12 కావలివాడు “ఉదయం✽ వస్తుంది. రాత్రి కూడా వస్తుంది.
మీరు అడగాలనుకొంటే✽ అడగండి. తిరిగి రండి” అంటున్నాడు.
13 అరేబియా✽ విషయం దేవోక్తి:
దెదాను జాతివారైన✽ వర్తకుల సార్థవాహమా!
అరబి ఎడారిలో రాత్రి గడుపు.
14 తేమా✽ కాపురస్తులారా! దప్పిగొన్నవాళ్ళకు నీళ్ళు తెండి.
ఆహారం తీసుకొని, పారిపోయినవారిని కలుసుకోండి.
15 ✽కత్తిబారినుంచి, దూసిన కత్తిబారినుంచి
వాళ్ళు పారిపోతున్నారు.
ఎక్కుపెట్టిన వింటి బారినుంచి, తీవ్ర యుద్ధంనుంచి
పారిపోతున్నారు.
16 ప్రభువు నాతో చెప్పేదేమిటంటే, “కూలివాళ్ళ లెక్కప్రకారం ఒకే సంవత్సరం లోపల కేదారు✽వాళ్ళ వైభవమంతా నాశనమవుతుంది. 17 కేదారువాళ్ళ పరాక్రమశాలురైన విలుకాండ్లలో కొద్దిమందే మిగులుతారు.” ఇలా జరుగుతుందని ఇస్రాయేల్✽ ప్రజల దేవుడు యెహోవా అంటున్నాడు.