20
1 అష్షూరు రాజైన సర్‌గోను పంపగా తరతాను అష్‌డోదుమీదికి వచ్చి, యుద్ధం చేసి దానిని పట్టుకొన్న సంవత్సరంలో, 2 యెహోవా ఆమోజు కొడుకైన యెషయాచేత మాట్లాడించాడు. ఆయన “నీవు వెళ్ళి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదరక్షలు తీసివెయ్యి” అని యెషయాతో అన్నాడు. అతడు అలా చేసి, నగ్నంగా, పాదరక్షలు లేకుండానే తిరుగాడాడు.
3 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా సేవకుడు యెషయా ఈజిప్ట్ కూషుల విషయం సూచనగా, చిహ్నంగా మూడు సంవత్సరాలు నగ్నంగా, పాదరక్షలు లేకుండానే తిరుగాడాడు. 4 ఇలాగే అష్షూరు రాజు బందీలుగా ఉన్న ఈజిప్ట్‌వాళ్ళను, దేశభ్రష్టులైన కూషువాళ్ళను, పిన్నలనూ పెద్దలనూ చెప్పులు లేని దిగంబరులను చేసి తీసుకుపోతాడు. ఈజిప్ట్‌వాళ్ళకు అవమానం కలిగేలా వాళ్ళ పిరుదుల మీది బట్టను తీసివేసి వాళ్ళను తీసుకుపోతాడు. 5 కూషును నమ్ముకొన్నవాళ్ళు, ఈజిప్ట్ అంటే తమకు అతిశయకారణమని భావించుకొన్నవాళ్ళు కలవరపడి సిగ్గుపాలవుతారు. 6 ఆ రోజు సముద్రతీర నివాసులు “అష్షూరు రాజు బారినుంచి తప్పించుకోవాలని మనం సహాయంకోసం ఎవరిదగ్గరికి పారిపోయి, ఆధారపడ్డామో వాళ్ళు ఏమయ్యారో చూడండి! మనం ఎలా తప్పించుకోగలం?” అని చెప్పుకొంటారు.