19
1 ఈజిప్ట్ విషయం దేవోక్తి:
యెహోవా మేఘమెక్కి ఈజిప్ట్‌కు త్వరగా వస్తూ ఉన్నాడు.
ఈజిప్ట్ విగ్రహాలు ఆయన ఎదుట వణకుతూ ఉన్నాయి.
ఈజిప్ట్‌వాళ్ళ గుండె కరిగిపోతూ ఉంది.
2 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“నేను ఈజిప్ట్‌వాళ్ళమీదికి ఈజిప్ట్‌వాళ్ళను
పురికొలుపుతాను.
సోదరుడితో సోదరుడు, పొరుగువాడితో
పొరుగువాడు పోరాడుతారు.
పట్టణంమీద పట్టణం, రాజ్యంమీద రాజ్యం
యుద్ధం చేస్తాయి.
3 ఈజిప్ట్‌వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది.
నేను వాళ్ళ ఆలోచనలను వమ్ము చేస్తాను.
వాళ్ళు విగ్రహాల దగ్గర, మాంత్రికుల దగ్గర,
కర్ణపిశాచం గల వాళ్ళదగ్గర, సోదెగాండ్ర దగ్గర విచారణ చేస్తారు.
4 నేను ఈజిప్ట్‌వాళ్ళను క్రూరమైన అధిపతి వశం చేస్తాను.
దౌర్జన్యపరుడైన రాజు వాళ్ళమీద అధికారం చేస్తాడు.”
5 నైలు నది నీళ్ళు ఇంకిపోతాయి.
నది మార్గం ఎండి పొడినేల అవుతుంది.
6 కాలువలు కంపుకొడతాయి.
ఈజిప్ట్ ప్రవాహాలు తగ్గిపోయి ఎండిపోతాయి.
రెల్లు, తుంగలు వాడిపోతాయి.
7 నైలు నది ఒడ్డున ఉన్న బీడులు, నైలు దగ్గర విత్తనాలు
చల్లిన పొలాలు కూడా ఎండిపోతాయి.
వాటి మొక్కలు కొట్టుకుపోయి కనిపించకుండా పోతాయి.
8 చేపలు పట్టేవాళ్ళు మూలుగుతారు.
నైలులో గాలం వేసేవాళ్ళంతా దుఃఖిస్తారు.
నీళ్ళమీద వలలు వేసేవాళ్ళు కృశించిపోతారు.
9 చక్కగా దువ్వబడ్డ జనుపనార పని చేసేవాళ్ళు,
తెల్లని బట్టలు నేసేవాళ్ళు ఆశాభంగం చెందుతారు.
10 ఈజిప్ట్ ఆధారాలు చితికిపోతాయి.
కూలివాళ్ళంతా శోకిస్తారు.
11 సోయను నగర నాయకులు
తెలివితక్కువవాళ్ళు.
ఫరో తెలివైన సలహాదారుల సలహా పశుప్రాయమైంది.
“నేను జ్ఞానుల శిష్యుణ్ణి, పూర్వకాలంలో ఉన్న
రాజుల సంతతివాణ్ణి” అని మీరు ఫరోతో
ఎలా చెప్పగలరు?
12  నీ జ్ఞానులు ఏమయ్యారు? సేనలప్రభువు యెహోవా
ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా నిర్ణయించినదానిని
వాళ్ళు గ్రహించి నీతో చెప్పాలి గదా!
13 సోయను నాయకులు తెలివితక్కువ వాళ్ళయ్యారు.
నోపు నగర నాయకులు మోసపోయారు.
ఈజిప్ట్ జాతుల ప్రముఖులు దానిని తప్పుదారి పట్టించారు.
14 యెహోవా వాళ్ళ ఆలోచనా శక్తిని తారుమారు చేశాడు.
త్రాగుబోతు తన వాంతిలో తూలిపడే విధంగా
ఈజిప్ట్ తన పని అంతట్లో తూలిపోయేలా వాళ్ళు చేస్తున్నారు.
15 ఈజిప్ట్ ఏమీ చేయలేకపోతుంది తల గానీ,
తోక గానీ, కొమ్మ గానీ, రెల్లు గానీ చేయగలిగే పని
ఏమీ ఉండదు.
16 ఆ రోజున ఈజిప్ట్‌వాళ్ళు స్త్రీలలాగా ఉంటారు. సేనలప్రభువు యెహోవా వాళ్ళకు పైగా తన చెయ్యి ఎత్తి ఊపేటప్పుడు, అది చూచి వాళ్ళు భయంతో వణకిపోతారు. 17 యూదా దేశంవల్ల కూడా ఈజిప్ట్‌కు భయం కలుగుతుంది. సేనలప్రభువు యెహోవా వాళ్ళకు విరోధంగా సంకల్పించినదాని కారణంగా వాళ్ళలో ఎవరితో అయినా యూదా అంటే వాళ్ళు హడలిపోతారు. 18 ఆ రోజు ఈజిప్ట్‌లో ఉన్న అయిదు పట్టణాల ప్రజలు కనానుభాష మాట్లాడుతారు, యెహోవా ప్రజలమని ప్రమాణం చేస్తారు. ఆ పట్టణాలలో ఒకదానిని “నాశనపురం” అంటారు.
19 ఆ రోజుల్లో ఈజిప్ట్ మధ్య యెహోవాకు బలిపీఠం ఉంటుంది. దాని సరిహద్దుదగ్గర యెహోవాకు అంకితమైన స్తంభం ఉంటుంది. 20 అది ఈజిప్ట్ దేశంలో, సేనలప్రభువు యెహోవాకు గుర్తుగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవాళ్ళ విషయం వాళ్ళు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వాళ్ళదగ్గరికి పరాక్రమశాలి అయిన రక్షకుణ్ణి పంపుతాడు. ఆయన వాళ్ళను రక్షిస్తాడు. 21 యెహోవా తనను ఈజిప్ట్‌ప్రజలు తెలుసుకొనేలా చేస్తాడు. ఆ రోజున ఈజిప్ట్‌వాళ్ళు యెహోవాను తెలుసుకొంటారు. వాళ్ళు బలులూ నైవేద్యాలూ అర్పించి ఆయనను ఆరాధిస్తారు. యెహోవాకు మ్రొక్కుబడులను చేసుకొని వాటిని చెల్లిస్తారు. 22 యెహోవా ఈజిప్ట్‌ను కొడతాడు, వాళ్ళను బాగు చేస్తాడు. వాళ్ళు యెహోవావైపు తిరుగుతారు, ఆయన వాళ్ళ ప్రార్థనలు అంగీకరించి వాళ్ళను బాగు చేస్తాడు.
23 ఆ రోజుల్లో ఈజిప్ట్‌నుంచి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరువాళ్ళు ఈజిప్ట్‌కు, ఈజిప్ట్‌వాళ్ళు అష్షూరుకు వస్తూ పోతూ ఉంటారు. ఈజిప్ట్‌వాళ్ళూ, అష్షూరువాళ్ళూ యెహోవాను ఆరాధించి సేవిస్తారు. 24 ఆ రోజుల్లో ఈజిప్ట్ జనం, అష్షూరు జనంతో కూడా ఇస్రాయేల్‌ప్రజ మూడో జనమై భూమికి దీవెనగా ఉంటుంది. 25 సేనలప్రభువు యెహోవా వాళ్ళను దీవిస్తూ “నా జనమైన ఈజిప్ట్‌వారు ధన్యులు. నా చేతులు చేసిన అష్షూరువారు ధన్యులు. నా సొత్తయిన ఇస్రాయేల్ ప్రజలు ధన్యులు” అంటాడు.