18
1 తటతట కొట్టుకొంటూ ఉన్న రెక్కలున్న దేశం
కూషు నదుల అవతల ఉంది.
దానికి బాధ తప్పదు.
2 అది సముద్రంలో నీళ్ళమీద జమ్ము పడవలలో
రాయబారులను పంపుతూ ఉంది.
త్వరపడే దూతలారా!
నున్నని చర్మం గల పొడుగాటి జనం దగ్గరికి వెళ్ళండి.
ఆ జనం నలుదిక్కులా భయం కలిగించేవారు!
చాలా బలమైన జనం,
ఇతర జనాలను అణగద్రొక్కే జనం.
దాని దేశాన్ని నదులు విభజిస్తాయి.
3 లోకనివాసులారా! భూమిమీద
కాపురముంటున్న వారలారా!
పర్వతాలమీద జెండాను ఎత్తడం జరిగేటప్పుడు
మీరంతా చూస్తారు.
బూర ఊదడం జరిగినప్పుడు మీరంతా వింటారు.
4 యెహోవా నాతో అంటున్నాడు:
“ఎండ కాస్తూ ఉన్నప్పుడు,
కోతకాలం వేడిమిలో పొగమంచు
మబ్బులాగా ఏర్పడినప్పుడు,
నేను నెమ్మదిగా నా నివాసస్థలంనుంచి
చూస్తూ ఉంటాను.”
5 కోతకాలం రాకముందే పువ్వు వాడిపోయి
ద్రాక్షకాయలు పరిపక్వం అవుతుండగానే
ఆయన పోటకత్తులతో ద్రాక్ష తీగెలను నరికి
వ్యాపిస్తున్న కొమ్మలనూ రెమ్మలనూ కోసివేస్తాడు.
6 వాటిని కొండలలో ఉన్న క్రూరపక్షులకూ
భూమిమీద ఉన్న మృగాలకూ వదలివేస్తాడు.
ఎండ కాలంలో ఆ పక్షులు వాటిని తింటాయి,
చలికాలంలో ఆ మృగాలు వాటిని తింటాయి.
7 అప్పుడు కానుకలు సేనలప్రభువు యెహోవా దగ్గరికి తేవడం జరుగుతుంది.
ఆ కానుకలు నున్నని చర్మం గల
పొడుగాటి ఆ జనం దగ్గరనుంచి,
నలుదిక్కులా భయం కలిగించే ఆ జనం దగ్గరనుంచి,
ఆ బలమైన జనం దగ్గరనుంచి,
ఇతర జనాలను అణగద్రొక్కే ఆ జనం దగ్గరనుంచి,
నదులు విభజించే ఆ దేశంనుంచి వస్తాయి.
ఆ కానుకలు సేనలప్రభువు యెహోవా పేరు ఉన్న
సీయోను కొండకు వస్తాయి.