17
1 ✽దమస్కు విషయం దేవోక్తి:దమస్కు నగరం కాకుండా పోతుంది.
అది శిథిలాలవుతుంది.
2 ఆరోయేర్ పట్టణాలు నిర్జనమవుతాయి.
అవి గొర్రెల మందలు మేసే స్థలాలవుతాయి.
అవి అక్కడ పడుకొంటాయి.
వాటిని బెదరించడానికి ఎవరూ ఉండరు.
3 ✽ఎఫ్రాయింకు కోటలు లేకుండా పోతాయి.
దమస్కుకు రాజ్యం లేకుండా ఉంటుంది.
ఇస్రాయేల్‌ప్రజ వైభవానికి జరిగినట్టు
సిరియావాళ్ళలో మిగిలేవాళ్ళకు జరుగుతుంది”
అని సేనలప్రభువు యెహోవా చెపుతున్నాడు.
4 ఆ రోజు యాకోబు వైభవం హీనదశ చెందుతుంది.
అతడి కొవ్విన శరీరం కృశించిపోతుంది.
5 పంట కోసేవాడు దంట్లు కోసినట్లు,
అతడి చెయ్యి కంకులు కోసినట్లు ఉంటుంది.
రెఫాయిం✽ లోయలో మనిషి పరిగె ఏరినట్లుంటుంది.
6 ✽అయినా దానిలో పరిగె పండ్లు మిగిలి ఉంటాయి.
ఆలీవ్‌చెట్టు దులిపివేస్తే పైకొమ్మల చివరను
రెండు మూడు పండ్లు మిగిలి ఉన్నట్లు,
ఫలవంతమైన కొమ్మలలో నాలుగు అయిదు పండ్లు
మిగిలి ఉన్నట్లు ఉంటుంది అని ఇస్రాయేల్ ప్రజల
దేవుడు యెహోవా అంటున్నాడు.
7 ✽ఆ కాలంలో మనుషులు తమను సృజించినవాని వైపు చూస్తారు, ఇస్రాయేల్‌ప్రజల పవిత్రునివైపు తమ కండ్లు తిప్పుకొంటారు. 8 గాని, తాము చేతులతో చేసిన బలిపీఠాలవైపు✽ చూడరు, వ్రేళ్ళతో చేసిన ఆషేరా✽దేవి స్తంభాల వైపు, ధూపవేదికల వైపు కూడా చూడరు.
9 ✽ఆ కాలంలో, ఇస్రాయేల్‌ప్రజల భయంచేత వాళ్ళు విడిచివెళ్ళిన బలమైన పట్టణాలు నిర్జనమైన అడవులలాగా, కొండసీమలలాగా ఉంటాయి. ఆ దేశం పాడైపోతుంది.
10 ఎందుకంటే, నీవు నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి
మరచి పొయ్యావు✽.
నీకు కోటగా ఉన్న ఈ ఆధారశిలను జ్ఞాపకం ఉంచుకోలేదు.
అందుచేత నీవు అందమైన తోటలను నాటినా,
విదేశీయ ద్రాక్ష చెట్లను నాటినా,
11 వాటిని నాటే రోజున వాటిచుట్టూ కంచె వేసినా,
పొద్దున్నే నీవు వేసిన విత్తనాలు పూసేలా చేసినా,
గాయాలూ, మానని బాధా కలిగే రోజున పంట
అంతర్ధానం అవుతుంది.
12 ✽ అయ్యో! అనేక జనాలు గర్జించడం వినబడుతూ ఉంది,
ఆ గర్జన సముద్రాల గర్జనలాంటిది.
జాతులు గొప్ప ప్రవాహాల ఘోషలాగా
ఘోషిస్తూ ఉన్నాయి.
13 జాతులు విస్తార జలాల ఘోషలా ఘోషిస్తూ ఉన్నా,
ఆయన✽ వాటిని మందలించేటప్పుడు అవి
దూరంగా పారిపోతాయి.
కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోయే విధంగా,
తుఫాను ఎదుట గిరగిర తిరిగే కసవు
ఎగిరిపోయే విధంగా అవి కొట్టుకుపోతాయి.
14 ✽సాయంకాల సమయంలో హఠాత్తుగా
భయం కలుగుతుంది.
ఉదయం కాకముందే అవి లేకపోతాయి.
ఇదే మమ్మల్ని దోచుకొనేవాళ్ళ వంతు.
మమ్మల్ని కొల్లగొట్టేవాళ్ళకు పట్టే గతి ఇదే.