16
1 ఎడారిలో ఉన్న సెలనుంచి దేశపరిపాలకుడికి
సీయోను కుమారి పర్వతానికి గొర్రెపిల్లలను
కానుకగా పంపండి.
2 మోయాబు స్త్రీలు అరనోను రేవులదగ్గర,
గూటినుంచి చెదరి అటూ ఇటూ ఎగిరే
పక్షులలాగా ఉన్నారు.
3 “మాకు సలహా చెప్పు, నిర్ణయం చెయ్యి.
చీకటి కమ్మినట్లు మధ్యాహ్నంలో
నీ నీడ మామీద ఉండేలా చెయ్యి.
పారిపోయినవారిని దాచిపెట్టు.
శరణాగతులను పట్టియ్యకు.
4 మోయాబు పలాయితులను నీతో ఉండనియ్యి.
వినాశకారి బారినుంచి వాళ్ళకు ఆశ్రయంగా ఉండు”.
దౌర్జన్యపరులు అంతరించిపోతారు.
నాశనం మానిపోతుంది. దేశాన్ని అణగద్రొక్కినవాళ్ళు
దానిలో లేకుండా అంతర్ధానమవుతారు.
5 అప్పుడు కృపతో సింహాసనం స్థాపించడం జరుగుతుంది.
దావీదు గుడారంలోనుంచి నమ్మకమైనవాడొకడు
ఆ సింహాసనమెక్కుతాడు.
ఆ వ్యక్తి తీర్పు తీర్చేటప్పుడు ధర్మం అనుసరిస్తాడు,
న్యాయం శీఘ్రంగా జరిగిస్తాడు.
6  మోయాబువాళ్ళు ఎంతో గర్వం గల వాళ్ళని మేము విన్నాం.
వాళ్ళ గర్వం, మిడిసిపాటు, అహంభావం,
దర్పం విషయం మాకు వినబడింది.
అయితే వాళ్ళ డంబాలు వట్టివి.
7 గనుక మోయాబువాళ్ళు రోదనం చేస్తారు.
వాళ్ళంతా మోయాబు విషయం రోదనం చేస్తారు.
కీర్‌హరెశెత్‌లోని ద్రాక్షపండ్ల అడలు దొరకక
మీరు మూలుగుతారు.
8 ఎందుకంటే, హెష్బోను పొలాలు సిబ్మాలో
ద్రాక్షచెట్లు వాడిపొయ్యాయి.
అక్కడి మేలిరకమైన ద్రాక్షచెట్లను
దేశాల పరిపాలకులు త్రొక్కివేశారు.
ఒకప్పుడు వాటి తీగలు యాజరు వరకు ఉన్నాయి.
ఎడారికి ప్రాకాయి, ఇంకా సాగిపోయి సముద్రం
వరకు వ్యాపించాయి.
9  అందుచేత యాజరువాళ్ళు ఏడ్చినట్టు
నేను సిబ్మా ద్రాక్ష తీగలకోసం ఏడుస్తాను.
హెష్‌బోను! ఏలాలే! నా కన్నీళ్ళతో
నిన్ను తడుపుతాను.
నీ ఎండకాలం పండ్ల గురించి,
నీ కోత గురించి సంతోషించడం అయిపోయింది.
10 సంతోషం, ఉల్లాసం ఫలవంతమైన పొలాలనుంచి
మానిపొయ్యాయి,
ద్రాక్షతోటలలో పాటలు, ఉత్సాహధ్వనులు
వినబడడం లేదు.
గానుగ తొట్లలో ద్రాక్షపండ్లను ఎవడూ త్రొక్కడం లేదు.
అక్కడి సంతోషం మానేలా నేను చేశాను.
11 మోయాబుకోసం నా అంతరంగం
సితారా తంతులలాగా వణకుతూ ఉంది.
కీర్‌హరెశెతు కోసం నా ఆంతర్యం
మూలుగుతూ ఉంది.
12 మోయాబువాళ్ళు పూజాస్థలానికి వెళ్ళి అలసిపోయేటప్పుడు, ప్రార్థన చేయడానికి గుడికి వెళ్ళేటప్పుడు ప్రయోజనం ఉండదు.
13 మునుపు యెహోవా మోయాబు విషయం చెప్పిన వాక్కు అదే. 14 ఇప్పుడు యెహోవా ఇంకా అంటున్నాడు, “కూలివాళ్ళ లెక్కప్రకారం మూడేళ్ళలోగా మోయాబు వైభవం, దాని పెద్ద జనసమూహాలు తృణీకారానికి గురి అవుతాయి. వాళ్ళలో కొద్దిమందే మిగులుతారు. వాళ్ళూ అల్పులుగా ఉంటారు.”