15
1 ✽మోయాబు దేశం విషయం దేవోక్తి.మోయాబులో ఉన్న ఆర్ పాడైపోయింది,
ఒకే రాత్రిలో నాశనమైంది!
మోయాబులో ఉన్న కీర్ పాడైపోయింది,
ఒకే రాత్రిలో నాశనమైంది!
2 ఏడ్వడానికి వాళ్లు గుడికి,
ఎత్తయిన పూజాస్థలంమీద ఉన్న
దీబోనుకు ఎక్కిపోతున్నారు.
మోయాబువాళ్ళు నెబో విషయం,
మేదేబా విషయం రోదనం చేస్తున్నారు.
ప్రతి తలనూ బోడిచేయడం,
ప్రతి గడ్డాన్నీ గొరిగించడం✽ జరిగింది.
3 తమ వీధులలో వాళ్ళు గోనెపట్ట కట్టుకొన్నారు.
తమ మిద్దెలమీద, ఊళ్ళ విశాల స్థలాలలో
అందరూ రోదనం చేస్తున్నారు,
కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.
4 హెష్‌బోనువాళ్ళు, ఏలాలేవాళ్ళు కేకలు వేస్తున్నారు.
వాళ్ళ కంఠధ్వని యాహసువరకు వినబడుతున్నది.
గనుక మోయాబు సైనికులు అరుస్తున్నారు.
వాళ్ళ మనసులు ఆందోళన పడుతున్నాయి.
5 ✝“మోయాబు విషయం నేను అంతరంగంలో
అరుస్తున్నాను. దాని పలాయితులు సోయరువరకు,
ఎగ్లాత్‌షలీషీయా వరకు పారిపోతున్నారు.
లూహీతు ఎక్కుడు త్రోవలో వెళ్ళిపోతూ
ఏడుస్తూ ఉన్నారు.
నాశనమయ్యామని కేకలు వేస్తూ
హొరొనయీం త్రోవలో పోతున్నారు.
6 నిమ్రీనులో ఉన్న నీళ్ళు ఇంకిపోయాయి.
గడ్డి ఎండిపోయింది. చెట్టుచేమలు
వాడిపొయ్యాయి. పచ్చనిది అంటూ
ఏదీ మిగలలేదు.
7 గనుక వాళ్ళు సంపాదించి కూడబెట్టిన ఆస్తిని
నిరంజిచెట్లున్న నది అవతలకు మోసుకుపోతారు.
8 రోదనం మోయాబు సరిహద్దులవరకు
వ్యాపించింది. ఏడ్పు ఎగ్లయీం వరకు,
బేర్‌యేలీం వరకు వినబడింది.
9 ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తమయ్యాయి.
ఇంతేగాక, నేను దీమోను మీదికి ఇంకా
బాధలు రప్పిస్తాను.
మోయాబునుంచి పారిపోయినవాళ్ళమీదికీ
ఆ దేశంలో మిగిలిన వాళ్ళమీదికీ సింహాన్ని✽
రప్పిస్తాను.”