14
1 అయితే యెహోవా యాకోబు వంశంవారిమీద జాలిపడుతాడు, మరోసారి ఇస్రాయేల్‌ప్రజలను ఎన్నుకొంటాడు, వారిని స్వదేశంలో నివసించేలా చేస్తాడు. విదేశీయులు వారి దగ్గరికి చేరుతారు, యాకోబు వంశంవారితో ఏకం అవుతారు. 2 ఇతర జనాలు వారిని వారి స్వదేశానికి తీసుకువస్తారు. ఆ జనాలు ఇస్రాయేల్ వంశంవారి స్వాధీనమై వారికి దాసదాసీజనం అవుతారు. ఇస్రాయేల్‌ప్రజలు తమను బందీలుగా చేసినవాళ్ళను బందీలుగా చేస్తారు, తమను అణగద్రొక్కినవాళ్ళను పరిపాలిస్తారు. 3 యెహోవా నీ బాధనుంచి, ఆయాసంనుంచి, కఠిన దాస్యంనుంచి నిన్ను విడిపించి నీకు విశ్రాంతి ప్రసాదించే రోజున 4 నీవు బబులోను రాజు విషయం ఉపమాన రూపంలో ఇలా అంటావు:
“ఇతరులను అణగద్రొక్కినవాడు
ఎలా అంతరించాడో చూడండి!
అతడి ఉన్మాదం అయిపోయింది!
5 దుర్మార్గుల దుడ్డుకర్రనూ పరిపాలకుల రాజదండాన్నీ
యెహోవా విరగ్గొట్టివేశాడు.
6 వాళ్ళు కోపంతో ఎడతెరిపి లేకుండా
జాతులను దెబ్బలు కొట్టినవాళ్ళు.
ఆగ్రహించి దౌర్జన్యంతో విరామం లేకుండా
జనాలను లోబరచుకొన్నవాళ్ళు.
7 ఇప్పుడు లోకమంతా నెమ్మదిగా,
ప్రశాంతంగా ఉంది.
జనాలు ఆనంద గీతాలు ఆలపిస్తారు.
8 తమాల వృక్షాలూ, లెబానోను దేవదారు చెట్లూ నీ విషయం
‘నీవు పడినప్పటినుండి మమ్మల్ని
నరికివేయడానికి ఎవ్వడూ మాదగ్గరికి రావడం లేదు’
అంటూ సంతోషిస్తాయి.
9 “నీవు వస్తూ ఉంటే నిన్ను కలుసుకోవడానికి
క్రింద మృత్యులోకం కదులుతూ ఉంది.
అది నీ రాకడకు ప్రేతాత్మలను –
మునుపు లోకంలో ఉన్న నాయకులందరి ఆత్మలనూ –
పురికొలుపుతూ ఉంది,
జనాల రాజులందరి ఆత్మలనూ వాళ్ళ సింహాసనాల
మీదనుంచి లేపుతూ ఉంది.
10 వాళ్ళంతా నిన్ను చూచి, ‘నీవు కూడా మాలాగా
బలహీనుడవయ్యావు!
మాలాంటి వాడివయ్యావు!’ అంటారు.
11 నీ వైభవాన్ని, నీ తంతివాద్యాల స్వరంతోపాటు
మృత్యులోకంలో పడవేయడం జరిగింది.
నీ క్రింద కీటకాలు వ్యాపిస్తూ ఉన్నాయి.
పురుగులు నిన్ను కప్పుతూ ఉన్నాయి.
12  ప్రకాశమానమైన వేకువ చుక్కా!
నీవు ఆకాశంనుంచి ఎలా పడ్డావో చూడు!
ఒకప్పుడు నీవు జనాలను పడగొట్టేవాడివి.
నీవెలా నేలమట్టం అయ్యావో చూడు!
13 నీవు మనసులో ఇలా అనుకొన్నావు గదా
‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను.
దేవుని నక్షత్రాలకు పైగా
నా సింహాసనాన్ని హెచ్చిస్తాను.
ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను.
14 మేఘాలకు పైగా ఎక్కిపోతాను.
సర్వాతీతుడితో సరిసమానమవుతాను.’
15 “అయితే నీవు మృత్యులోకంలో,
అగాధం లోతుల్లోకి త్రోసివేయబడ్డావు.
16 నిన్ను చూచినవాళ్ళు తేరి చూస్తూ
నీ విషయం ఇలా తలపోస్తున్నారు:
‘భూమిని కదిలించి రాజ్యాలను వణికించినవాడు వీడేనా?
17 లోకాన్ని ఎడారిగా చేసి, దాని పట్టణాలను పడగొట్టి,
తాను బందీలుగా పట్టినవారిని తమ ఇండ్లకు
వెళ్ళనియ్యనివాడు వీడేనా!’
18 “జనాల రాజులలో ప్రతివాడూ
తన సొంత సమాధిలో ఘనతతో పడుకొంటాడు.
19 నీవైతే తిరస్కారానికి గురి అయిన కొమ్మల్లాగా
నీ సమాధిలోనుంచి పారవేయబడ్డావు.
కత్తిపాలై చచ్చినవాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి –
అగాధంలో ఉన్న రాళ్ళ దగ్గరికి దిగిపోయినవాళ్ళ
శవాలు నిన్ను కప్పుతున్నాయి.
నీవు తొక్కబడ్డ పీనుగులాగా అయ్యావు.
20 వాళ్ళతోకూడా నిన్ను పాతిపెట్టడం జరగదు.
ఎందుకంటే, నీ దేశాన్ని పాడుచేశావు,
నీ ప్రజలను హతమార్చావు.
దుర్మార్గుల సంతానం ఇంకెప్పుడూ జ్ఞాపకానికి రారు.
21 తమ పూర్వీకుల అపరాధాల కారణంగా,
అతడి కొడుకులను సంహారం చేసే స్థలాన్ని
సిద్ధం చేయండి.
వాళ్ళు అభివృద్ధి చెంది దేశాన్ని స్వాధీనం చేసుకోకూడదు,
భూతలం అంతటా పట్టణాలను కట్టకూడదు.
22 సేనల ప్రభువు యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్ళమీదికి వచ్చి, బబులోనుకు పేరును, మిగిలినవాళ్ళను, కొడుకులను, సంతతివాళ్ళను లేకుండా కొట్టివేస్తాను. ఇది యెహోవా వాక్కు. 23 నేను దానిని ముళ్ళపందులకు ఉనికిపట్టుగా, చిత్తడి నేలగా చేస్తాను. నాశనం అనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
24 సేనల ప్రభువు యెహోవా శపథం చేసి ఇలా అన్నాడు:
“నేను సంకల్పించినట్టే జరిగితీరుతుంది.
నేను ఆలోచించినట్టే తప్పక నెరవేరుతుంది.
25 నా దేశంలో అష్షూరువాణ్ణి చితగ్గొట్టి వేస్తాను.
నా కొండలమీద వాణ్ణి నలగద్రొక్కివేస్తాను.
వాడి కాడిని నా ప్రజల మీదనుంచి తీసివేయడం,
వాడు ఉంచిన భారాన్ని వారి భుజాలమీదనుంచి
తొలగించడం జరుగుతుంది.”
26 లోకమంతటి విషయం యెహోవా నిర్ణయించినది ఇదే.
అన్ని జనాలమీదా చాచిన చేయి ఇదే.
27 సేనల ప్రభువు యెహోవా దానిని నిర్ణయించాడు.
ఎవరు రద్దుచేయగలరు?
ఆయన చేయి చాచి ఉంది.
దానిని ఎవరు వెనక్కు త్రిప్పగలరు?
28 ఆహాజురాజు చనిపోయిన సంవత్సరంలో ఈ దేవోక్తి వచ్చింది:
29 ఫిలిష్తీయ దేశమా! నిన్ను కొట్టిన దండం
విరిగిపోయిందని అంతగా సంతోషించకు.
ఆ సర్ప వంశంనుంచి కట్లపాము
బయలుదేరుతుంది. దాని ఫలం మిణ్ణాగు.
30 బీదలందరిలో బీదలకు భోజనం దొరుకుతుంది.
దరిద్రులు సురక్షితంగా పడుకొంటారు.
కాని, నేను నీ సంతానాన్ని కరవుచేత చంపిస్తాను.
అది నీకు మిగిలేవాళ్ళను నాశనం చేస్తుంది.
31 ద్వారమా! రోదనం చేయి! పట్టణమా!
కేకలు వెయ్యి! ఫిలిష్తీయా! నీవు భయంతో
కరిగిపోవాలి.
ఉత్తరదిక్కునుంచి పొగ లేస్తూ ఉంది.
వచ్చేవాడి సైన్యంలో వెనుకబడ్డ వాడెవ్వడూ లేడు.
32 ఆ జాతి రాయబారులకు ఏ జవాబివ్వాలి?
“యెహోవా సీయోనును స్థాపించాడు.
ఆయన ప్రజలలో బాధకు గురి అయినవారికి
దానిలో ఆశ్రయం దొరుకుతుంది.”