13
1 ✽ఇది బబులోను✽ విషయం ఆమోజు కొడుకు యెషయాకు వెల్లడి అయిన దేవోక్తి✽:2 ✽వాళ్ళు ప్రముఖుల గుమ్మాలలో ప్రవేశించాలని
చెట్లు లేని కొండమీద పతాకం ఎత్తండి,
కంఠమెత్తి వాళ్ళను పిలవండి, చేసైగ చేయండి.
3 నా పవిత్రులకు✽ నేను ఆజ్ఞ జారీ చేశాను.
నా కోపం నెరవేర్చడానికి నా పరాక్రమశాలురను –
నా ప్రభావాన్ని బట్టి ఆనందించేవారిని పిలిపించాను.
4 వినండి! కొండలలో గొప్ప జనసమూహం ఉన్నట్టు
కలకలం వినబడుతూ ఉంది.
వినండి! జనాలు సమకూడుతూ ఉన్నట్టు
రాజ్యాలలో అల్లకల్లోలం వినబడుతూ ఉంది.
సేనలప్రభువు యెహోవా✽ యుద్ధానికి సైన్యాన్ని
సమకూరుస్తూ ఉన్నాడు.
5 వాళ్ళు యెహోవా కోప సాధనాలుగా ఉన్నారు.
దేశాన్నంతా నాశనం చేయడానికి యెహోవా
వాళ్ళతోకూడ దూర దేశంనుంచి,
ఆకాశ దిగంతాలనుంచి వస్తూ ఉన్నాడు.
6 ✽యెహోవా దినం దగ్గరపడింది✽, రోదనం చేయండి!
అది అమిత శక్తిమంతుని దగ్గరనుంచి
నాశనంలాగా వస్తుంది.
7 అందుచేత ప్రతి చేయీ దించి ఉంటుంది,
ప్రతివాడి గుండె కరిగిపోతుంది.
8 ప్రజలకు భయాందోళన ముంచుకువస్తుంది.
బాధలు, వేదనలు వాళ్ళకు కలుగుతాయి.
కాన్పు నొప్పులు పడే స్త్రీలాగా వాళ్ళు అల్లాడిపోతారు.
వాళ్ళ ముఖాలు మంటల్లాగా ఎర్రబారి,
ఒకరినొకరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు.
9 ఇదిగో, వినండి! యెహోవా దినం వస్తూ ఉంది.
అది ఆగ్రహం, తీవ్రమైన కోపంతో కూడిన క్రూర దినం.
దేశాన్ని పాడు చేయడానికీ పాపులను
దానిలో లేకుండా నాశనం చేయడానికీ అది వస్తుంది.
10 ఆకాశంలో నక్షత్రాలు, నక్షత్ర రాసులు
ప్రకాశించడం మానివేస్తాయి.
ప్రొద్దు పొడిచేటప్పుడు దానిని చీకటి కమ్ముతుంది.
చంద్రమండలం నుంచి వెలుగు రాదు.
11 “నేను లోకాన్ని దాని చెడుగు కారణంగా,
దుర్మార్గులను వాళ్ళ అపరాధాల కారణంగా శిక్షిస్తాను.
గర్విష్టుల మిడిసిపాటును మానిపిస్తాను.
బలాత్కారుల అహంభావాన్ని అణచివేస్తాను.
12 మేలిమి బంగారం కంటే, ఓఫీరు దేశం బంగారం కంటే
మనుషులు అరుదుగా కనిపించేలా చేస్తాను.
13 సేనల ప్రభువు యెహోవా ఆగ్రహానికి,
ఆయన తీక్షణమైన కోప దినానికి ఆకాశాలు వణికేలా,
భూమి కదలి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.
14 ✽“అప్పుడు వేటకు గురి అయిన జింకలాగా,
ఎవడూ పోగుచేయని గొర్రెలలాగా ప్రతి ఒక్కరూ
స్వజనంవైపు తిరుగుతారు, స్వదేశానికి పారిపోతారు.
15 పట్టబడే ప్రతి ఒక్కరూ కత్తిపాలు అవుతారు.
బందీలైన వాళ్ళంతా కత్తివాతతో కూలుతారు.
16 ✽వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ పసిపిల్లలను
విసరికొట్టి ముక్కలు చేయడం జరుగుతుంది.
వాళ్ళ ఇండ్లను దోచుకోవడం,
వాళ్ళ భార్యలను చెరపట్టడం జరుగుతుంది.
17 ✽“వారికి వ్యతిరేకంగా మాదియవాళ్ళను
నేను పురికొల్పుతాను.
వీళ్ళకు వెండి అంటే లెక్కలేదు.
బంగారం అంటే ఇష్టం లేదు.
18 వాళ్ళ విండ్లు యువకులను కూలుస్తాయి.
వాళ్ళు పసిబిడ్డలమీద జాలిపడరు,
చిన్నపిల్లలను కరుణించరు.
19 ✽అప్పుడు రాజ్యాలలో భూషణంగా ఉన్న బబులోను,
కల్దీయవాళ్ళకు గర్వకారణంగా
ఘనతగా ఉన్న బబులోను,
దేవునిచేత పడద్రోయబడ్డ
సొదొమ గొమొర్రాల లాగా అవుతుంది.
20 అప్పటినుండి బబులోను ఇంకా ఎన్నడూ
నివాసస్థలంగా ఉండదు.
తరతరాలకూ దానిలో ఎవరూ కాపురం ఉండరు.
అరబ్బులలో ఎవడూ అక్కడ తన డేరా వేయడు.
గొర్రెల కాపరులు మందలను అక్కడ పడుకోబెట్టరు.
21 ఎడారి జంతువులు అక్కడ పండుకొంటాయి.
నక్కలు దాని ఇండ్లలో ఉంటాయి.
నిప్పుకోళ్ళకు అది ఉనికిపట్టవుతుంది.
కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.
22 దాని నగరులలో నక్కలు కూస్తాయి.
దాని సుఖవిలాసాల భవనాలలో
అడవి కుక్కలు మొరుగుతాయి.
దాని కాలం దగ్గరపడింది.
దానికి మిగిలే రోజులు కొద్దిగానే ఉన్నాయి.”