36
1 హిజ్కియారాజు పరిపాలించిన పద్నాలుగో సంవత్సరంలో అష్షూరు రాజైన సన్‌హెరీబు యూదాలోకి వచ్చి, ప్రాకారాలూ కోటలూ ఉన్న పట్టణాలన్నిటిపైబడి వాటిని లోపరచుకొన్నాడు. 2 అప్పుడు అష్షూరు రాజు లాకీషు పట్టణం నుంచి జెరుసలంలో ఉన్న హిజ్కియారాజు మీదికి రబ్‌షాకేను గొప్ప సైన్యంతో పంపాడు. అతడు చాకలి పొలానికి పోయే త్రోవలో ఉన్న పై కోనేటి కాలువ చివరలో ఆగాడు. 3 హిల్కీయా కొడుకూ, రాజభవనం మీద అధికారి అయిన ఎల్‌యాకీం, లేఖకుడు షెబ్నా, కార్యదర్శి ఆసాపు కొడుకు అయిన యోవాహు అతడి దగ్గరికి వెళ్ళారు. 4 రబ్‌షాకే వారితో ఇలా అన్నాడు:
“ఈ మాట హిజ్కియాతో చెప్పండి: మహా రాజైన అష్షూరు రాజు చెప్పేదేమిటంటే, నీవు నమ్ముకొన్న ఆధారం ఎంతమాత్రం? 5 యుద్ధంకోసం ఆలోచనకూ బలానికీ బదులుగా వట్టి మాటలు పెట్టవచ్చుననుకుంటున్నావా? నీవు ఎవడిమీద నమ్మకం ఉంచి నా మీద తిరగబడ్డావు? 6 ఇదుగో నీవు ఈజిప్ట్‌దేశంమీద నమ్మకం పెట్టావు గదా. ఈజిప్ట్ నలిగిన జమ్మురెల్లులాంటిది. దానిమీద ఆనుకొన్నవాళ్ళ చేతిలోకి అది గుచ్చుకుపోతుంది. ఈజిప్ట్ రాజైన ఫరోమీద నమ్మకం ఉంచినవాళ్ళందరికీ అంతే. 7 పోనీ, ఒకవేళ మీరు మీ దేవుడు యెహోవామీద నమ్మకం ఉంచినవారని నీవు అంటావేమో. అయితే హిజ్కియా తీసివేసినది యెహోవా ఎత్తయిన పూజా స్థలాలూ బలిపీఠాలూ కావా? యూదావాళ్ళతో, జెరుసలంవాళ్ళతో ‘జెరుసలంలో ఉన్న బలిపీఠం ఎదుటే మీరు పూజించాలి’ అని హిజ్కియా చెప్పాడు గదా! 8 హిజ్కియా! ఇప్పుడు నా యజమాని అయిన అష్షూరు రాజుతో పోటీ చేయండి! రెండు వేల గుర్రాలమీద ఎక్కించడానికి నీ దగ్గర రౌతులుంటే వాటిని నీకిస్తాను! 9 లేకపోతే, నీవు నా యజమాని సేవకులైన అధిపతులలో అత్యల్పుణ్ణి ఎలా ఎదిరిస్తావు? రథాలు, రౌతులకోసం నీవు ఈజిప్ట్‌మీద నమ్మకం ఉంచావు గదా! 10 యెహోవా ఆదేశం లేకుండానే నేను ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాననుకున్నావా? దండెత్తి వెళ్ళి ఈ దేశాన్ని నాశనం చేయమని యెహోవా తానే నాతో చెప్పాడు.”
11 అప్పుడు ఎల్‌యాకీం, షెబ్నా, యోవాహు “దయ చూపి మీ సేవకులైన మాతో సిరియా భాషలో మాట్లాడండి. ఆ భాష మాకు వస్తుంది. యూదుల భాషలో మాట్లాడకండి. గోడమీద ఉన్నవారు వింటున్నారు గదా” అని రబ్‌షాకేతో చెప్పారు.
12 అందుకు రబ్‌షాకే అన్నాడు, “మీ యజమానితో, మీతో మాత్రమే ఈ మాటలు చెప్పడానికి నా యజమాని నన్ను పంపాడనుకొంటున్నావా? మీలాగే గోడమీద కూర్చుని ఉన్నవాళ్ళు తమ మలం తినేటట్టు, తమ మూత్రం త్రాగేటట్టు నా యజమాని నన్ను వాళ్ళదగ్గరికి కూడా పంపాడు గదా.”
13 అప్పుడు రబ్‌షాకే నిలబడి, యూదుల భాషలో బిగ్గరగా ఇలా చాటించాడు: “మహారాజైన అష్షూరు రాజు చెప్పినది వినండి. 14 రాజుగారు చెప్పేదేమిటంటే, హిజ్కియాచేత మోసపోకండి. అతడు మిమ్మల్ని తప్పించలేడు. 15 హిజ్కియా అంటున్నాడు గదా – ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తాడు. ఆయన ఈ నగరం అష్షూరు రాజు వశం చేయడు.’ అలా చెప్పి మిమ్మల్ని యెహోవామీద నమ్మకం ఉంచేటట్టు చేయనియ్యకండి. 16 హిజ్కియా చెప్పేమాట వినవద్దు. అష్షూరు రాజు ఇలా చెపుతున్నాడు: ‘మీరు నాతో శాంతి చేసుకోండి. నగరంనుంచి బయటికి నాదగ్గరికి రండి. నేను వచ్చేవరకు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్షచెట్టు పండ్లు, తన అంజూరు చెట్టు పండ్లు తింటూ తన బావిలోని నీళ్ళు త్రాగుతాడు. 17 తరువాత నేను వచ్చి, మిమ్మల్ని మీ సొంత దేశంలాంటి దేశానికి తీసుకుపోతాను. అది గోధుమలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం. ఆహారం, ద్రాక్ష తోటలున్న దేశం.’ 18 కనుక హిజ్కియా ‘యెహోవా మనల్ని విడిపిస్తాడు’ అంటూ మిమ్మల్ని నమ్మించడానికి చూస్తూ ఉంటే అతడి మాట మీరు వినవద్దు. ఏ దేశంవాళ్ళనయినా ఏ దేవుడైనా అష్షూరు రాజు చేతినుంచి విడిపించాడా? 19 హమాతు, అర్పాదు పట్టణాల దేవుళ్ళు ఎక్కడ? సెపర్‌వయీంవాళ్ళ దేవుళ్ళు ఎక్కడ? ఏ దేవుడైనా షోమ్రోనును నా చేతిలోనుంచి విడిపించలేదేం? 20 దేవుళ్ళలో ఏ దేవుడైనా తన దేశాన్ని నా చేతిలో నుంచి ఎప్పుడైనా విడిపించాడా చెప్పండి? యెహోవా నా చేతిలోనుంచి జెరుసలంను ఎలా విడిపిస్తాడు?”
21 అంతకుముందు హిజ్కియారాజు “అతడికి ఏమీ జవాబు చెప్పకూడద”ని ప్రజలకు ఆజ్ఞ జారీ చేశాడు, గనుక వారు మౌనం వహించి ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు. 22 అప్పుడు రాజభవనం మీద అధికారీ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్‌యాకీం, లేఖకుడైన షెబ్నా, కార్యదర్శి ఆసాపు కొడుకు అయిన యోవాహు తమ బట్టలు చింపుకొని, హిజ్కియా దగ్గరికి వచ్చారు. రబ్‌షాకే మాటలు అతనికి తెలియజేశారు.