11
1 యెష్షయి యొక్క మొద్దునుంచి
చిగురు మొలుస్తుంది.
అతడి వేరులనుంచి కొమ్మ పెరిగి ఫలిస్తుంది.
2 ఆయనమీద యెహోవా ఆత్మ నిలిచి ఉంటాడు.
ఆ ఆత్మ జ్ఞాన వివేకాలిచ్చే ఆత్మ;
ఆలోచన, బలం ఇచ్చే ఆత్మ;
తెలివి, యెహోవా పట్ల భయభక్తులిచ్చే ఆత్మ.
3 యెహోవాపట్ల భయభక్తులంటే ఆయనకు
ఎంతో ఇష్టం ఉంటుంది.
తన కంటికి కనిపించేదానిని బట్టి ఆయన
తీర్పు తీర్చడు.
తన చెవులు విన్నదానిని బట్టి నిర్ణయానికి రాడు.
4 నీతి నిజాయితీతో బీదలకు న్యాయం చేకూరుస్తాడు.
లోకంలో ఉన్న దీనులకు పక్షపాతం లేకుండా
నిర్ణయాలు చేస్తాడు.
ఆయన వాక్కు దండంలాంటిదై
లోకాన్ని మొత్తుతుంది.
తన పెదవుల ఊపిరిచేత
ఆయన దుర్మార్గులను చంపుతాడు.
5 ఆయన నడుముకు న్యాయం,
ఆయన మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.
6 అప్పుడు తోడేళ్ళు, గొర్రెపిల్లలు కలిసిమెలిసి ఉంటాయి.
చిరుతపులులు మేకపిల్లల దగ్గర పడుకొంటాయి.
దూడలు, కొదమ సింహాలు, కొవ్విన కోడెలు
దగ్గర దగ్గరగా ఉంటాయి.
చిన్నపిల్లవాడు వాటిని తోలుకుపోతాడు.
7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి మేస్తాయి.
వాటి పిల్లలు ఒకే చోట పడుకొంటాయి.
సింహం ఎద్దులాగా గడ్డి మేస్తుంది.
8 చంటిపిల్ల నాగుపాము పుట్టదగ్గర ఆటలాడుతుంది.
పాలు విడిచిన చిన్న పిల్ల కట్లపాము పుట్టమీద
చెయ్యి ఉంచుతుంది.
9 నా పవిత్రమైన కొండ అంతట్లో ఏదీ హాని చేయదు,
నాశనం చేయదు.
సముద్రం నీళ్ళతో నిండి ఉన్నట్టు లోకం
యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
10 ఆ కాలంలో యెష్షయియొక్క ‘వేరు’ ప్రజలకు జెండాగా నిలుస్తాడు. జనాలు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన విశ్రాంతి స్థలం దివ్యంగా ఉంటుంది. 11 ఆ కాలంలో యెహోవా తన ప్రజలో మిగిలినవారిని రెండో సారి విడిపించడానికి తన చెయ్యి చాపుతాడు; అష్షూరునుంచీ ఈజిప్ట్‌నుంచీ పత్రోస్‌నుంచీ కూషునుంచీ ఏలాంనుంచీ షీనారునుంచీ హమాతునుంచీ సముద్ర ద్వీపాలనుంచీ వారిని విడిపించి తీసుకువస్తాడు.
12 ఆయన జనాలకు పతాకం ఎత్తుతాడు,
దేశభ్రష్టులైపోయిన ఇస్రాయేల్‌ప్రజలను సమకూరుస్తాడు.
భూమి నాలుగు దిక్కులనుంచి చెదరిపోయిన
యూదావారిని సమకూరుస్తాడు.
13 అప్పుడు ఎఫ్రాయింవారికి ఉన్న అసూయ పోతుంది.
యూదావారి పగవాళ్ళు నిర్మూలం అవుతారు.
యూదా అంటే ఎఫ్రాయింవారికి అసూయ ఉండదు,
ఎఫ్రాయిం అంటే యూదావారికి పగ ఉండదు.
14 వారు ఫిలిష్తీయవాళ్ళ ఏటవాలుగా ఉన్న
పడమటి ప్రాంతాలమీదికి ఎగసిపోతారు.
ఎఫ్రాయిం, యూదా కలిసి తూర్పు జనాన్ని దోచుకొంటారు.
ఎదోం దేశాన్ని, మోయాబు దేశాన్ని
స్వాధీనం చేసుకొంటారు.
అమ్మోనువాళ్ళు వారికి లొంగిపోతారు.
15 యెహోవా ఈజిప్ట్ సముద్రం అఖాతాన్ని
నిర్మూలం చేస్తాడు.
యూఫ్రటీసు నది మీద చెయ్యి ఆడించి వడగాలి
వీచేలా చేస్తాడు.
దానిని కొట్టి ఏడు పాయలుగా చేస్తాడు.
పాదరక్షలు తడవకుండా మనుషులు
దాటగలిగేట్టు అలా చేస్తాడు.
16 ఈజిప్ట్‌దేశంనుంచి ఇస్రాయేల్‌ప్రజలు
వచ్చినప్పుడు వారికి దారి కలిగినట్టు,
అష్షూరునుంచి ఆయన ప్రజలలో మిగిలినవారు
వచ్చేటప్పుడు వారికి రాజమార్గం ఉంటుంది.