10
1 ✽ నా ప్రజలలో ఉన్న బీదల హక్కులను బిగపట్టడానికీ,అణగారిపోయినవారికీ న్యాయం చేకూరకుండా చేయడానికి
అన్యాయమైన చట్టాలను ఏర్పరచేవాళ్ళకు,
బాధకరమైన శాసనాలను రాయించే వాళ్ళకు బాధ తప్పదు.
2 వితంతువులను దోపిడీకి గురి చేసి,
అనాథలను దోచుకుందామని వాళ్ళ ఉద్దేశం.
3 ✽అయితే దూరంనుంచి విపత్తు వచ్చే శిక్ష దినాన
మీరు ఏం చేస్తారు?
సహాయంకోసం ఎవరిదగ్గరికి పారిపోతారు?
మీ ఐశ్వర్యాన్ని ఎక్కడ దాచుకొంటారు?
4 బందీలుగా పట్టబడి ముడుచుకోవడం,
హతమై కూలడం – ఈ రెండే జరుగుతాయి.
అయితే దీనితో ఆయన కోపం చల్లారలేదు,
ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.
5 ✽✽“నా కోప దండనగా ఉన్న అష్షూరువాళ్ళకు బాధ తప్పదు.
నా ఆగ్రహాన్ని సూచించే దుడ్డుకర్ర వాళ్ళ చేతిలో ఉంది.
6 భక్తి లేని జనంమీదికి నేను వాళ్ళను పంపుతాను.
దోపిడీసొమ్ము పట్టుకోవడానికి, కొల్లగొట్టడానికి,
వారిని వీధులలోని బురదలాగా త్రొక్కడానికి,
నా కోపానికి గురి అయిన వారిమీదికి వెళ్ళండని
ఆజ్ఞ జారీ చేశాను.
7 ✽అయితే అష్షూరు రాజు అలా అనుకోవడం లేదు.
అది అతడి ఆలోచన కాదు.
నాశనం చేయాలనీ చాలా జనాలను నిర్మూలం చేయాలనీ
అతడి ఆశయం.
8 అతడు ఇలా అనుకొంటున్నాడు:
‘నా అధిపతులంతా రాజులే గదా!
9 ✽కలనో పట్టణం కర్‌కెమీషులాగా ఉంది గదా!
హమాతు పట్టణం ఆరపాద్‌లాగా ఉంది గదా!
షోమ్రోను దమస్కులాగా ఉంది గదా!
10 ✽విగ్రహాలను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి గదా!
వాటి విగ్రహాలు జెరుసలం, షోమ్రోనుల విగ్రహాలకంటే
మించినవి గదా!
11 షోమ్రోనుకూ దాని విగ్రహాలకూ నేను చేసినట్టు
జెరుసలంకూ దాని విగ్రహాలకూ చేయలేనా?”
12 ✽సీయోనుకొండకూ జెరుసలంకూ వ్యతిరేకంగా ప్రభువు తన క్రియ అంతా ముగించిన తరువాత ఆయన ఇలా అనుకొంటాడు:
“నేను అష్షూరు రాజును అతడి అహంభావ ఫలితాన్ని బట్టి, అతడి గర్వం గల చూపులకారణంగా శిక్షిస్తాను. 13 అతడు ఈ విధంగా అనుకొంటున్నాడు:
‘నేను తెలివైనవాణ్ణి. నా చేతి బలంవల్ల,
నా బుద్ధివల్ల అలా చేశాను.
నేను జనాల సరిహద్దులను మార్చాను.
వాటి ఖజానాలను దోచుకొన్నాను.
మహా బలిష్ఠుడినై వాటి రాజులను త్రోసివేశాను.
14 పక్షి గూటిలో మనిషి చెయ్యి పెట్టినట్లు
జనాల ఆస్తి చేజిక్కించుకొన్నాను.
విడవబడ్డ గుడ్లను మనిషి ఏరుకొంటే,
రెక్కలు ఆడించేది, నోరు తెరిచేది కిచకిచలాడేది
ఏమీ లేనట్టు నిరభ్యంతరంగా నేను లోకమంతటినీ
సమకూర్చుకొన్నాను.’
15 ✽తనచేత నరికేవాణ్ణి చూచి గొడ్డలి గొప్పలు చెప్పుకొంటుందా?
తనచేత కోసేవాణ్ణి చూచి రంపం పొగడుకొంటుందా?
కోల తనను ఎత్తేవాణ్ణి ఆడించినట్లు ఉంది ఇది!
దుడ్డుకర్ర కర్ర పూనినవాణ్ణి ఎత్తినట్లుంది!”
16 ✽అందుచేత సేనలప్రభువు యెహోవా
బలిసిన అష్షూరువాళ్ళు చిక్కిపోయేలా చేస్తాడు.
వాళ్ళ వైభవం క్రింద మండుతూవుండే
మంటల్లాగా నిప్పు రాజుతుంది.
17 ఇస్రాయేల్‌ప్రజల ‘వెలుగు’ నిప్పు అవుతుంది.
వారి పవిత్రుడు మంటవుతాడు.
ఆ మంట అష్షూరు ముండ్లచెట్లకూ కంటకాలకూ
అంటుకొని వాటిని ఒక్క రోజునే దహించివేస్తుంది.
18 రోగి క్షీణించిపోయే విధంగా దాని అడవి,
ఫలవంతమైన పొలాల శోభను అది పూర్తిగా
నాశనం చేస్తుంది.
19 దాని అడవులలో చెట్లు కుర్రవాడు
లెక్క పెట్టగలిగేటంత తక్కువగా మిగిలి ఉంటాయి.
20 ✽ఆ రోజున, ఇస్రాయేల్‌ప్రజలలో మిగిలేవారు, యాకోబు వంశంవారిలో తప్పించుకొనేవారు తమ్మును పడగొట్టినవాడి మీద ఇంకా ఆధారపడక, ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడైన యెహోవామీదే నిజంగా ఆధారపడుతారు. 21 యాకోబు వంశీయులలో కొంతమంది మిగిలి బలాఢ్యుడైన దేవునివైపు తిరుగుతారు. 22 ఇస్రాయేల్! సముద్రం ఇసుకలాగా ఉన్న వారిలో నీ ప్రజలు కొంతమంది మాత్రమే తిరిగి వస్తారు. నాశనం నిర్ణయించబడింది. దానితో న్యాయం వరదలాగా వస్తుంది. 23 తాను నిర్ణయించిన నాశనం సేనలప్రభువు యెహోవా దేశమంతటికీ కలిగిస్తాడు.
24 ✽అందుచేత సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు: “సీయోనులో నివాసముంటున్న నా ప్రజలారా! ఈజిప్ట్‌వాళ్ళు చేసినట్టు అష్షూరువాళ్ళు దుడ్డుకర్రతో మిమ్మల్ని కొట్టి మీ మీద దండం ఎత్తినా వాళ్ళకు భయపడకండి. 25 ✝ఇంకా కొద్దికాలానికి నా కోపం చల్లారిపోతుంది. వాళ్ళను నాశనం చేయడానికి నా ఆగ్రహం తిరుగుతుంది.”
26 ✝ఓరేబు బండ దగ్గర మిద్యానువాళ్ళను హతం చేసినట్టే సేనలప్రభువు యెహోవా వాళ్ళమీద కొరడా ఝళిపిస్తాడు, ఈజిప్ట్‌లో చేసినట్టు నీళ్ళమీద తన దండం ఎత్తుతాడు. 27 ✝ఆ రోజున మీ భుజంమీద వాళ్ళు ఉంచిన బరువును తీసివేయడం, మీ మెడమీదనుంచి వాళ్ళ కాడి కొట్టివేయడం జరుగుతుంది.
28 ✽ఆష్షూరు వాళ్ళు ఆయాతుమీద పడుతున్నారు,
మిగ్రోను గుండా వస్తున్నారు, మిక్‌మషులో
సామాను ఉంచుతున్నారు,
29 కొండ సందు దాటి, గెబలో
ఈ రాత్రి గడుపుదా మంటున్నారు.
రమా వణకుతూ ఉంది.
సౌలు పట్టణమైన గిబియా పారిపోతున్నది.
30 గిల్లీం కాపురస్తులారా! బిగ్గరగా కేకలు పెట్టండి.
లాయిషా! విను. అయ్యో, అనాతోతు!
31 మదమేనావాళ్ళు పారిపోతూ ఉన్నారు.
గెబీం నివాసులు ఆశ్రయం కోసం వెదుకుతూ ఉన్నారు.
32 ఈ రోజే సైన్యం నోబులో దిగుతుంది.
సీయోను కుమారి✽ పర్వతంవైపు,
జెరుసలం కొండవైపు,
వాళ్ళు పిడికిలి ఆడిస్తూ ఉన్నారు.
33 ✽అయితే చూడండి! సేనలప్రభువు యెహోవా
భయంకరంగా కొమ్మలను నరికివేస్తాడు.
చాలా పొడవైన చెట్లను పడగొట్టడం జరుగుతుంది.
ఎత్తయినవి కూలుతాయి.
34 అడవిలోని దట్టమైన పొదలను
ఇనుప గొడ్డలితో నరికివేస్తాడు.
లెబానోను బలాఢ్యుడి చేత కూలిపోతుంది.