8
1 యెహోవా నాతో అన్నాడు, “పెద్ద పలక తీసుకొని, మామూలు వ్రాతతో దానిమీద ఈ మాటలు వ్రాయి: ‘మహేర్ షాలాల్ హాష్‌బజు.’ 2 నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఊరియాయాజిని, యెబెరెకయా కొడుకు జెకర్యాను పెట్టుకొంటాను.”
3 తరువాత నేను దేవునిమూలంగా పలికే ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళాను. ఆమె గర్భం ధరించి కొడుకును కన్నది. అప్పుడు యెహోవా “అతడికి ‘మహేర్ షాలాల్ హాష్‌బజు’ అనే పేరు పెట్టు. 4 ఆ పిల్లవాడు ‘నాయనా’ ‘అమ్మా’ అనడం నేర్చుకోకముందే అష్షూరు రాజు దమస్కు సంపత్తునూ షోమ్రోను దోపిడీ సొమ్మునూ ఎత్తుకుపోతాడు” అని నాతో అన్నాడు.
5 యెహోవా ఇంకా నాతో అన్నాడు, 6 “ఈ ప్రజలు ప్రశాంతంగా పారే షిలోహు నీళ్ళు వద్దని, రెజీను, రెమలయా కొడుకు విషయంలో సంతోషిస్తూ ఉన్నారు. 7 ప్రభువు అష్షూర్ రాజూ అతడి సర్వ ప్రతాపమూ అనే బలమైన యూఫ్రటీస్ నదిలోని విస్తారమైన నీళ్ళను వారిమీదికి రప్పిస్తాడు. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి, ఒడ్డులన్నిటిమీద పొర్లిపారుతాయి. 8 అవి యూదా దేశంమీదికి వచ్చి దానిని ముంచివేస్తాయి. నీళ్ళ మట్టం మెడలవరకు హెచ్చుతుంది. ఇమ్మానుయేల్! దాని వరదలు పక్షి చాపిన రెక్కలలాగా నీ దేశ వైశాల్యమంతా వ్యాపిస్తాయి.”
9 జనాల్లారా! రేగండి, ఓడిపోండి! దూర దేశాల్లారా! వినండి!
ఆయుధాలు కట్టుకొని ఓడిపోండి! ఆయుధాలు కట్టుకొని ఓడిపోండి!
10 ఆలోచన చేసుకోండి! అది భంగమవుతుంది.
ఆశయం తెలియజేయండి. అది నెరవేరదు.
ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు.
11 యెహోవా తన బలీయమైన చెయ్యి నామీద ఉంచి, ఈ ప్రజల తీరుతెన్నులను అనుసరించకూడదని నన్ను హెచ్చరించి ఇలా అన్నాడు: 12 “ఈ ప్రజలు ‘కుట్ర’ అని చెప్పే ప్రతిదీ కుట్ర అనుకోవద్దు. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు. దానివల్ల హడలిపోవద్దు. 13 సేనలప్రభువు యెహోవానే పవిత్రుడుగా గౌరవించాలి. మీరు హడలిపోయి భయపడవలసినవాడు ఆయనే. 14 అప్పుడు ఆయన మీకు పవిత్ర ఆశ్రయంగా ఉంటాడు. కాని, ఆయన ఇస్రాయేల్‌యొక్క రెండు రాజవంశాలకు తగిలే రాయిగా, తొట్రుపాటు బండగా ఉంటాడు. జెరుసలం నగరవాసులకు బోనుగా, ఉచ్చుగా ఉంటాడు. 15 వారిలో చాలామంది తొట్రుపడుతారు, కూలి చితికిపోతారు, చిక్కుపడి పట్టబడుతారు.”
16 ఈ హెచ్చరిక మాటలను కట్టి, ఈ ఉపదేశాన్ని ముద్రించి నా శిష్యులకు అప్పగించు. 17 నేను యెహోవాకోసం ఆశతో ఎదురు చూస్తాను. ఆయన యాకోబు వంశానికి తన ముఖం కనబడకుండా చేశాడు గాని, నేను ఆయనమీద నమ్మకముంచుతాను. 18 నన్నూ దేవుడు నాకిచ్చిన పిల్లలనూ చూడండి. సీయోనుకొండ మీద నివసించే సేనలప్రభువు యెహోవా నియమించిన సూచనలుగా, సంకేతాలుగా మేము ఇస్రాయేల్ ప్రజల మధ్య ఉన్నాం.
19 మనుషులు మిమ్మల్ని చూచి “కర్ణపిశాచం గల వాళ్ళనూ, కిచకిచమంటూ గుసగుసలాడే మాంత్రికులనూ సంప్రదించండి” అని చెపుతారేమో. అయితే ప్రజలు తమ దేవునిదగ్గరే విచారణ చేయకూడదా? సజీవులకోసం చచ్చినవాళ్ళ దగ్గర విచారణ చేయడం మంచిదా?
20 ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని విచారించండి! ఈ మాట ప్రకారం వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకు తెల్లవారలేదన్నమాట! 21 కష్టం అనుభవిస్తూ, ఆకలిగొంటూ, వాళ్ళు దేశంలో తిరుగాడుతారు. అలా ఆకలితో ఉన్నప్పుడు కోపంతో మండిపడి, పైకి చూస్తూ, తమ రాజునూ తమ దేవుణ్ణీ శపిస్తారు. 22 భూమివైపు చూచినప్పుడు వాళ్ళకు దురవస్థ, అంధకారం, భయంకరమైన చీకటి కనిపిస్తాయి. వాళ్ళను గాఢాంధకారంలోకి తోసివేయడం జరుగుతుంది.