7
1  ఉజ్జియా మనుమడూ, యోతాం కొడుకూ అయిన ఆహాజు యూదా దేశానికి రాజుగా ఉన్న రోజుల్లో ఇలా జరిగింది. సిరియా దేశం రాజు రెజీను, ఇస్రాయేల్ రాజూ రెమలయా కొడుకూ అయిన పెకహూ జెరుసలం మీద యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే అది వాళ్ళ చేత కాలేదు.
2 “సిరియావాళ్ళు ఎఫ్రాయిం వంశంవాళ్ళతో సంధి చేసుకొన్నారు” అని దావీదు వంశంవారికి వినబడ్డప్పుడు, గాలికి అడవిచెట్లు కదలే విధంగా రాజు హృదయం, అతడి ప్రజల హృదయాలు కదిలాయి.
3 అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నాడు: “ఆహాజును కలుసుకోవడానికి నీవు, నీ కొడుకు షెయార్‌యాషూబుతో కూడా చాకలి పొలానికి పోయేత్రోవలో ఉన్న పై కోనేటి కాలువ కొన దగ్గరికి వెళ్ళి అతడితో ఇలా చెప్పు: 4 జాగ్రత్తగా ఉండు గాని, నెమ్మదిగా ఉండి భయపడకు. రెజీను, సిరియనులు, రెమలయా కొడుకు తీవ్ర కోపానికి పిరికిగా ఉండబోకు. వాళ్ళు పొగలేస్తున్న రెండు కొరకంచు కొనల లాంటివాళ్ళు. 5 సిరియనులు, ఎఫ్రాయింవారు, రెమలయా కొడుకు నీ మీద కుట్ర పన్ని, 6 ‘మనం యూదా మీదికి వెళ్ళి, దానిని చితగ్గొట్టి, ఓడించి, టాబేల్ కొడుకును దానికి రాజుగా చేద్దాం, పట్టండి’ అని చెప్పుకొన్నారు. 7 అయితే యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
ఆ మాట నిలవదు, అలా జరగదు.
8 ఎందుకంటే సిరియాకు రాజధాని దమస్కు.
దమస్కుకు అధిపతి ఈ రెజీను.
అరవై అయిదు సంవత్సరాలలోగా ఎఫ్రాయిం
ఒక జాతిగా ఉండకుండా కొట్టివేయబడుతుంది.
9 ఎఫ్రాయింకు రాజధాని షోమ్రోను. షోమ్రోనుకు అధిపతి రెమలయా కొడుకు.
మీరు విశ్వాసంలో నిలిచి ఉండకపోతే మీరు ఎంతమాత్రం నిలవరు.”
10 మరోసారి యెహోవా ఆహాజుతో మాట్లాడి ఇలా అన్నాడు: 11 “నీ దేవుడైన యెహోవాను సూచన చూపించమని అడుగు. అది మృత్యులోకమంత లోతైనా సరే, ఉన్నత లోకమంత ఎత్తయినా సరే.”
12 అందుకు ఆహాజు, “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు.
13 అప్పుడు ఈ సందేశం వచ్చింది: “దావీదు వంశంవారలారా! వినండి. మనుషులను విసిగించడం చాలదనుకొంటున్నారా? నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా? 14 అందుచేత ప్రభువు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడుతుంది. 15 చెడుగును విసర్జించడానికీ, మంచిని కోరుకోవడానికీ తెలివి వచ్చినప్పుడు ఆ కుమారుడు పెరుగు, తేనె తింటాడు. 16 అయితే మంచిని కోరుకొని చెడుగును విసర్జించే వయసు ఆ అబ్బాయికి వచ్చేముందే నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశం పాడైపోతుంది. 17 యెహోవా నీమీదికి, నీ జనంమీదికి, నీ తండ్రి వంశంమీదికి భయంకరమైన రోజులు రప్పిస్తాడు. ఎఫ్రాయిం, యూదా విడిపోయిన రోజునుంచి నేటివరకు అలాంటి రోజులు రాలేదు. యెహోవా అష్షూరుదేశం రాజును మీమీదికి రప్పిస్తాడు.
18 “ఆ రోజున ఈజిప్ట్ నదుల అంతాలలో ఉన్న జోరీగలనూ, అష్షూరులో ఉన్న కందిరీగలనూ యెహోవా ఈల వేసి పిలుస్తాడు. 19 అవన్నీ వచ్చి నిటారుగా ఉన్న కొండల లోయలలో, బండల సందులలో, ముండ్ల పొదలన్నిటిలో, గడ్డి బీళ్ళన్నిటిలో దిగి నిలుస్తాయి.
20 ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలనుంచి అష్షూరు రాజు అనే మంగలకత్తిని బాడుగకు తీసుకొని, దానితో మీ తల వెండ్రుకలనూ కాళ్ళ వెండ్రుకలనూ గొరిగిస్తాడు. అది గడ్డం కూడా చేస్తుంది.
21 “ఆ రోజున మనిషి చిన్న ఆవునూ రెండు గొర్రెలనూ చావకుండా కాపాడితే, 22 అవి సమృద్ధిగా ఇచ్చే పాలు కారణంగా అతడు పెరుగు తింటాడు. ఈ దేశంలో విడవబడే వారంతా పెరుగు, తేనె తింటారు.
23  కంటకాలు పెరుగుతాయి. 24 దేశంనిండా ముండ్లచెట్లూ కంటకాలూ ఉండడంచేత మనుషులు బాణాలు, విండ్లు చేతపట్టుకొని ఇక్కడికి వస్తారు. 25 మునుపు పారతో తవ్విన కొండలన్నిటిలో ఉన్న ముండ్ల చెట్లకూ కంటకాలకూ భయపడి మీరు అక్కడికి వెళ్ళరు గాని ఆ కొండలకు ఎద్దులను తోలుతారు. వాటిని గొర్రెలు తొక్కుతాయి.”