6
1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో నేను ప్రభువును చూశాను. ఆయన పైకెత్తిన ఉన్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన అంగీ అంచు దేవాలయాన్ని నింపివేసింది. 2 ఆయనకు పైగా సెరాపులు నిలుచున్నారు. ప్రతి సెరాఫుకూ ఆరు రెక్కలున్నాయి. రెండు రెక్కలతో తన ముఖం కప్పుకొన్నాడు, రెంటితో తన కాళ్ళను కప్పుకొన్నాడు, రెంటితో ఎగురుతూ ఉన్నాడు. 3 వారు ఒకరితో ఒకరు ఇలా బిగ్గరగా చెపుతూ ఉన్నారు:
“సేనలప్రభువు యెహోవా పవిత్రుడు! పవిత్రుడు! పవిత్రుడు!
లోకమంతా ఆయన ఘనతతో నిండిపోయింది.”
4 వారి కంఠధ్వనికి గడపకమ్ముల పునాదులు కదిలాయి, దేవాలయం పొగతో నిండిపోయింది.
5 అప్పుడు నేను “అయ్యో! నేను నాశనం అయ్యాను! ఎందుకంటే, నాకు అశుద్ధమైన పెదవులున్నాయి. అశుద్ధమైన పెదవులున్న ప్రజలమధ్య కాపురముంటున్నాను. సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా నా కంటికి కనబడ్డాడు” అన్నాను.
6 అయితే ఆ సెరాఫులలో ఒకడు నా దగ్గరికి ఎగిరి వచ్చాడు. బలిపీఠం మీదనుంచి పట్టకారుతో తీసిన నిప్పుకణిక అతని చేతిలో ఉంది. 7 అతడు నా నోటికి దానిని తగిలించి ఇలా అన్నాడు: “ఇదిగో, ఇది నీ పెదవులకు తగిలింది. నీ అపరాధం తొలగిపోయింది, నీ పాపం కప్పివేయబడింది.”
8 అప్పుడు ప్రభువు “నేను ఎవరిని పంపిస్తాను? మాకోసం ఎవరు వెళ్తారు?” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నేను “ఇదిగో, నేను ఇక్కడ ఉన్నాను. నన్ను పంపించు” అన్నాను.
9 అప్పుడు ఆయన అన్నాడు, “నీవు వెళ్ళి, ఈ ప్రజలతో ఈ విధంగా చెప్పు:
‘మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని, అర్థం చేసుకోరు.
ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని, గ్రహించరు.’
10 ఈ ప్రజల హృదయాలను మొద్దుబారి పోయేలా చెయ్యి!
చెవులు కూడా మందం అయ్యేలా చెయ్యి!
వారి కళ్ళను మూయించు!
వారు కళ్ళతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని,
నావైపు తిరిగి, నివారణ పొందకుండా అలా చేయాలి.”
11 అందుకు నేను “ప్రభూ, ఎన్నాళ్ళవరకూ?”
అని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చాడు:
“కాపురస్తులు లేకుండా పట్టణాలు నాశనమయ్యేవరకు,
ఇళ్ళు నిర్మానుష్యం అయ్యేవరకు, దేశం పూర్తిగా పాడైపోయేవరకు,
12 యెహోవా ఈ మనుషులను దూరంగా తొలగించేవరకు,
దేశంలో అనేక స్థలాలు శిథిలాలయ్యేవరకు.
13 ప్రజలలో పదో భాగం దేశంలో మిగిలి ఉంటుంది.
అయినా దేశం మళ్ళీ నాశనమవుతుంది.
సిందూర, మస్తకి వృక్షాలను నరికిన తరువాత
వాటి మొద్దులు మిగిలి ఉంటాయి.
అలాగే దేశంలో మొద్దులాగా పవిత్ర సంతానం మిగిలి ఉంటుంది.”