5
1 నా ప్రియుణ్ణి గురించి పాడుతాను.
నా ప్రియుడి ద్రాక్షతోట విషయం పాడుతాను.
సారవంతమైన భూమి ఉన్న కొండమీద
నా ప్రియుడికి ద్రాక్షతోట ఉంది.
2 ఆయన దాన్ని బాగా త్రవ్వాడు. రాళ్ళను తీసివేశాడు.
దానిలో మేలిరకం ద్రాక్ష తీగె నాటించాడు.
తోట మధ్య కావలిగోపురం కట్టాడు.
దానిలో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించాడు.
ద్రాక్ష పండ్లు పండాలని ఎదురు చూశాడు.
కాని, అది కాసినది కారు ద్రాక్షలే.
3 “అందుచేత జెరుసలం కాపురస్తులారా, యూదా వారలారా,
నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పండి.
4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే
చేయగలిగినది ఇంకేమిటి?
ద్రాక్షపండ్లకోసం నేను ఎదురు చూస్తే
అది ఎందుకు కారు ద్రాక్షలు కాసింది?
5 “ఇప్పుడు నేను నా ద్రాక్షతోటకు ఏమి చేస్తానో
మీకు తెలియచేస్తాను, వినండి.
దాని కంచెను తీసివేస్తాను.
తోట నాశనం అవుతుంది. దాని గోడ పడగొట్టివేస్తాను.
ఇతరులు దానిని త్రొక్కుతారు.
6 తోట పాడుపడేలా చేస్తాను. దానిని చక్కబెట్టడం,
పారతో త్రవ్వడం జరగదు.
దానిలో ముండ్లచెట్లు, కంటకాలు మొలుస్తాయి.
దానిమీద వర్షించవద్దని మేఘాలకు
ఆజ్ఞ జారీ చేస్తాను.”
7 సేనలప్రభువైన యెహోవా ద్రాక్షతోట ఇస్రాయేల్ వంశమే.
ఆయనకు ఇష్టమైన వనం యూదావారే.
న్యాయం కనబడాలని ఎదురు చూశాడు కాని,
కనిపించినది రక్తపాతమే.
న్యాయం కావాలని చూశాడు గాని,
రోదనం మాత్రమే వినబడింది.
8 మీరు మాత్రమే దేశంలో ఉండాలని స్థలం మిగులకుండా
ఉండేవరకు ఇంటికి ఇల్లు కలుపుకొంటూ, పొలానికి పొలం
చేర్చుకొంటూ ఉండేవారలారా, మీకు బాధ తప్పదు.
9 సేనలప్రభువు యెహోవా ఇలా తేటగా చెప్పడం నేను విన్నాను:
“నిజంగా ఘనమైన గొప్ప ఇండ్లు అనేకం పాడైపోతాయి.
వాటిలో ఎవరూ కాపురముండరు.
10 పది ఎకరాల ద్రాక్షతోట ఇరవై లీటర్ల రసం మాత్రమే ఇస్తుంది.
పది తూముల గింజల పంట తూము మాత్రమే అవుతుంది.”
11 మద్యం త్రాగాలని ఉదయమే లేచి, ద్రాక్షమద్యం
తమకు మంట పుట్టించేవరకు చాలా రాత్రివరకు
తాగేవాళ్ళకు బాధ తప్పదు.
12 వాళ్ళ విందులలో ఆయా తంతివాద్యాలు, కంజర్లు,
పిల్లనగ్రోవులు, ద్రాక్షమద్యం ఉంటాయి.
వాళ్ళు యెహోవా చర్యలను గమనించరు.
ఆయన చేతులు చేసినవాటి విషయంలో అలక్ష్యంగా ఉన్నారు.
13 అందుచేత, నా ప్రజలు తెలివి లేక, బందీలుగా దేశాంతరం పోతారు,
వారిలో ఘనులు ఆహారం లేక పస్తుంటారు.
సామాన్యులు దప్పిచేత నీరసించిపోతారు.
14 కనుక మృత్యులోకం గొప్ప ఆశపెట్టుకొని,
అపరిమితంగా నోరు తెరుస్తూ ఉంది;
జెరుసలం ఘనులూ సామాన్యులూ దాని అల్లరి,
ఉత్సవ ధ్వనులతోపాటు అందులోకి దిగిపోతారు.
15  అల్పులూ ఘనులూ అణగిపోతారు. గర్విష్ఠుల చూపు క్రుంగిపోతుంది.
16 అయితే సేనలప్రభువు యెహోవా తీర్పు తీర్చి గౌరవం పొందుతాడు.
పవిత్రుడైన దేవుడు తన న్యాయవర్తన మూలంగా
తాను పవిత్రుడుగా కనుపరుచు కొంటాడు.
17 అప్పుడు అక్కడి గొర్రెపిల్లలు తమ పచ్చిక
మైదానాలలో ఉన్నట్టే మేస్తాయి.
గొప్పవాళ్ళ శిథిలాల మధ్య పరాయివాళ్ళు భోజనం చేస్తారు.
18 అబద్ధం అనే త్రాళ్ళతో చెడుగును లాక్కొనేవాళ్ళకు
బాధ తప్పదు. బండి మోకులతో లాక్కొన్నట్టు
పాపాన్ని లాక్కొనేవాళ్ళకు బాధ తప్పదు.
19 “మేము దేవుని క్రియ చూచేలా ఆయన త్వరపడి
దానిని శీఘ్రంగా ముగించాలి.
మేము ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి సంకల్పాన్ని
తెలుసుకొనేలా దానిని నెరవేరనియ్యి”
అనేవాళ్ళకు బాధ తప్పదు.
20 చెడుగును మంచి, మంచిని చెడుగు
అనేవాళ్ళకు బాధ తప్పదు.
21  తమ దృష్టికి తాము తెలివైనవాళ్ళమని,
తమ అంచనాలో తాము వివేకంగల వాళ్ళమని
భావించుకొనేవాళ్ళకు బాధ తప్పదు.
22 ద్రాక్షమద్యం త్రాగడంలో వీరులకూ వేరు వేరు మద్యపానాలను
కలపడంలో సామర్థ్యం గలవాళ్ళకూ బాధ తప్పదు.
23 లంచం తీసుకొని దుర్మార్గులు నిర్దోషులని తీర్పు తీర్చి,
నిర్దోషులకు న్యాయాన్ని చేకూర్చకుండా ఉండేవాళ్ళకు
బాధ తప్పదు.
24 వాళ్ళు సేనలప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు,
ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి వాక్కును తృణీకరించారు,
గనుక మంటలు చెత్తను కాల్చివేసే విధంగా,
ఎండిన గడ్డి మంటల్లో బూడిద అయ్యేవిధంగా,
వాళ్ళ వేరు కుళ్ళిపోతుంది.
వాళ్ళ పువ్వు దుమ్ములాగా పైకి ఎగిరిపోతుంది.
25 వాళ్ళ ప్రవర్తన కారణంగా యెహోవా కోపం ఆయన ప్రజలమీద
మండుతూ ఉంది. ఆయన వాళ్ళమీదికి చేయి చాచి
వాళ్ళను కొట్టాడు. పర్వతాలు వణికాయి.
ఇంతగా జరిగినా ఆయన కోపం చల్లారలేదు.
తన చేయి ఇంకా చాపుతూ ఉన్నాడు.
26 ఆయన దూరంగా ఉన్న జనాలకు పతాకం ఎత్తుతాడు.
భూమి కొననుంచి సైన్యాన్ని రప్పించడానికి ఈల వేస్తాడు.
అదిగో అది శీఘ్రంగా, వేగంగా వస్తూ ఉంది.
27 వాళ్ళలో ఎవడూ అలసిపోవడం లేదు. తొట్రుపడడం లేదు.
ఎవడూ నిద్రపోవడం లేదు, కునకడం లేదు.
ఎవడి నడికట్టూ విడిపోవడం లేదు,
ఎవడి పాదరక్షలవారూ తెగిపోవడం లేదు.
28 వాళ్ళ బాణాలు పదును గలవి. వాళ్ళ విండ్లన్నీ
ఎక్కుపెట్టి ఉన్నాయి. వాళ్ళ గుర్రాల డెక్కలు
చెకుముకి రాళ్ళలాంటివి.
వాళ్ళ రథ చక్రాలు సుడిగాలిలాగా తిరుగుతూ ఉన్నాయి.
29 వాళ్ళ గర్జన ఆడసింహం చేసే గర్జనలాంటిది.
వాళ్ళు కొదమ సింహాలలాగా గర్జిస్తూ ఉన్నారు.
వేటను పట్టుకొని గుర్రుమనే ధ్వని చేస్తూ ఉన్నారు.
దానిని ఎత్తుకుపోతారు. తప్పించేవాడెవడూ లేడు.
30 ఆ రోజున వాళ్ళు జనంమీద సముద్రఘోషలాగా గర్జన చేస్తారు.
ఎవరైనా దేశంవైపు చూస్తే చీకటి, దురవస్థ కనిపిస్తాయి.
అక్కడి మబ్బులచేత వెలుగు కూడా చీకటి అవుతుంది.