4
1 ఆ రోజుల్లో ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని ఇలా అంటారు: “మా సొంత అన్నం తింటాం, మా సొంత బట్టలు కట్టుకుంటాం. మీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయండి.”
2 ఆ రోజుల్లో యెహోవా కొమ్మ అందంగా ఘనంగా ఉంటుంది. ఇస్రాయేల్ ప్రజలలో తప్పించుకొన్నవారికి ఆ దేశ ఫలసాయం గర్వకారణంగా అలంకార ప్రాయంగా ఉంటుంది. 3 సీయోనులో శేషించినవారినీ జెరుసలంలో మిగిలినవారినీ – జెరుసలంలో సజీవుల గ్రంథంలో రాసి ఉన్నవారందరినీ పవిత్రులు అంటారు. 4 తీర్పు తీర్చే ఆత్మవల్ల, దహించే ఆత్మవల్ల ప్రభువు సీయోను నగర స్త్రీలకు ఉన్న కల్మషాన్ని కడిగివేస్తాడు. దానికి తగిలిన రక్తాన్ని జెరుసలంలోనుంచి శుద్ధి చేస్తాడు. 5  అప్పుడు సీయోను కొండ అంతటిమీదా అక్కడ సమకూడే వారందరిమీదా పగలు మబ్బునూ పొగనూ యెహోవా కలగజేస్తాడు. రాత్రి మండుతున్న మంటల ప్రకాశాన్ని కలగజేస్తాడు. ఆ శోభ అంతటిమీదా పందిరి ఉంటుంది. 6 పగలు అది ఎండకు నీడగా, పైకప్పుగా, గాలివానకు ఆశ్రయంగా, చాటుగా ఉంటుంది.