3
1 ఇదిగో వినండి. సేనలప్రభువు యెహోవా పోషణ,
ఆధారం జెరుసలంనుంచి, యూదానుంచి
తీసివేయ బోతున్నాడు.
అన్నపానాల ఆధారమంతా, పోషణ అంతా,
2 బలాఢ్యులను సైనికులను, న్యాయాధిపతులను,
ప్రవక్తలను, సోదె చెప్పేవాళ్ళను, పెద్దలను,
3 యాభైమందికి అధిపతులను, ఘనులను, ఆలోచనకర్తలను,
శిల్పశాస్త్రంలో ఆరితేరినవాళ్ళను, యుక్తిగల మాంత్రికులను
తీసివేయ బోతున్నాడు.
4  నేను ఆ ప్రజలమీద అధిపతులుగా కుర్రవాళ్ళను
నియమిస్తాను.
పిల్ల చేష్టలు చేసేవాళ్ళు వాళ్ళను పరిపాలిస్తారు.
5 ప్రజలలో ప్రతి ఒక్కరూ తోడివాళ్ళపట్ల, పొరుగువాళ్ళపట్ల
కఠినంగా వ్యవహరిస్తారు.
పెద్దలమీద యువకులూ, ఘనులమీద నీచులూ
గర్వించి వారిని ఎదిరిస్తారు.
6 ఒక మనిషి తన తండ్రి ఇంట్లో తన తోబుట్టినవాణ్ణి
పట్టుకొని, “నీకు పైవస్త్రం ఉంది. మాకు నాయకుడుగా ఉండు,
ఈ శిథిలాలను నీ అధీనంలో ఉంచుకో” అంటాడు.
7 అయితే ఆ రోజున అతడు “నేను బాగు చేసేవాణ్ణి కాను.
నా ఇంట్లో భోజనం, బట్టలు లేవు.
నన్ను ప్రజానాయకుడుగా చేయకూడదు” అని చెప్తాడు.
8 జెరుసలం తొట్రుపడింది. యూదా నాశనమయింది.
వారి మాటలు, చర్యలు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
వారు ఆయన ఘనమైన దృష్టికి తిరుగుబాటు చేస్తున్నారు.
9 వారి ముఖకవళికలే వారిమీద సాక్ష్యం ఇస్తున్నాయి.
తమ అపరాధాన్ని దాచిపెట్టక సొదొమ పట్టణంవాళ్ళలాగే
దానిని ప్రదర్శిస్తున్నారు.
తమమీదికి తామే విపత్తును తెచ్చిపెట్టు కొన్నారు.
వారికి బాధ తప్పదు.
10 “మీకు మేలు కలుగుతుంది” అని న్యాయవంతులతో చెప్పు.
వారు తమ క్రియల ఫలితం అనుభవిస్తారు.
11 దుర్మార్గులకు బాధ తప్పదు.
వాళ్ళ వ్యవహారాలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది.
12 నా ప్రజలు! – యువకులు వారిని అణచివేస్తున్నారు,
స్త్రీలు వారిని పరిపాలిస్తున్నారు!
నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని
త్రోవ తప్పిస్తున్నారు,
మీ మార్గాలను నాశనం చేస్తున్నారు.
13 యెహోవా వాదించడానికి నిలబడ్డాడు.
ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలుచున్నాడు.
14 యెహోవా తన ప్రజల పెద్దలకూ నాయకులకూ
తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు.
సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“మీరు నా ద్రాక్షతోటను నాశనం చేశారు.
మీరు దోచుకొన్న దరిద్రుల వస్తువులు మీ ఇండ్లలో ఉన్నాయి.
15 నా ప్రజలను నలగ్గొట్టడానికి, బీదల ముఖాలను
నూరడానికి మీకు ఏమైనా హక్కు ఉందా?”
16 యెహోవా ఇంకా చెప్పేదేమిటంటే,
“సీయోను నగర స్త్రీలు విర్రవీగుతున్నారు.
మెడ చాచి, ఓర చూపులు చూస్తూ,
తమ కాళ్ళ గజ్జెలను మ్రోగిస్తూ, కులుకుతూ
నడుస్తూ ఉండేవాళ్ళు.”
17 అందుచేత ప్రభువు సీయోనునగర స్త్రీల
నడినెత్తి వెండ్రుకలు ఊడిపడేలా చేస్తాడు.
యెహోవా వాళ్ళ దిగంబరత్వం బట్టబయలు చేస్తాడు.
18 ఆ రోజున ప్రభువు వాళ్ళ అలంకారాన్ని తీసివేస్తాడు – ఆ పాద కడియాలనూ, శిరో భూషణాలనూ, చంద్రవంక కంఠ భూషణాలనూ, 19 చెవిపోగులనూ, గాజులనూ, ముసుకులనూ, 20 కుళ్ళాయిలనూ, కాళ్ళ గొలుసులనూ, ఒడ్డాణాలనూ, పరిమళం బరిణెలనూ, తాయెత్తులనూ, 21 ఉంగరాలనూ, ముక్కు కమ్ములనూ, 22 చాలా వెల గల బట్టలనూ, పైవస్త్రాలనూ, పైటలనూ, డబ్బుసంచులనూ, 23 చేతి అద్దాలనూ, శ్రేష్ఠమైన చేతి రుమాళ్ళనూ, తలగుడ్డలనూ, శాలువులనూ తీసివేస్తాడు.
24 అప్పుడు పరిమళానికి బదులు కంపు, ఒడ్డాణాలకు బదులు త్రాడు,
అల్లిన జడలకు బదులు బోడి తలలు,
శ్రేష్ఠమైన దుస్తులకు బదులు గోనెపట్ట,
అందానికి బదులు వాతలు ఉంటాయి.
25 నీ మనుషులు ఖడ్గంచేత కూలుతారు.
నీ బలాఢ్యులు యుద్ధంలో హతమవుతారు.
26 సీయోను ద్వారాలకు రోదనం, దుఃఖం కలుగుతాయి.
నగరం నిర్జనమై నేల కూర్చుని ఉంటుంది.