2
1 యూదా, జెరుసలం విషయం ఆమోజు కొడుకు యెషయా దర్శనం మూలంగా చూచిన విషయం ఇది:
2  చివరి రోజులలో యెహోవా ఆలయ పర్వతం
పర్వతాలన్నిటిలో ప్రధానమైనదిగా సుస్థిరమవుతుంది.
కొండలకంటే ఎత్తుగా ఉంటుంది. అన్ని దేశాలవారు
ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
3 ఆ కాలంలో అనేక జనాలు వచ్చి ఇలా అంటారు:
“యెహోవా పర్వతమెక్కి యాకోబుయొక్క దేవుని
ఆలయానికి వెళ్దాం, రండి.
ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు.
మనం ఆయన త్రోవల్లో నడుచుకుంటాం.”
సీయోనులోనుంచి ఉపదేశం, జెరుసలంలోనుంచి
యెహోవా వాక్కు వెలువడుతాయి.
4 ఆయన జనాలకు మధ్యవర్తిగా న్యాయం తీరుస్తాడు.
అనేక జనాలకు వివాదాలను పరిష్కరిస్తాడు.
వారు తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా,
తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొట్టివేస్తారు.
జనంమీదికి జనం ఖడ్గం ఎత్తకుండా ఉంటారు,
యుద్ధం చేయడం ఇకనుంచి నేర్చుకోరు.
5 యాకోబు వంశంవారలారా, రండి!
మనం యెహోవా వెలుగులో నడుచుకొందాం.
6 యాకోబు వంశమైన నీ ప్రజలమధ్య అంతటా
తూర్పు నుంచి వచ్చిన మూఢ విశ్వాసం ఉంది.
వారు ఫిలిష్తీయవాళ్ళలాగా మంత్ర ప్రయోగం చేస్తారు,
విదేశీయులతో ఒక చేయిగా ఉన్నారు,
గనుక నీవు వారిని విసర్జించావు.
7 వారి దేశం నిండా వెండి బంగారాలు ఉన్నాయి.
వారి సంపత్తుకు అంతు లేదు.
వారి దేశం నిండా గుర్రాలున్నాయి.
వారి రథాలు అపరిమితం.
8 వారి దేశంనిండా విగ్రహాలున్నాయి.
తమ చేతులతో చేసిన పనికి, వ్రేళ్ళతో చేసినదానికి మ్రొక్కుతారు.
9 మనుషులను అణగదొక్కడం,
ప్రజలను తగ్గించడం జరుగుతుంది.
వారిని క్షమించవద్దు.
10  యెహోవా భయం కారణంగా, ఆయన మహిమ వైభవంనుంచి
బండల సందులలోకి వెళ్లండి! మట్టిలో దాక్కోండి!
11 మనుషుల గర్వం గల చూపులను అణగద్రొక్కడం,
మనిషి అహంభావాన్ని తగ్గించడం జరుగుతుంది.
ఆ రోజు యెహోవాకే ఘనత ఉంటుంది.
12 సమస్తమైన అహంభావానికీ గర్వానికీ మిడిసిపాటుకూ
తీర్పు తీర్చే రోజును సేనలప్రభువు యెహోవా నియమించాడు.
అవి అణగారిపోతాయి.
13 ఆ రోజును గర్వంతో మిడిసిపడే లెబానోను దేవదారు చెట్లన్నిటికీ,
బాషాను సిందూర వృక్షాలన్నిటికీ,
14 ఉన్నత పర్వతాలన్నిటికీ, ఎత్తయిన కొండలన్నిటికీ,
15 పొడుగైన ప్రతి గోపురానికీ, కోట ఉన్న ప్రతి ప్రాకారానికీ,
16 తర్‌షీషు ఓడలన్నిటికీ, అందమైన వస్తువులన్నిటికీ
నియమించాడు.
17 అప్పుడు మనిషి అహంభావం క్రుంగిపోతుంది,
మానవ గర్వం అణగారిపోతుంది.
ఆ రోజు యెహోవాకే ఘనత ఉంటుంది.
18 అప్పుడు విగ్రహాలు లేకుండా పోతాయి.
19 భూమిని వణకించడానికి యెహోవా నిలబడేటప్పుడు
ఆయనకు భయపడి ఆయన మహిమ వైభవంనుంచి
మనుషులు కొండల గుహలలో దూరుతారు,
నేల బొరియలలోకి వెళ్తారు.
20 ఆ రోజున మనుషులు పూజకోసం చేసుకొన్న
వెండి విగ్రహాలనూ బంగారు విగ్రహాలనూ
ఎలుకలకూ గబ్బిలాలకూ పారవేస్తారు.
21 భూమిని వణకించడానికి యెహోవా నిలబడేటప్పుడు
ఆయనకు భయపడి ఆయన మహిమ వైభవంనుంచి
వాళ్ళు కొండల గుహలలోకి బండల బీటలలోకి వెళ్తారు.
22 మనిషిమీద నమ్మకం పెట్టడం మానుకోండి.
అతడి ముక్కుపుటాలలోనే అతడి ప్రాణం ఉంది.
అతడు ఎంతటివాడు?