యెషయా
1
1 ఇది యూదా దేశాన్ని గురించి, జెరుసలం గురించి ఆమోజు కొడుకు యెషయాకు వచ్చిన దర్శనం. ఇది యూదా రాజులు ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా రోజులలో వచ్చినది.
2 ఆకాశాల్లారా, ఆలకించండి!
భూమీ, విను! యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు:
“నేను పిల్లలను పెంచి పోషించాను.
వారు నాకు ఎదురు తిరిగారు.
3 ఎద్దుకు తన యజమాని తెలుసు,
గాడిదకు సొంతగాడు మేత పెట్టే స్థలం తెలుసు.
గాని, ఇస్రాయేల్ జనానికి తెలివి లేదు.
నా ప్రజ గ్రహించరు.”
4 అయ్యో! ఇది పాపిష్టి జనం.
అపరాధాల మోత క్రింద వంగిపోయిన ప్రజ,
చెడుగు చేసేవంశం, వినాశకరమైన జాతి.
వారికి బాధ తప్పదు.
వారు యెహోవాను వదలిపెట్టారు,
ఇస్రాయేల్ ప్రజల పవిత్రుణ్ణి తిరస్కరించారు,
ఆయనను విడిచి తొలగిపోయారు.
5 మీరు ఇంకా తిరుగుబాటు చేస్తూ,
దెబ్బలకు గురి అవుతారెందుకు?
మీ తల అంతా గాయాలే!
మీ గుండె అంతా నీరసించిపోయింది.
6 అరికాలినుంచి నెత్తివరకు క్షేమం అంటూ
ఎక్కడా లేదు.
అంతటా గాయాలూ దెబ్బలూ పచ్చి పుండ్లూ.
వాటిని ఎవ్వరూ పిండలేదు, కట్టలేదు,
నూనెతో మెత్తన చేయలేదు.
7 మీ దేశం పాడైపోయింది.
మీ పట్టణాలు తగలబడి పోయాయి.
మీ ఎదుటే విదేశీయులు మీ భూమి పంట
మింగివేస్తున్నారు.
ఈ నాశనం ఇతర జనాలకు జరిగే నాశనంలాంటిది.
8 సీయోను కుమారి మిగిలి ఉంది.
అది ద్రాక్షతోటలో ఉన్న గుడిసెలాగా,
దోసపాదుల మధ్య ఉన్న పాకలాగా ఉంది;
ముట్టడికి గురి అయిన పట్టణంలాంటిది.
9  సేనల ప్రభువు యెహోవా మనలో కొద్దిమందిని
బ్రతకనిచ్చాడు; లేకపోతే మనం సొదొమ,
గొమొర్రాలాగా అయివుండేవాళ్ళమే.
10 సొదొమ నాయకులారా! యెహోవా వాక్కు ఆలకించండి.
గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశం వినండి.
11 యెహోవా చెప్పేదేమిటంటే,
“మీరు చేసే అనేక బలులు నాకెందుకు?
హోమాలుగా అర్పించిన పొట్టేళ్ళు,
బాగా మేసిన పశువుల కొవ్వు
నాకు వెగటు పుట్టించాయి.
ఎద్దుల రక్తం, గొర్రెపిల్లల రక్తం,
మేకల రక్తం అంటే నాకేమి ఇష్టం లేదు.
12 మీరు నా సన్నిధానంలోకి వచ్చేటప్పుడు
నా ఆవరణాలను త్రొక్కమని మిమ్మల్ని
ఎవరు అడిగారు?
13 ఇకనుంచి మీ వ్యర్థ నైవేద్యాలను తేవద్దు.
మీరు అర్పించే ధూపం నాకు అసహ్యం!
అమావాస్య, విశ్రాంతి దినాలు,
సభలు జరుగుతూనే ఉన్నాయి గాని,
మీ దుష్ట సమావేశాలను నేను ఓర్చుకోలేను.
14 మీ అమావాస్య ఉత్సవాలూ నియామకమైన పండుగలూ
నాకు అసహ్యం! అవి నాకు బాధకరం!
వాటిని సహించలేక విసుగు చెందాను!
15 “మీరు మీ చేతులు చాపి ప్రార్థన చేసేటప్పుడు
మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు దాచుకొంటాను.
మీరు ఎంత ప్రార్థించినా నేను చెవినిబెట్టను.
మీ చేతులనిండా రక్తమే.
16 కడుక్కోండి! మిమ్మల్ని శుద్ధి చేసుకోండి!
మీ చెడు క్రియలు నాకు కనబడకుండా తొలగించివేయండి.
చెడుగు చేయడం మానండి!
17 మంచి చేయడం నేర్చుకోండి! న్యాయాన్ని అనుసరించండి!
హింసకు గురి అయినవారిని విడిపించండి!
తండ్రి లేని పిల్లలకు న్యాయం చేకూర్చండి!
వితంతువుల పక్షాన వాదించండి!”
18  యెహోవా అంటున్నాడు:
“రండి, మన వివాదం తీర్చుకొందాం.
మీ పాపాలు రక్తవర్ణమైనా అవి మంచులాగా
తెల్లగా అవుతాయి.
అవి కెంపులాగా ఎర్రనివైనా
అవి తెల్లని గొర్రె బొచ్చులాగా తెల్లగా అవుతాయి.
19 మీరు ఇష్ట పూర్వకంగా నా మాట వింటే
భూమిమీద ఉన్న మంచివాటిని తింటారు.
20 సమ్మతించక, తిరుగుబాటు చేస్తే
మీరు కత్తిపాలు అవుతారు.”
ఇది యెహోవా నోటినుంచి వచ్చిన మాట.
21 అయ్యో, నమ్మకమైన నగరం వేశ్యలాగా అయిపోయింది!
ఒకప్పుడు అది న్యాయంతో నిండి ఉన్నది.
అది నీతినిజాయితీకి ఉనికిపట్టే!
ఇప్పుడైతే దానిలో హంతకులు కాపురముంటున్నారు.
22 నీ వెండి కల్మషం అయింది,
నీ ద్రాక్షరసం నీళ్ళతో కలిసి చెడిపోయింది.
23 నీ అధికారులు ద్రోహులు, దొంగల మిత్రులు.
లంచం అంటే వాళ్ళకు చాలా ఇష్టం.
వాళ్ళు బహుమతులకోసం తహతహలాడుతూ ఉండేవాళ్ళు.
తండ్రి లేని పిల్లలకు న్యాయం చేకూర్చరు.
వితంతువుల వ్యాజ్యాలు విచారించరు.
24 అందుచేత సేనలప్రభువు యెహోవా – ఇస్రాయేల్ ప్రజల బలాఢ్యుడు –
ఇలా అంటున్నాడు:
“నా శత్రువుల విషయం నాకు ఉపశమనం కలుగుతుంది.
నా విరోధులమీద నేను పగ తీర్చుకొంటాను.
25 నీకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను.
పూర్తిగా నీ కల్మషాన్ని శుద్ధి చేసి,
నీలో కలిసిన మిశ్రిత లోహపదార్థాలను తీసివేస్తాను.
26 పూర్వం ఉన్నట్టు నీకు న్యాయమూర్తులను మళ్ళీ ఇస్తాను.
ఆదిలో ఉన్నట్టు నీకు ఆలోచనకర్తలను
మళ్ళీ నియమిస్తాను.
ఆ తరువాత నిన్ను ‘న్యాయాన్ని అనుసరించే నగరం’,
‘నమ్మకమైన నగరం’ అంటారు.
27 “సీయోనుకు న్యాయంచేత విముక్తి కలుగుతుంది.
దేవునివైపు మళ్ళీ తిరిగినదాని నివాసులకు
నీతినిజాయితీచేత విమోచనం కలుగుతుంది.
28 అక్రమకారులూ పాపులూ ధ్వంసం అయిపోతారు.
29 మీకు ఇష్టం ఉన్న సిందూర వృక్షాల విషయం
మీరు సిగ్గుపాలవుతారు.
మీకు సంతోషకరమైన తోటల విషయం
మీ ముఖాలు ఎర్రబారుతాయి.
30 మీరు ఆకులు వాడిపోతున్న సిందూర వృక్షంలాగా,
నీళ్ళు లేని తోటలాగా అవుతారు.
31 బలవంతులు చితుకుల్లాగా అవుతారు,
వాళ్ళ పని నిప్పుకణంలాగా అవుతుంది.
వాళ్ళు వాళ్ళ పనితోపాటు కాలిపోతారు.
మంటలు ఆర్పేవారంటూ ఎవ్వరూ ఉండరు.”