ఆయన
7
1  రాజవంశంలో పుట్టినదానివి నువ్వు.
పాదరక్షలు ధరించిన నీ పాదాలు
ఎంత అందంగా ఉన్నాయి.
నీ ఊరువులు శిల్పకళాఖండాలై, ఆభరణ
హారాల్లాంటివి.
2 నీ నాభి వలయాకార కలశంలా ఉంది.
మిశ్రమైన ద్రాక్షరసం అందులో ఎప్పుడూ
వెలితి కాకుండా ఉంటుంది.
కలువలు పరివేష్టించిన గోధుమరాశిలా ఉంది
నీ నడుము.
3 నీ స్తనద్వయం కవల జింక పిల్లల్లా ఉన్నాయి.
4 నీ మెడ దంతం గోపురంలాంటిది.
నీ కండ్లు హెష్‌బోనులో బత్‌రబ్బీం ద్వారం దగ్గర
ఉన్న తటాకాలతో సమానంగా ఉన్నాయి.
నీ ముక్కు దమస్కు వైపు చూచే లెబానోను
శిఖరంలాంటిది.
5 నీ తల కర్మెల్‌పర్వతం లాగా ఉంది.
నీ తలవెండ్రుకలు ఊదారంగు గల
నూలు పోగువంటివి.
నొక్కులు తిరిగిన నీ శిరోజాలకు రాజు
వశమవుతున్నాడు.
6 నా ప్రియసఖీ! నీ అందం ఎంతో గొప్పది!
నువ్వు మనోజ్ఞ రూపిణివి!
ఎంతో ఆనందం కలిగించేదానివి!
7 తాటి చెట్టులాగా నీవు వంకర లేనిదానివి.
నీ స్తనాలు గెలలలాగా ఉన్నాయి.
8 తాటిచెట్టు ఎక్కుదామనుకొన్నాను.
దాని కొమ్మలు పట్టుకుంటాను.
నీ స్తనాలు ద్రాక్షగెలల్లా ఉంటాయి.
నీ శ్వాసలో నుంచి ఆపిలు పండ్ల వాసన వస్తుంది.
9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంటుంది.
ఆమె
ఆ మేలిరకం ద్రాక్షరసం నా ప్రియుడికి
రుచిగల పానీయం.
నిద్రపోయేటప్పుడు కూడా అది పెదవులలో
మెల్లగా స్రవిస్తుంది.
10  నేను నా ప్రియుడికి చెందినదాన్ని.
ఆయనకు నాపట్ల వాంఛ కలిగింది.
11 ప్రియతమా! మనం పల్లెసీమలకు వెళ్ళిపోదాం.
గ్రామాలలో రాత్రి గడుపుదాం, రా.
12 పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళ్ళిపోదాం.
ద్రాక్షచెట్లు చిగిర్చాయేమో
వాటి పూలు వికసించాయేమో
దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేమో
చూద్దాం, రా.
అక్కడ నా ప్రేమను నీకు వెల్లడి చేస్తాను.
13 పుత్రదాత ఓషధుల చెట్లు సువాసన లీనుతాయి.
నా ప్రియసఖా! మా ద్వారబంధాల దగ్గరే అనేక
రకాల శ్రేష్ఠమైన పండ్లు ఉన్నాయి.
నీ కోసం వాటిని దాచి ఉంచాను.
పచ్చివీ, పండువీ అందులో ఉన్నాయి.