8
1 ✽నీవు నాకు తల్లి పాలు త్రాగే సోదరుడులాగాఉంటే ఎంత బావుండేది.
అప్పుడు బయట నీవు ఎదురుపడితే, నిన్ను
ముద్దాడేదాన్ని.
నన్ను ఎవ్వరూ ఏమీ అనేవాళ్ళు కాదు.
2 ✽ నేను స్వయంగా నిన్ను తీసుకువెళ్ళేదాన్ని.
నా తల్లి ఇంటిలోకి తీసుకుపోయేదాన్ని.
నీవు నాకు ఉపదేశిస్తావు.
నేను నీకు సుగంధ ద్రవ్యాలు కలిపిన
ద్రాక్షరసం ఇస్తాను.
దానిమ్మ పండ్ల రసం ఇస్తాను.
3 ఆయన ఎడమ చెయ్యి నా తలక్రింద ఉంది.
ఆయన కుడి చెయ్యి నన్ను చుట్టేసింది.
4 జెరుసలం కుమార్తెలారా! మీరు ఒట్టువేసి
చెప్పండి–
ప్రేమ దానంతట అదే మేలుకొనేవరకూ దాన్ని
లేపమని, పురికొలపమని ప్రమాణం
చేయాలని నా మనవి.
చెలికత్తెలు
5 ఆ వచ్చేది ఎవతె?
తన ప్రియుణ్ణి ఆనుకొని ఎడారి✽ మార్గంలో
నడిచివస్తున్నది.
ఆమె
ఆపిలు చెట్టు క్రింద పడుకొని ఉంటే,
నేను నిన్ను లేపాను.
అక్కడ నీ తల్లికి నీవల్ల ప్రసవవేదన కలిగింది.
నీ తల్లి నిన్ను అక్కడే కన్నది.
6 నీ హృదయం మీద నా పేరును ముద్ర✽లాగా ఉంచు.
నీ భుజంమీద నా పేరును ముద్రలాగా ఉంచు.
ఎందుకంటే, ప్రేమకు మరణానికి✽ ఉన్నంత
బలం ఉంది.
అందువల్ల కలిగే రోషం✽ మృత్యులోకంతో
సమమైన తీవ్రత గలది.
అది ప్రజ్వలిస్తుంది.
అది అగ్నిజ్వాలల్లాగా మండుతుంది.
అవి యెహోవా కలగజేసే మంటల్లాగా ఉన్నాయి.
7 ✽విస్తార జలాలు కూడా ప్రేమను ఆర్పివేయలేవు.
నదీప్రవాహాలు ప్రేమను ముంచివేయ్యలేవు.
ఎవడైనా తన ఇంట్లో ఉన్న ధనమంతా
ప్రేమకు ప్రతిగా ఇస్తానంటే అతడికి
లభించేది తిరస్కృతి!
చెలికత్తెలు
8 ✽మాకు ఓ చిన్న చెల్లెలు ఉంది.
ఆమెకు ఇంకా వయసు రాలేదు.
ఆమెకు పెళ్ళి నిశ్చయమయ్యే రోజు వచ్చేటప్పుడు
ఆమెకోసం ఏం చేయాలి?
9 ఆమె గోడలాంటిదైతే,
దానిమీద వెండి గోపురం కట్టిస్తాం.
అది తలుపులాంటిదైతే దేవదారు చెక్కతో
దానికి గడియలను అమరుస్తాం.
ఆమె
10 ✽నేను గోడలాగా ఉన్నాను.
నా వక్షోజాలు గోపురాలు.
అందుచేత ఆయన దృష్టిలో నాకు క్షేమం
లభించింది.
11 బెయల్‌హామోన్‌లో సొలొమోనుకు
ద్రాక్షతోట ఉంది.
అతడు దానిని రైతులకు కౌలుకిచ్చాడు.
దానికి ప్రతి రైతూ వెయ్యి వెండి నాణేలు
శిస్తు చెల్లించాలి.
12 కాని, నా ద్రాక్షవనం నా వశంలో ఉంది.
సొలొమోను! ఆ వెయ్యి నాణేలు నీకు చెందుతాయి.
దాన్ని సేద్యం చేసే రైతులకు రెండు వందల
నాణేలు గిట్టుతాయి.
ఆయన
13 ✽ఉద్యానవనంలో నివసించేదానా,
నేస్తాలు నీ స్వరం వినాలని వేచి ఉన్నారు.
నన్నూ దాన్ని విననియ్యి.
ఆమె
14 ✽ప్రియతమా, త్వరగా వచ్చెయ్యి.
జింకలా, లేడిపిల్లలా పరిమళ వృక్ష సముదాయంతో
నిండి ఉన్న పర్వతాలమీదుగా చెంగు చెంగున వచ్చేసెయ్యి!