చెలికత్తెలు
6
1 అతిలోక సుందరీ!
నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు?
ఆయన ఎటువైపు వెళ్ళాడు?
మేము నీతోపాటు ఆయనను అన్వేషిస్తాం.
ఆమె
2 తన గొర్రెలు మేపడానికి, కలువలు
ఏరుకోవడానికి నా ప్రియుడు ఉద్యాన
వనానికి వెళ్ళాడు.
సువాసన లీనే పూల పాన్పుల దగ్గరికి వెళ్ళాడు.
3 నేను నా ప్రియుడికి చెందినదాన్ని.
ఆయన నావాడు.
ఆయన కలువలమధ్య
తన గొర్రెలు మేపుతున్నాడు.
ఆయన
4 ప్రియసఖీ! నువ్వు తిర్సాలాగా అందాల రాశివి.
జెరుసలంలాగా సౌందర్యవతివి.
పతాకమెత్తిన సైన్యంలాగా గంబీరమైన దానివి.
5 నీ దృక్కులు నా మీద ప్రసరించనియ్యకు.
అవి నన్ను లొంగదీస్తున్నాయి.
నీ కురులు గిలాదు పర్వతంమీద నుంచి
దిగివస్తున్న మేకల మందలా ఉన్నాయి.
6 నీ పళ్ళు, కడిగిన తరువాత పైకి వచ్చిన
గొర్రెల కదుపులాగా తెల్లగా ఉన్నాయి.
ఒక్కటీ పోకుండా జోడు జోడుగా ఉన్నాయి.
7 నీవు వేసుకున్న ముసుకులోగుండా నీ కపోలాలు
విచ్చిన దానిమ్మ పండులాగా
కనబడుతున్నాయి.
8 అరవైమంది రాణులూ, ఎనభైమంది సపత్నులూ,
అసంఖ్యాకులైన కన్యలూ ఉన్నారు.
9 అయితే నా పావురం, పవిత్ర శీలవతి
ఈమె ఒక్కతే!
ఈమె తల్లికి ఒక్కగా నొక్క కూతురు.
తల్లికి గారాబు బిడ్డ.
కన్యలందరూ ఆమెను చూచి, “ధన్యురాలు”
అన్నారు.
రాణులూ, సపత్నులూ ఆమెను శ్లాఘించారు.
10 అరుణోదయంలాంటి ఈమె ఎవరు?
ఆమెది చంద్రబింబమంత అందం.
ఆమె శుద్ధత సూర్యప్రకాశంలాంటిది.
ఆమె నక్షత్ర విన్యాసంలాగా గంబీరంగా
కనిపిస్తున్నది.
11 లోయలోని మొక్కలు చూడడానికి
బాదం చెట్ల తోటలోకి వెళ్ళాను.
ద్రాక్ష చెట్లు చిగిర్చాయో లేదో, దానిమ్మ చెట్లు
పూత పట్టాయో లేదో చూడాలని వెళ్ళాను.
12 అనుకోకుండా నా ప్రజల్లో ఘనత వహించినవారి
రథాలను నేను కలుసుకోవడం జరిగింది.
చెలికత్తెలు
13 షూలం ఊరిదానా! రా, వచ్చెయ్యి!
మేము నిన్ను తనివితీరా చూస్తాం.
తిరిగి వచ్చెయ్యి.
ఆయన
రెండు శిబిరాల మధ్య జరిగే నాట్యంలాగా
షూలం ఊరిదానిని ఎందుకు తనివితీర చూస్తారు?