ఆయన
5
1 నా సోదరీ! వధూ!
నా ఉద్యానవనానికి నేను వచ్చాను.
నా బోళం, నా పరిమళ ద్రవ్యాలు
నేను సమకూర్చుకొన్నాను
నేను తేనెను త్రాగి, తేనెపట్టు తిన్నాను.
ద్రాక్షరసమూ పాలూ నేను పానం చేశాను.
నేస్తాల్లారా! తినండి, తాగండి.
ప్రియసఖులారా బాగా పానం చేయండి.
ఆమె
2 నేను నిద్రపోయానే గాని నా హృదయం
మేల్కొని ఉంది.
నా ప్రియుడు తలుపు తడుతూ పిలిచాడు.
“నా సోదరీ, ప్రేయసీ! తలుపు తియ్యి.
నా పావురమా, పవిత్ర శీలవతీ! విను.
నా తల మంచుకు తడిసింది.
రాత్రి మంచుకు నా వెంట్రుకలు తడిసిపోయాయి.”
3 అయితే నేనన్నాను,
“నేను వివస్త్రనయి ఉన్నాను.
మళ్ళీ వస్త్రాలు ఎందుకు ధరించడం?
నా కాళ్ళు కడుక్కొన్నాను.
మళ్ళీ వాటిని మురికి చేసుకోవడం దేనికీ?”
4 నా ప్రియుడు చెయ్యి తలుపు సందులో పెట్టగానే
నాలో ప్రేమ భావనలు ముప్పిరిగొన్నాయి.
5 నా ప్రియుడికి తలుపు తీద్దామని లేచాను.
తలుపు గడియమీద నా చేతిమీది నుంచి,
నా వేళ్ళనుంచి బోళం స్రవించింది.
6 నా ప్రియుడికి నేను తలుపు తీసేలోగా
ఆయన కాస్తా వెళ్ళిపోయాడు.
ఆయన స్వరం వినీ వినగానే, నా ప్రాణం
స్పృహ తప్పింది.
నేను ఆయన కోసం వెదికాను.
ఆయన కనబడలేదు.
నేను పిలిచాను. ఆయన పలకలేదు.
7 పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకు
ఎదురుపడ్డారు.
నన్ను కొట్టారు. గాయపరిచారు.
ప్రాకారం మీద ఉన్న కావలివారు నా
ముసుకు దొంగిలించారు.
8 జెరుసలం కుమార్తెలారా!
నా ప్రియుడు మీకు కనిపిస్తే,
ప్రేమాతిరేకం చేత నాకు స్పృహ తప్పిందని
ఆయనకు చెపుతామని నాకు ఒట్టువేసి
మరీ ప్రమాణం చెయ్యండి.
చెలికత్తెలు
9 అతిలోక సుందరీ!
అందరికంటే నీ ప్రియుడి విశిష్ఠత ఏమిటి?
ఇంతగా మాచేత ఒట్టు పెట్టించుకొన్నావే!
ఇంతకూ నీ ప్రియుడి విశేషమేమిటి?
ఆమె
10 నా ప్రియుడు ప్రకాశమానమైనవాడు.
ఎర్రటివాడు.
పది వేలమందిలో కూడా ప్రత్యేకమైనవాడు.
11 ఆయన తల మేలిమి బంగారంలాంటిది.
ఆయన తలవెండ్రుకలు బొంతకాకిలాగా
నల్లగా ఉండి నొక్కులుదేరి ఉన్నాయి.
12 నదీ తీరాన ఎగిరే గువ్వ కండ్లలాంటివి
ఆయన నేత్రాలు.
అవి పాలలో స్నానమాడినట్లున్నాయి.
అవి తాపడం చెయ్యబడ్డ రత్నాల్లాంటి కండ్లు.
13 ఆయన చెక్కిళ్ళు సువాసన లీనే పూల
పాన్పుల్లాంటివి.
కమ్మని సౌరభం విరజిమ్మే ఓషధులున్న స్థలాలవి.
ఆయన పెదవులు కలువలలాంటివి.
వాటిలోనుంచి బోళం స్రవిస్తుంది.
14 ఆయన హస్తాలు తర్షీష్‌రత్నాలు తాపడం
చేసిన బంగారు కడ్డీలలా ఉన్నాయి.
నీల రత్న సముదాయం పొదిగిన దంతపు
కళాఖండం ఆయన వక్షస్థలం.
15 ఆయన కాళ్ళు చలవరాతి స్తంభాల్లా ఉన్నాయి.
అవి మేలిమి బంగారు పీఠాలమీద
నిలిపినట్లున్నాయి.
ఆయన వాలకం లెబానోను వనంలాగా ఉంది.
ఆ దేవదారు వృక్షాల్లాగా శ్రేష్ఠతరం.
16 ఆయన నోరంతా మాధుర్యం.
ఆయన ఎంతైనా కోరదగినవాడు.
జెరుసలం కుమార్తెలారా!
ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.