ఆయన
4
1 ప్రియసఖీ! నువ్వెంత సౌందర్యవతివి!
ఎంత అందమైనదానివి!
నీవు ముసుకు వేసుకొన్నావు.
అందులోనుంచి నీ కండ్లు గువ్వ కండ్లలాగా
కనిపిస్తున్నాయి.
నీ శిరోజాలు గిలాదు పర్వతం మీద నుంచి
దిగివస్తున్న మేకల మందలలాంటివి.
2 నీ దంతాలు ఉన్ని కత్తిరించాక కడిగిన తరువాత
పైకి వచ్చిన గొర్రెల కదుపులాగా
తెల్లగా ఉన్నాయి.
ఒక్కటీ పోకుండా జోడుజోడుగా ఉన్నాయి.
3 నీ పెదిమలు ఎర్రటి దారంలా ఉన్నాయి.
నీ నోరు ఎంత అందంగా ఉంది!
నీవు వేసుకొన్న ముసుకులోగుండా నీ కపోలాలు
విచ్చిన దానిమ్మపండుగా కనిపిస్తున్నాయి.
4 దావీదు నిర్మించిన విజయసూచకమైన
గోపురంలాగా నీ కంఠం ఉంది.
దానిమీద వెయ్యి డాలులు వ్రేలాడుతున్నాయి.
అవన్నీ శూరుల డాలులే.
5 నీ స్తనద్వయం కలువలమధ్య మేస్తున్న
కవల జింకపిల్లల్లా ఉన్నాయి.
6 చల్లటి గాలి తెమ్మరలు వస్తూ ఉండగానే,
చీకటి నీడలు గతించేలోపుగానే,
నేను బోళం కొండలకు వెళ్ళిపోతాను.
సాంబ్రాణి పర్వతాలకు వెళ్ళిపోతాను.
7 నా ప్రియసఖీ! నీవు ఎంతో అందమైనదానివి.
నీలో ఏ కళంకమూ లేదు.
8 వధూ! లెబానోను విడిచిపెట్టి, నాతో వచ్చెయ్యి.
లెబానోనునుంచి రా! అమానా పర్వతాగ్రం నుంచీ,
శెనీర్‌– హెర్మోను పర్వత శిఖరం నుంచీ
సింహాల గుహలూ చిరుతపులుల
ఉనికిపట్లూ ఉన్న ఆ స్థలాలనుంచీ
క్రిందకి దిగిరా.
9  నా సోదరీ! వధూ!
నీవు నా హృదయాన్ని వశం చేసుకొన్నావు.
నీవు చూచిన ఒక్క చూపుతో నా హృదయం
నీ వశమైపోయింది.
నీ హార పంక్తిలో ఒకటి చాలు నన్ను
వశం చేసుకోవడానికి.
10 నా సోదరీ! వధూ!
నీ ప్రేమానురాగాలు ఎంత మధురం.
ద్రాక్షరసం కంటే కూడా నీ ప్రేమ
ఎంతో ఆనంద ప్రదం!
నీవు పూసిన పరిమళ తైలాల సౌరభం
సుగంధ ద్రవ్యాలన్నిటికీ మించినది.
11 వధూ! నీ పెదిమలు తేనెలూరుతున్నాయి.
నీ నాలుక క్రిందనుంచి తేనె మీగడలు
ఒలుకుతున్నట్లున్నాయి.
నీ వస్త్ర సౌరభం లెబానోను వనం తావిలా ఉంది.
12  నా సోదరి, వధువు మూసి ఉన్న
ఉద్యాన వనంలాంటిది.
ఈమె మూత వేసి ఉన్న నీటి ఊటలాంటిది.
13 నీ చిగురులు దానిమ్మతోటలాంటివి.
ఈ తోటలో విచిత్రమైన పండ్ల చెట్లు ఉన్నాయి.
గోరింటచెట్లున్నాయి. జటామాంసి వృక్షాలున్నాయి.
14 జటామాంసి, కుంకుమ పువ్వులున్నాయి.
నిమ్మగడ్డి, లవంగ, అన్ని రకాల పరిమళ
వృక్షాలున్నాయి.
బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు
అందులో లభిస్తాయి.
15 నా సోదరీ! వధూ!
నీవు ఉద్యాన వనంలోని జలాశయంలాంటిదానివి.
నీవు నీటి ఊటలున్న బావిలాంటిదానివి.
లెబానోను సెలయేరులాంటి దానివి నువ్వు.
16 ఉత్తర వాయువూ, రా! దక్షిణం నుంచి
వీచేగాలీ, రా!
నా ఉద్యానవనం మీద వీచు.
దాని సౌరభాన్ని అంతటా వ్యాపింపజెయ్యి.
ఆమె
నా ప్రియుడు తన ఉద్యానవనానికి
వేంచేస్తాడు గాక!
దాని శ్రేష్ఠమైన పండ్లు ఆరగిస్తాడు గాక!