3
1 ✽రాత్రివేళ నేను పడుకొని నా ప్రాణప్రియుడికోసం ఎదురు చూశాను.
ఆయనకోసం ఎదురు చూచినా ఆయన కనబడలేదు.
2 నేను వెంటనే లేచి, వెళ్ళి పట్టణం వీధుల్లో
వెదకుతాను.
సంతవీధుల్లో, రహదారుల్లో నా ప్రాణప్రియుడి
కోసం అన్వేషించాలనుకొన్నాను.
అయితే ఎంత వెదికినా, ఆయన కనబడలేదు.
3 పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకు ఎదురయ్యారు.
“మీరు నా ప్రాణప్రియుణ్ణి చూశారా?”
అనడిగాను.
4 నేను వాళ్ళ దగ్గరనుంచి కొంత దూరం
ముందుకు వెళ్ళాను.
అప్పుడు నా ప్రాణప్రియుడు నాకు కనిపించాడు✽.
ఆయనను నేను గట్టిగా పట్టుకొన్నాను.
మా తల్లి ఇంటికి ఆయనను వెంటబెట్టుకువచ్చాను.
నా కన్నతల్లి గదిలోకి ఆయనను తెచ్చేవరకూ
ఆయనను వదిలిపెట్టలేదు✽.
5 ✝జెరుసలం కుమార్తెలారా!
జింకలమీద, లేళ్ళమీద ఒట్టుబెట్టి చెప్పండి.
ప్రేమ దానంతట అదే మేల్కొనేవరకూ దాన్ని
లేపమనీ, పురికొలపమని
మీరు ప్రమాణం చేయాలని నా మనవి.
చెలికత్తెలు
6 ✽పొగస్తంభంలాగా ఎడారి మార్గాన నడిచి
వస్తూ ఉంది. అదేమిటి?
బోళంతో, సాంబ్రాణితో, వర్తకులు అమ్మే పరిమళ
చూర్ణాలన్నిటితో గుబాళిస్తూ వస్తున్నదేమిటి?
7 ఆ వచ్చేది సొలొమోను పల్లకి.
అరవైమంది వీరులు దాన్ని పరివేష్టించి ఉన్నారు.
వారు ఇస్రాయేల్‌వీరులందరిలో పరాక్రమశాలురు.
8 వారంతా ఖడ్గధారులు.
యుద్ధంలో దీర్ఘానుభవశాలురు.
ఖడ్గం ధరించి, రాత్రిపూట జరిగే అపాయాలకు
సన్నద్ధులై వస్తున్నారు.
9 సొలొమోనురాజు ఆ పల్లకి చేయించుకున్నాడు.
దానిని లెబానోను మ్రానుతో నిర్మించాడు.
10 దాని స్తంభాలు వెండివి.
దాని అడుగుభాగం బంగారుది.
దానిమీది దిండ్లు ఊదా రంగువి.
జెరుసలం కుమార్తెలు ప్రేమపూర్వకంగా
దానిలోపలిభాగం తయారు చేసి అలంకరించారు.
11 సీయోను కుమార్తెలారా! రండి!
సొలొమోనురాజును చూడండి. ఆయన కిరీటధారీ.
పెండ్లిరోజున ఆయన తల్లి అతడికి
ఆ కిరీటం పెట్టింది.
అది ఆయనకు ఆనందమయమైన రోజు.