ఆమె
2
1 ✽నేను షారోన్‌లో పూచే గులాబి పువ్వులాంటిదాన్ని,లోయల్లో వికసించిన కలువ పుష్పంలాంటిదాన్ని.
ఆయన
2 ముండ్ల మధ్య కలువలాగా కన్యల మధ్య
నా ప్రియసఖి✽ కనిపిస్తూ ఉంది.
ఆమె
3 యువకులలో నా ప్రియుడు అడవి చెట్ల✽ మధ్య
ఆపిల్‌వృక్షం లాంటివాడు.
ఆయన ఛాయలో ఆనందమయినై నేను
కూర్చుండిపోయాను.
ఆయన ఫలాలు నా జిహ్వకు మధురం.
4 ఆయన నన్ను విందుశాల✽లోకి తీసుకువెళ్ళాడు.
నా మీద ప్రేమను పతాకంగా✽ ఎత్తాడు.
5 ✽ప్రేమాతిరేకం చేత నాకు స్పృహ తప్పింది.
ఎండిన ద్రాక్షపండ్లను తినిపించి నన్ను బలపరచండి.
ఆపిలుపండ్లు పెట్టి నాకు సేద దీర్చండి.
6 ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంచాడు,
కుడిచేతితో ఆయన నన్ను ఆలింగనం చేసుకొన్నాడు.
7 జెరుసలం కుమార్తెలారా, జింకలమీద,
లేళ్ళమీద ఒట్టుపెట్టి చెప్పండి.
ప్రేమ దానంతట అదే మేలుకొనేవరకు దాన్ని
లేపమనీ పురికొలపమనీ మీరు ప్రమాణం
చేయాలని నా మనవి.
8 ✽నా ప్రియుడి స్వరం వినబడుతూ ఉంది.
అడుగో! ఆయన రానే వచ్చాడు.
గంతులు వేస్తూ, మిట్టలు దూకి, కొండలమీద
పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.
9 నా ప్రియుడు జింకలాంటివాడు.
లేడి పిల్లలాంటివాడు.
అడుగో! మన ఇంటి గోడకు అవతల
నిలబడి ఉన్నాడు.
కిటికీలోనుంచి తొంగి చూస్తున్నాడు.
అల్లిక తడికెగుండా చూస్తున్నాడు.
10 ✽ నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు –
ఆయన
ప్రాణసఖీ! సౌందర్యరాశీ! లే! ఇటు రా!
11 చలికాలం గడిచిపోయింది.
వర్షాలు పోయాయి. ఇప్పుడు రావు.
12 భూమి అంతా పువ్వులు పరిచినట్టుంది.
సంగీత నాదాలు వినిపించే సమయం వచ్చింది.
మన దేశంలో పావురం కూత వినబడుతూ ఉంది.
13 అంజూరుపండ్లు బాగా పక్వానికి వచ్చాయి.
ద్రాక్ష చెట్లు పూత పట్టాయి.
సౌరభాన్ని వెదజల్లుతున్నాయి.
ప్రియసఖీ! సుందరీ! లే! ఇటు రా!
14 ✽నువ్వు కొండ రాళ్ళ నడుమ దాక్కునే
పావురంలాగా ఉన్నావు.
కొండ చరియలను ఆశ్రయించుకొని ఉన్న
పావురానివి.
నీ ముఖం చూడనియ్యి.
నీ స్వరం నాకు వినిపించు.
నీ ముఖం అందంగా ఉంది.
నీ కంఠం మధురమైనది.
15 ✽ మన ద్రాక్ష తోట✽లు పూతకు వచ్చాయి.
మనకోసం గుంటనక్కలను పట్టుకో.
చిన్న గుంటనక్కలు ద్రాక్షతోటలను పాడు చేస్తాయి.
వాటిని పట్టుకో.
ఆమె
16 ✽ నా ప్రియుడు నావాడు. నేను ఆయనదాన్ని.
కలువలు విరబూసే చోట ఆయన తన
గొర్రెలను మేపుతున్నాడు.
17 ✽చల్లటి గాలి తెమ్మరలు వస్తూ ఉండగానే,
చీకటి నీడలు గతించేలోపుగానే,
ప్రియతమా, నీవు జింకలాగా, లేడిపిల్లలాగా
ఒడుదుడుకుగా ఉన్న కొండలమీద
చెంగు చెంగున వచ్చేసెయ్యి.