11
1 నీ ఆహారం నీళ్ళ మీద వెయ్యి. చాలా రోజులకు అది నీకు తిరిగి దొరుకుతుంది.
2 నీకు ఉన్నదానిలో ఏడెనిమిది మందికి భాగం పంచిపెట్టు. భూమిమీద ఏమి కీడు మూడుతుందో నీకు తెలియదు.
3 మేఘాలు నీళ్ళతో నిండితే భూమిమీద వర్షిస్తాయి. చెట్టు పడితే, ఆ మ్రాను ఉత్తరంగా పడ్డా, దక్షిణంగా పడ్డా, పడ్డచోటే ఉంటుంది.
4 గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు.
5 గర్భిణిస్త్రీ గర్భంలో పిండం ఎలా ఏర్పడి పెరుగుతుందో నీకు తెలియదు. గాలి వాలును పసిగట్టలేవు. అలాగే సమస్తమూ జరిగించే దేవుని క్రియలను నీవు గ్రహించలేవు.
6 ఉదయం విత్తనాలు చల్లు. సాయంకాలం కూడా చేయి వెనక్కు తీసుకోకు. ఈ రెండూ సమానంగా సఫలమవుతాయో లేదో నీకు తెలియదు. అది ఫలిస్తుందో, ఇది ఫలిస్తుందో నీకు తెలియదు.
7 వెలుగు మనోహరమైనది. సూర్యరశ్మిని చూస్తే కండ్లకు ఆహ్లాదకరం.
8 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అన్నిట్లో సంతోషంగా బ్రతకాలి. అయితే జీవితంలో చీకటి రోజులు అనేకం రాబోతాయని జ్ఞాపకముంచాలి. భవిష్యత్తంతా వ్యర్థమే!
9 యువకా! నీ యువతలో సంతోషించు. నీ యువదశలో నీ హృదయంలో సంతుష్టి ఉండేలా చూచుకో. నీ హృదయంలో ఉన్న ఆశయాలనూ, నీ కండ్లు చూచినవాటినీ అనుసరించి ప్రవర్తించు. కాని, ఒక విషయం తెలుసుకో – నీవు చేసినవాటన్నిటిని గురించీ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు.
10 నీ హృదయంలో నీవేమీ కంగారుపడకు. బాల్యం, యవ్వనం వ్యర్థం. నీ శరీరానికి చెడుగు కలిగించేదేదో దాన్ని దూరం చేసుకో.