10
1 ✽పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే దానికి దుర్వాసన ఉంటుంది. త్రాసులో పెట్టి తూస్తే మూర్ఖత్వం కొంచెమైనా, గౌరవాన్నీ జ్ఞానాన్నీ తేలగొడుతుంది.2 జ్ఞాని హృదయం అతడి కుడి చెయ్యి చేత పని చేయిస్తుంది. మూర్ఖుడి హృదయం అతడి ఎడమ చెయ్యి చేత పని చేయిస్తుంది.
3 మూర్ఖులకు మార్గంలో సరిగా నడుచుకోవడానికి కూడా చాలినంత బుద్ధి లేదు. తమ తెలివితక్కువతనాన్ని అందరికీ ప్రదర్శిస్తారు.
4 పాలకుడికి నీమీద కోపం వచ్చిందనుకో, కొలువు వదిలిపెట్టి పోవద్దు. వినయంతో ప్రవర్తిస్తే ఘోరమైన తప్పులు మరవబడతాయి.
5 సూర్యమండలం క్రింద జరిగే మరో చెడుగు నేను చూశాను. పరిపాలకులు పొరపాటున ఈ చెడుగు చేయవచ్చు.
6 అదేమిటంటే, తెలివితక్కువవాళ్ళను పెద్ద ఉద్యోగాలలో ఉంచుతారు. గొప్పవారు క్రింద ఉన్నారు.
7 బానిసలు గుర్రాలెక్కుతారు, ఘనులు దాసుల్లాగా క్రింద నడుస్తారు. ఇది నేను చూశాను.
8 ✽ఎవడు తవ్వుకొన్న గోతిలో వాడే పడవచ్చు. కంచె కొట్టేవాణ్ణి పాము కాటు వేయవచ్చు.
9 రాళ్ళు దొర్లించేవాడికి రాళ్ళమూలంగా గాయాలు తగలవచ్చు. చెట్లను నరికేవాడికి వాటిమూలంగా అపాయం ఉంది.
10 మొద్దుబారిపోయిన ఇనుప పనిముట్టును పదును పెట్టకపోతే, పనివాడికి ఎక్కువ బలం అవసరం. సఫలమైన పనికి జ్ఞానం ప్రధానం.
11 ✝పాము మంత్రం పామును కట్టువేయకముందు అది కరిస్తే, మంత్రగాడివల్ల ఉపయోగం లేదు.
12 ✝జ్ఞాని పలికే వాక్కులు వినడానికి ఇంపుగా ఉంటాయి. మూర్ఖుడి మాటలు వాణ్ణే దిగమింగివేస్తాయి.
13 మూర్ఖుడు ఆరంభంలోనే తెలివితక్కువగా మాట్లాడుతాడు. ముగింపులో వాడి మాటల్లో ఘోరమైన వెర్రితనం ఉట్టిపడుతుంది.
14 ✝ఏమి జరగబోతుందో మనుషులకు తెలియదు అయినా, తెలివితక్కువవాళ్ళు ఎక్కువ వాగుతారు. మనిషి చనిపోయాక ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
15 తన ప్రయాస మూర్ఖుడికి ఆయాసం కలిగిస్తుంది. ఊరికి పోవాలంటే, వాడికి త్రోవ తెలియదు.
16 దేశానికి బానిస రాజైతే, దేశాధికారులు ప్రొద్దున్నే తిండికి పడిగాపులు పడేవారైతే, ఆ దేశానికి అగచాట్లు తప్పవు.
17 గొప్ప వంశంనుంచి వచ్చినవారు దేశానికి రాజైతే, దేశాధికారులు త్రాగుబోతులై ఉండకుండా, బలం పుంజుకోవడానికే సరైన వేళకు ఆహారం తీసుకొనేవారై ఉంటే, ఆ దేశానికి క్షేమం ఉంటుంది.
18 ✝సోమరితనం ఉంటే, ఇంటి కప్పు పాడవుతుంది. బద్ధకం ఉంటే, ఇల్లు కురుస్తుంది.
19 నవ్వులు కావాలని విందులు చేస్తారు మనుషులు. ద్రాక్షమద్యం వారికి సంతోషం కలిగిస్తుంది. డబ్బు అన్నిటికీ పనికి వస్తుంది.
20 నీ మనసులో కూడా రాజును తూలనాడకు, నీ పడక గదిలో కూడా ధనికులను శాపనార్థాలు పెట్టకు. ఆకాశవీధిలో ఎగిరే పక్షులు నీ మాటలు చేరవేయవచ్చు. రెక్కలమీద ఈ సంగతి ప్రయాణమైపోయి ఇతరులకు తెలిసిపోవచ్చు.