9
1 ✽నేను మనస్ఫూర్తిగా ఈ విషయాలన్నీ పరిశీలించి ఇలా అనుకొన్నాను: న్యాయవంతులు, జ్ఞానులు వారి క్రియలతో దేవుని చేతిలో ఉన్నారు. అయితే వారి భవిష్యత్తులో ప్రేమ ఉంటుందా? ద్వేషం ఉంటుందా? ఈ సంగతి ఎవరికీ తెలియదు. 2 ✽ఏ భేదమూ లేదు. అందరికీ ఒకేలా సంభవిస్తుంది. న్యాయవంతులకూ, దుర్మార్గులకూ, మంచివారికీ, శుద్ధులకూ, అశుద్ధులకూ, బలులు అర్పించేవారికీ అర్పించనివారికీ జరిగేది ఒక్కటే. మంచివారికి ఎలాగో పాపాత్ములకూ అలాగే జరుగుతుంది. ఒట్టు పెట్టుకొనేవారికి ఎలాగో, ఒట్టంటే భయపడేవారికీ అలాగే జరుగుతుంది.3 ✽ అందరి గతీ ఒక్కటే, సూర్యమండలం క్రింద సంభవించే సంఘటనల్లో ఇది చాలా విషాదకరం. అంతేగాక, మనుషుల హృదయం చెడుతనంతో నిండి ఉంది. బ్రతికినన్నాళ్ళూ వారి హృదయంలో వెర్రితనం ఉంటుంది. తరువాత వారు చనిపోయినవారి దగ్గరికి చేరుతారు. 4 సజీవుల మధ్య బ్రతికి ఉన్నవారికి ఆశాభావం ఉంటుంది. చచ్చిన సింహంకంటే బ్రతికి ఉన్న కుక్క నయం. 5 సజీవులకు తాము చస్తామని తెలుసు. చచ్చినవారికి ఏమీ తెలియదు. వారికింకా ప్రతిఫలం ఏమీ ఉండదు. వారి పేరు కూడా అందరూ మరిచిపోతారు. 6 వారికి ప్రేమలు, పగలు, అసూయలు గతించిపొయ్యాయి. సూర్యమండలం క్రింద జరిగే ఏ విషయంలోనూ వారికి ఇంకెన్నడూ ప్రమేయం ఉండదు. 7 ✽నీవు సంతోషంగా నీ తిండి తిను. ఉల్లాసంగా నీ ద్రాక్షరసం త్రాగు. ఇప్పుడు నీ క్రియలు దేవునికి నచ్చుతాయి. 8 ఎప్పుడూ తెల్లటి బట్టలు వేసుకో. తలకు నూనె బాగా రాచుకో.
9 దేవుడు సూర్యమండలం క్రింద నీకు ఆయుష్షు దయ చేశాడు. ఇదంతా వ్యర్థం. అయినా, బ్రతికినన్నాళ్ళు నీవు ప్రేమించిన నీ భార్యతో సంతోషంగా గడుపు. నీ జీవితకాలం వ్యర్థమే. అయినా, అలా సంతోషంగా ఉండు. సూర్యమండలం క్రింద నీ బ్రతుకులో, నీ ప్రయాసలో అదే నీ భాగం. 10 నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి వంచన లేకుండా చెయ్యి. నీవు పోయే మృత్యులోకంలో పనే ఉండదు. ప్రణాళికా ఉండదు. తెలివీ ఉండదు. జ్ఞానమూ ఉండదు.
11 సూర్యమండలం క్రింద జరిగేది మరొకటి నాకు కనిపించింది. వేగంగా పరిగెత్తగలిగినా, పందెంలో గెలవరు. బలం ఉన్నా, యుద్ధంలో విజయం లభించదు. జ్ఞానికి తిండి పుట్టదు. ఎంత బుద్ధిమంతుడైనా ధనధాన్యాలు సమకూరవు. తెలివి ఉన్నా దయ లభించదు, ఇవన్నీ అదృష్టవశాన, కాలవశాన కలిగేవి. 12 అంతేగాక, తన కాలమేదో ఒక వ్యక్తికి ఎప్పుడూ తెలియదు. చేపలు బాధకరమైన వలలో చిక్కుకుంటాయి. పిట్టలు వలలో పడతాయి. అలాగే తమకు హఠాత్తుగా సంభవించే చెడు కాలంలో చిక్కుకుంటారు మనుషులు.
13 సూర్యమండలం క్రింద జ్ఞానాన్ని వెల్లడించిన మరో విషయం చూశాను. ఇది నా మనసులో బాగా నాటింది. 14 ఒక చిన్న పట్టణం ఉంది. దానిలో కొద్దిమంది కాపురమున్నారు. దానిమీదికి గొప్ప రాజు దండెత్తి వచ్చి, దాన్ని ముట్టడించి, దాని ఎదుట పెద్ద మట్టిదిబ్బ కట్టాడు. 15 ఆ పట్టణంలో ఓ బీదవాడున్నాడు. అతడు జ్ఞాని. అతడు తన జ్ఞానంచేత ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఆ బీదవాణ్ణి అందరూ మరిచిపోయారు. 16 నేనిలా భావించాను: బలంకంటే జ్ఞానం మంచిది నిజమే! కాని, ఇప్పుడు ఆ బీదవాడి జ్ఞానం ఎవరికి లెక్క? అతడి మాటలు ఇంకా వినేదెవరు? 17 మూర్ఖులను పరిపాలించే రాజు వేసే కేకలకంటే జ్ఞాని పలికే మెల్లని పలుకులు వినతగ్గవి.
18 యుద్ధాయుధాల కంటే జ్ఞానం మేలు! పాపిష్టి మనిషి ఎన్ని పనులనైనా చేసి విడుస్తాడు.