8
1 ✽జ్ఞానులకు ఎవరు సాటి? విషయ పరిజ్ఞాన వివరణ ఇంకెవరికి తెలుసు? జ్ఞానం మనిషికి ముఖ వర్చస్సు కలిగిస్తుంది. మనిషి ముఖంలో కరుకుదనం జ్ఞానంచేత మారిపోతుంది.2 ✽ నేను చెప్పేదేమిటంటే, రాజాజ్ఞను నీవు పాటించాలి. ఎందుకంటే, నీవు దేవుని ఎదుట శపథం చేశావు.
3 రాజుయెదుటనుంచి తొందరపడి వెళ్ళిపోవద్దు. చెడుగులో పాలు పొందకు. రాజు ఇష్టపడితే ఏదైనా చేస్తాడు.
4 రాజు మాట అధికారంతో వస్తుంది. నీవేమి చేస్తున్నావని రాజును అడిగేవాడెవడు?
5 ఆజ్ఞ శిరసావహించేవారికి కీడేమీ కలగదు. జ్ఞానికి సమయమేదో, యుక్త విధానమేదో అంతరంగంలో తెలుసు.
6 ప్రతి దానికి సమయం ఉంది, యుక్త విధానమూ ఉంది. అయినా మనుషుల దుర్దశ గొప్పది.
7 ✝ఏమి జరగబోతుందో మనుషులకు తెలియదు. అది ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
8 ✽గాలి వీచకుండా చెయ్యాలంటే, దానిమీద శాసనాధికారం ఎవరికీ లేదుగా. అలాగే తన మరణదినం మీద ఎవరికీ అధికారం లేదు. ఈ యుద్ధంలో విడుదల దొరకదు. దుర్మార్గం దాన్ని అనుసరించేవాళ్ళను తప్పించదు.
9 ✽సూర్య మండలం క్రింద ఒకడిమీద ఒకడు పెత్తనం చేసి పరస్పర హాని తెచ్చిపెట్టే ఈ కాలంలో, జరిగే ప్రతి పనీ నేను మనస్ఫూర్తిగా పరిశీలించాను. ఇదంతా నేను తెలుసుకొన్నాను. 10 ఇది కూడా నేను చూశాను – దుర్మార్గులు చనిపోతే వాళ్ళకు అంత్యక్రియలు జరుగుతాయి. వాళ్ళు దేవుని పవిత్ర ఆలయానికి క్రమంగా వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఊళ్ళోవాళ్ళంతా వారిని ఇట్టే మరచిపోతారు. ఇది కూడా వ్యర్థమే.
11 ✽దుర్మార్గానికి తగిన తీర్పు త్వరగా రాకపోయేసరికి మనుషులు భయం లేకుండా బరితెగి కావాలని చెడు పనులు చేయసాగుతారు. 12 ✽నూరు సార్లు చెడుగు చేసిన పాపులు దీర్ఘాయుష్షు కలిగి బ్రతికినా, దేవుని పట్ల, ఆయన సన్నిధానంలో భయభక్తులున్నవారికే క్షేమం ఉంటుందని నాకు తెలుసు. 13 దుర్మార్గులకు దేవుడంటే భయభక్తులుండవు గనుక వాళ్ళకు క్షేమం ఉండదు. వాళ్ళు నీడలాగా తమ జీవితాన్ని పొడిగించుకోలేరు. ఇది కూడా నాకు తెలుసు.
14 ✽భూమిమీద మరో వ్యర్థ క్రియ జరుగుతూ ఉంది. అదేమిటంటే, అప్పుడప్పుడు దుర్మార్గులకు తమ క్రియలనుబట్టి సంభవించవలసినది సన్మార్గులకు సంభవిస్తుంది. సన్మార్గులకు తమ క్రియలను బట్టి సంభవించవలసినది దుర్మార్గులకు సంభవిస్తుంది. ఇది కూడా వ్యర్థమని తోస్తుంది నాకు. 15 ✽హాయిగా అన్నపానాలు పుచ్చుకొని సంతోషించాలి మనిషి. సూర్యమండలం క్రింద ఇంతకంటే లాభసాటి విశేషం మరొకటి లేదు. అందుచేత సంతోషాన్ని నేను ప్రశంసిస్తాను. సూర్యమండలం క్రింద మనిషి కష్టపడి బ్రతకాలని దేవుడు నిర్ణయించిన కాలమంతా అతడికి తోడు వచ్చేది సంతోషమే.
16 ✽జ్ఞానాభ్యాసం చేయాలనీ, రాత్రింబగళ్ళు కండ్లకు నిద్ర అంటే ఏమిటో తెలియకుండా మనుషులు చేస్తూ ఉన్న కృషి చూడాలనీ నా మనసును దీనిమీద లగ్నం చేశాను. 17 దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యమండలంక్రింద జరిగేవి మనుషులకు అర్థం కావు. ఎంత ప్రయత్నించినా, వారు గ్రహించరు. ఎవడో ఒక జ్ఞాని “నేను గ్రహించాను” అని చెప్పినా అతడు గ్రహించలేడు.