12
1 కష్టాలతో నిండిన రోజులు రాబోతాయి. “జీవితం అంటే నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పేకాలం రాబోతుంది. అంతకుముందే నీ యువదశలోనే నీ సృష్టికర్తను స్మరించుకో.
2 వెలుగు మసకబారిపోతుంది. సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్ముతుంది. వాన వెంట మేఘాలు మళ్ళీ వస్తాయి. అంతకుముందే నీ సృష్టికర్తను స్మరించుకో.
3 ఆ కాలం ఇంటి కావలివాళ్ళు వణుకుతారు. బలిష్ఠులు వంగిపోతారు. తిరగలి విసిరేవారు “కొద్ది మందిమి మాత్రమే గదా” అని పని మానివేస్తారు. కిటికీలో నుంచి చూచేవారి దృష్టి మందగించిపోతుంది.
4 తిరగటిరాళ్ళు చప్పుడు తగ్గిపోతుంది. వీధి తలుపులు మూసివేస్తారు. పిట్ట కూతకు మనుషులు మేలుకొంటారు. గాని సంగీత నాదమంతా మెల్లగా వినిపిస్తుంది.
5 ఎత్తు స్థలాలంటే మనుషులకు భయమవుతుంది. దారిలో భయంకర దృశ్యాలు కనిపిస్తాయి. బాదం చెట్టుకు పూలు పూస్తాయి. మిడత బరువెక్కిపోతుంది. ఆశ గతించిపోతుంది. మనిషి తన శాశ్వత నివాసం చేరుతాడు. అతడికోసం ఏడుస్తూ బజారున పడుతారు.
6 వెండి తాడు విడిపోతుంది. బంగారు గిన్నె నలిగిపోతుంది. నీటి ఊటదగ్గర కుండ బ్రద్దలవుతుంది. బావి దగ్గర చక్రం విరిగిపోతుంది.
7 మట్టితో తయారైనది తిరిగి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి పోతుంది. అంతకు ముందే నీ సృష్టికర్తను స్మరించుకో.
8 వ్యర్థం! వ్యర్థం! అంటున్నాడు ఈ ప్రసంగి. అంతా వ్యర్థం!
9 ఈ ప్రసంగి జ్ఞాని. అంతేగాక అతడు ప్రజలకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. అతడు చింతనాపరుడై ప్రచురించాడు. 10 ప్రసంగి చక్కని మాటలు రాయడానికి ప్రయత్నించాడు. అతడు రాసినది నిష్కపటమైన యథార్థ వాక్కులు.
11 జ్ఞానుల వాక్కులు ములుకోలలాంటివి. గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకులలాంటివి. కాపరి ఒక్కడే వాటిని ఇచ్చాడు.
12 అవి గాక, వేరేవాటిని గురించి నా హెచ్చరిక విను. నా కుమారా, పుస్తకాలు అసంఖ్యాకాలుగా రాస్తారు. వాటికి అంతూ పొంతూ ఉండదు. విద్యాభ్యాసం అతిగా చేయడంవల్ల శరీరం అలసిపోతుంది.
13 ఇదంతా విన్నతరువాత తేలినది ఇదే: దేవుడంటే భయభక్తులు అలవరచుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలి. మానవులందరి విధ్యుక్తధర్మం ఇదే.
14 రహస్యంలో జరిగే ప్రతి విషయాన్నీ దేవుడు తీర్పులోకి తెస్తాడు. మనుషులు చేసే ప్రతి పనీ, అది మంచిది కానీ కాకపోనీ, తీర్పులోకి వస్తుంది.