5
1 ✽నీవు దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన కనిపెట్టుకొని మరీ వెళ్ళు. వినడానికి సమీపించు. మూర్ఖంగా బలి అర్పించడంకంటే అది మేలు గదా. తామేమి దుర్మార్గం చేస్తున్నారో వారికే తెలియదు. 2 దేవుని సన్నిధానంలో మాట్లాడడానికి నీ హృదయాన్ని తొందరపడనియ్యకు, త్వరపడి నీ నోటితో ఏమి పలకకు. దేవుడు పరలోకంలో ఉన్నవాడు, నీవు భూమిమీద ఉన్నావు. అందుచేత నీ మాటలు కొద్దిగానే ఉండాలి. 3 చింతలు అనేకం ఉంటే కలలు వస్తాయి. మాటలు ఎక్కువైతే తెలివితక్కువ వాడి కంఠమని గుర్తించవచ్చు.4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకొంటే, దాన్ని తీర్చుకోవడానికి ఆలస్యం చెయ్యకు. మూర్ఖుల విషయంలో దేవునికి సంతోషం ఉండదు. ఆ మొక్కుబడి తీర్చుకో! 5 నీవు మొక్కుకొని, దానిని చెల్లించకపోవడంకంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిది. 6 నీ నోటి మూలంగా నీవు అపరాధివి కాకుండా చూచుకో. దూతతో “ఏదో పొరపాటైంది” అని చెప్పకు. నీవు చెప్పినది విని దేవుడు కోపపడి, నీ కృషివల్ల నీకు కలిగినవాటిని నాశనం చేస్తాడేమో. అదంతా ఎందుకు? 7 ఎక్కువ కలలు కనడం, అధికంగా మాట్లాడడం వ్యర్థం. నీవు మట్టుకు దేవునిపట్ల భయభక్తులతో మెలుగుతూ ఉండు.
8 ✽ఏ ప్రదేశంలో నైనా బీదప్రజలు దౌర్జన్యానికి గురి కావడం, నీతిన్యాయాల భంగం నీవు చూస్తే ఆశ్చర్యపడనక్కరలేదు. అక్కడి అధికారులను పై అధికారులు కాపాడుతారు. ఆ అధికారులను వారికంటే పైవారు కాపాడుతారు. 9 భూసంపద దేశంలో అందరికీ లాభకరం. అందుచేత రాజు భూమి విషయం శ్రద్ధ తీసుకోవడం అందరికీ మేలు.
10 ✽డబ్బును ఆశించేవారు దానితో తృప్తిపడరు. అధిక లాభం ఆశించేవారికి దానితో కూడా తృప్తి ఉండదు. ఇది కూడా వ్యర్థం! 11 ఆస్తి వృద్ధి అవుతున్న కొద్దీ, దాన్ని తినేవాళ్ళు ఎక్కువవుతారు. ఆస్తిపరుడు ఆ ఆస్తిని కండ్లారా చూస్తూ ఉండగలడు గాని, అది తప్ప ఆ ఆస్తివల్ల అతడికేమి ప్రయోజనం? 12 కడుపునిండా తిన్నా, తినకపోయినా, శ్రమజీవి హాయిగా నిద్రపోతాడు. కాని, ఐశ్వర్యం ధనికులకు నిద్ర పట్టనియ్యదు.
13 ✽సూర్యమండలం క్రింద చాలా దుఃఖకరమైన విషయం ఒకటి నాకు కనిపించింది. అదేమిటంటే, ఆస్తిపరుడు తన ఆస్తిని దాచిపెట్టి, తనకు తానే హాని కొనితెచ్చుకుంటాడు. 14 ఏదో విపత్తువల్ల అతడి ఆస్తి అంతా హరించుకుపోవచ్చు. అతడికి కొడుకు జన్మిస్తే వాణ్ణి పోషించుకోవడానికి కూడా చేతిలో అతడికి ఏమీ ఉండదు. 15 అతడు తల్లి గర్భంనుంచి నగ్న శరీరిగా వచ్చాడు. వచ్చినట్టే పోతాడు. తాను కష్టపడి సంపాయించుకొన్నది ఏదీ చేతపట్టుకొని పోడు. 16 అన్ని విధాల అతడు వచ్చినట్టే వెళ్ళిపోతాడు. గాలి కోసం శ్రమించినట్టే ఉంటుంది. అతడికి కలిగిన లాభమేమిటి? ఇది కూడా చాలా దుఃఖకరమైన విషయం. 17 ✽అతడు బ్రతికినన్నాళ్ళూ చీకట్లో తింటాడు. అతడికి చాలా విసుగు, బాధ, కోపం అలవడుతాయి.
18 ✽నేను తెలుసుకొన్నదేమిటంటే, దేవుడిచ్చిన జీవిత కాలమంతా మనిషి అన్నపానాలు పుచ్చుకొంటూ, సూర్య మండలంక్రింద అతడి ప్రయాసమంతట్లో తృప్తిపడడం మంచిది, మెరుగైనది. ఇదే అతడికి దేవుడు కేటాయించిన భాగం! 19 దేవుడు ఎవడికైనా ధనధాన్య సమృద్ధి ప్రసాదిస్తాడనుకో. అతడు దాన్ని హాయిగా అనుభవిస్తూ, ఇదే దేవుడిచ్చిన భాగమంటూ, తన ప్రయాసలో సంతోషిస్తూ ఉన్నాడనుకో. అదంతా దేవుని ఉచిత బహుమానమే. 20 అతడు హృదయంలో ఆనందం అనుభవిస్తూ ఉండేలా దేవుడు చేస్తున్నాడు. అందుచేత తాను బ్రతికిన రోజులను గురించి ఎక్కువగా తలచుకోడు.