6
1 ✽సూర్యమండలంక్రింద మరో దుఃఖకరమైన విషయం నాకు కనబడింది. అది మనుషులమీద బలంగా పని చేస్తుంది. 2 అదేమిటంటే, దేవుడు ఒకానొకడికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తాడు. అతడికి ఏది కావాలంటే అది కొదువ లేకుండా దొరుకుతుంది. కాని, అదంతా అతణ్ణి అనుభవించలేని స్థితిలో ఉంచుతాడు దేవుడు. పరాయివాడెవడో దాన్ని అనుభవించడానికి వస్తాడు. ఇదంతా వ్యర్థం! ఇదంతా తీవ్రమైన బాధ.3 ఒకానొకడికి నూరుగురు సంతానం. అతడు దీర్ఘాయుష్మంతుడు. కాని, అతడికి తనకున్న మంచివాటివల్ల తృప్తి ఉండదు. అతడికి సరిగా అంత్యక్రియలు కూడా జరగవు. అతడు చిరకాలం బ్రతికినా, అతడి స్థితికంటే గర్భస్రావమై పోయిన పిండమే నయం అనిపిస్తుంది నాకు. 4 అకాల జన్మం వ్యర్థంగా కలుగుతుంది. అది చీకట్లోకి పోతుంది. దాని పేరును చీకటి కమ్మివేస్తుంది. 5 అది సూర్యరశ్మిని చూడదు. దానికి ఏమీ తెలియదు. 6 ఒక మనిషి రెండు వేల సంవత్సరాలు బ్రతికినా మేలు అనుభవించకపోతే అతడి స్థితిగతులకంటే గర్భస్రావమైన ఆ పిండం స్థితిగతులే నయం! అతడి కంటే ఎక్కువ నెమ్మది లభించేది దానికే. అయినా అంతా చేరేది చివరికి ఒకే చోటికి✽ గదా.
7 ✽మనుషులు పడే శ్రమ అంతా తిండి తిప్పలే. అయితే ఎంత తిన్నా మనసుకు తృప్తి కలగదు. 8 మూర్ఖులకంటే జ్ఞానుల గొప్ప ఏమిటీ? బీదవాడు సజీవుల ఎదుట ఎలా ప్రవర్తించాలో నేర్చుకొంటే ఇతడి గొప్ప మట్టుకేముంది?
9 లేనిదానికోసం తిరుగులాడడం కంటే కనుచూపు మేరలో ఉన్నది అనుభవించడం మేలు. అయినా ఇది కూడా వ్యర్థం! గాలికోసం శ్రమించినట్టే ఉంటుంది. 10 ✽ఉనికిలో ఉన్న ప్రతిదానికీ పేరు ఉంది. మనిషి ఎలాంటివాడో పూర్వం తెలిసిన విషయమే. మనిషి తనకంటే బలవంతుడితో వివాదం పెట్టుకొని నెగ్గలేడు. 11 మాటలు ఎక్కువైతే అర్థం తక్కువ అవుతుంది. దానివల్ల మనుషులకు ఏమి ప్రయోజనం? 12 ✽మనిషి నీడలాగా తన అల్ప జీవితకాలం అంతా వ్యర్థంగా గడిపేవాడు. ఈ బ్రతుకులో మనిషికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? అతడు గతించాక, సూర్యమండలం క్రింద ఏమి జరుగుతుందో అతడికి ఎవరు తెలియజేయగలరు?