4
1 ఆ తరువాత, సూర్యమండలం క్రింద జరుగుతున్న అనేక రకాల దౌర్జన్య క్రియలను గురించి నేను తలపోశాను. దౌర్జన్యానికి గురి అయినవారు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నప్పుడు వారిని ఆదరించే వాడెవడూ లేడు. వారిని దౌర్జన్యం చేసేవాళ్ళు బలవంతులు. వారిని ఆదరించేవాడెవడూ లేడు. 2 కనుక ఇప్పుడు బ్రతికి ఉన్నవారికంటే ముందు చనిపోయినవారే ధన్యులని భావించాను. 3 వీరందరికంటే ఇంకా పుట్టనివారే ధన్యులు. సూర్యమండలం క్రింద జరిగే చెడుగును చూడనివారే ధన్యులన్నమాట.
4 ప్రయాసమంతా, సఫలమైన పనులన్నీ మనుషుల మధ్య ఉన్న అసూయ ఫలం అని గ్రహించాను. ఇది కూడా వ్యర్థం. గాలి కోసం శ్రమించినట్టే ఉంది. 5 మూర్ఖులు చేతులు ముడుచుకొని కూర్చుని స్వమాంస భక్షణ చేసేవారన్నమాట! 6 రెండు చేతులనిండా కష్టం, గాలికోసం శ్రమించడం కంటే ఒక చేతినిండా శాంతి ఉంటే అది ఎంతో మేలు!
7 నేను మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే, నాకు మరో వ్యర్థమైన సంగతి సూర్యమండలం క్రింద గోచరించింది. 8 ఒకానొక ఒంటరిగాడున్నాడు. అతడికి ఎవ్వరూ జత లేరు. అతడికి కొడుకు లేడు. సోదరుడు లేడు. అతడు ఎడతెరిపి లేకుండా కష్టించి పని చేస్తాడు. తన ధనాన్ని చూచి, అతడి కండ్లకు తృప్తి కలగదు. “నేను సుఖపడకుండా ఎవరికోసం కష్టపడుతూ ఉన్నాను?” అని తలపోయడు. ఇది కూడా వ్యర్థం! దుఃఖకరమైన విషయం!
9 ఇద్దరు కలిసి కష్టించి పని చేస్తే దానిమూలంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. గనుక ఒంటరితనంకంటే ఇద్దరు జంటగా ఉండడం మంచిది. 10 ఇద్దరిలో ఒకడు పడితే రెండోవాడు లేవనెత్తగలడు. ఒంటరిగా ఉన్నవాడు పడితే, వాడికి మిగిలేది బాధ. అతణ్ణి లేవనెత్తేవాడెవడూ లేడు గదా. 11 ఇద్దరు కలిసి పడుకొంటే వెచ్చదనం ఉంటుంది. ఒంటరిగా పడుకొంటే వెచ్చన ఎలా ఉంటుంది? 12 ఒంటరిగా ఉన్నవాడిమీదికి ఎవడైనా వచ్చిపడి గెలవగలడు. ఇద్దరైతే, వాణ్ణి ఎదిరించవచ్చు గదా. ముప్పేటల తాడు త్వరగా తెగదు.
13 మూర్ఖుడై హెచ్చరికలను చెవిని పెట్టని ముసలి రాజుకంటే బీదవాడై జ్ఞానం గల యువకుడే నయం. 14 అలాంటి యువకుడు చెరసాలనుంచి బయటపడి పట్టాభిషేకం పొందవచ్చు. తన దేశంలో దరిద్రుడుగా పుట్టినా రాజవుతాడు. 15 సూర్యమండలం క్రింద బ్రతికి తిరుగాడేవారంతా, గతించిన వృద్ధ రాజుకు బదులుగా రాజైన ఈ యువకుడి పక్షాన చేరుతారు. ఈ సంగతి నేను పరిశోధించి తెలుసుకొన్నాను. 16 అతడి ఆధీనంలో ఉన్న ప్రజలు అసంఖ్యాకులు. అయినా, ఆ తరువాతి తరంవారికి ఇతడంటే ఇష్టం ఉండదు.
ఇది కూడా వ్యర్థం. గాలికోసం శ్రమించినట్టే అవుతుంది.