3
1 ✽ప్రతిదానికీ సరైన సమయం ఉంటుంది. ఆకాశం క్రింద జరిగే ప్రతి విషయానికీ యుక్త సమయం ఉంటుంది.2 పుట్టడానికీ చావడానికీ, నాటడానికీ నాటినదాన్ని పీకివేయడానికీ సమయం ఉంటుంది.
3 చంపడానికీ బాగు చేయడానికీ, పడగొట్టడానికీ కట్టడానికీ సమయం ఉంటుంది.
4 ఏడవడానికీ నవ్వడానికీ, శోకించడానికీ నాట్యం చెయ్యడానికీ సమయం ఉంటుంది.
5 రాళ్ళు పారవేయడానికీ వాటిని సమకూర్చడానికీ, కౌగలించడానికీ మానడానికీ సమయం ఉంటుంది.
6 వెదకడానికీ పోగొట్టుకోవడానికీ, దాచిపెట్టడానికీ పారవేయడానికీ సమయం ఉంటుంది.
7 చించడానికీ కుట్టడానికీ, మౌనంగా ఉండడానికీ మాట్లాడడానికీ సమయం ఉంటుంది.
8 ప్రేమించడానికీ ద్వేషించడానికీ, యుద్ధానికీ శాంతికీ సమయం ఉంటుంది.
9 మనిషి పని చేస్తే అతడి పరిశ్రమవల్ల కలిగే ఫలితం ఏమిటి?
10 ✽మనుషులు కష్టపడాలని దేవుడు వారికి నియమించిన ప్రయాసను నేను చూశాను. 11 దేని సమయంలో అది చక్కగా ఉండేలా దేవుడు సమస్తాన్నీ నియమించాడు. ఆయన శాశ్వతత్వాన్ని మనుషుల హృదయంలో ఉంచాడు. అయినా దేవుని క్రియాకలాపాలను మనుషులు పూర్తిగా తెలుసుకోలేరు. 12 మనుషులు సంతోషంగా ఉండి, బ్రతికినంతవరకూ మేలు చేస్తూ ఉండాలి. మనుషులకు ఇంతకంటే క్షేమకరమైనది మరొకటి లేదని నాకు తెలుసు. 13 అంతే గాక, ఒక వ్యక్తి అన్నపానాలు పుచ్చుకొంటూ, తన ప్రయాసమంతట్లో తృప్తిపడితే అది దేవుని ఉచిత బహుమానమే.
14 ✽దేవుడు చేసే పనులన్నీ ఎప్పటికీ నిలుస్తాయని నాకు తెలుసు. వాటికి ఏదీ చేర్చలేము. వాటిలోనుంచి ఏదీ తీసివెయ్యలేము. దేవుడు ఇలా చేయడంలో ఆయన ఆశయమేమంటే మనుషులు ఆయనపట్ల భయభక్తులు చూపాలని. 15 ఇప్పుడు జరుగుతున్నది ఇంతకు మునుపు జరిగినదే. ఇకముందు జరగబోయేది పూర్వం ఉన్నదే. మునుపున్నదాన్ని మళ్ళీ ఉండేలా దేవుడు చేస్తాడు.
16 ✽సూర్యమండలం క్రింద మరో విషయం గమనించాను – తీర్పు తీర్చే స్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. న్యాయానికి బదులు దుర్మార్గం ప్రవర్తిల్లుతుంది. 17 నా హృదయంలో అనుకొన్నాను: ప్రతి ఉద్యమానికీ, ప్రతి పనికీ సమయం అంటూ ఉంది. అయితే సన్మార్గులకూ దుర్మార్గులకూ దేవుడు తీర్పు తీరుస్తాడు.
18 ✽మనుషుల విషయం మరో ఆలోచన నాకు వచ్చింది – మనుషులు తాము పశుప్రాయులని గ్రహించేలా దేవుడు వారిని విషమ పరీక్షలకు గురి చేస్తాడు. 19 మనుషులకూ, మృగాలకూ జరిగేది ఒకటే. ఒకే పరిస్థితి సంభవిస్తుంది – జంతువులు చచ్చినట్టే మనుషులూ చస్తారు. జీవులన్నిటికీ ఊపిరి ఒక్కటే. జంతువులకంటే మనుషులకు ఎక్కువ ఏమి ఉంది? అంతా వ్యర్థం! 20 అంతా పోయేది ఒకే చోటికి. సమస్తమూ మట్టిలోనుంచి పుట్టింది. తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. 21 మనుషుల ప్రాణం పైకి ఎక్కిపోతుందా? జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందా? ఏమో ఎవరికి తెలుసు?
22 మనిషి కాలం చేసిన తరువాత ఏమి జరుగుతుందో చూడడానికి అతణ్ణి ఎవరు తిరిగి తెస్తారు? గనుక మనుషులు తాము చేసిన పనులను బట్టి ఆనందించడంకంటే క్షేమకరమైనది ఇంకొకటి లేదని గ్రహించాను. ఇదే వారి భాగం.