2
1 ✽నా హృదయంతో నేనన్నాను, “సుఖ సంతోషాలచేత నిన్ను పరీక్షిస్తాను. నీవు మంచివి అనుభవించు.” కాని, ఇది కూడా వ్యర్థం అయిపోయింది. 2 నవ్వును ఉద్దేశించి “అది వెర్రిబాగులది” అన్నాను. సంతోషాన్ని గురించి “దాని పర్యవసానమేమిటి?” అన్నాను. 3 నా మనసు ఇంకా జ్ఞానాన్ని అనుసరిస్తూ, నా శరీరాన్ని ద్రాక్షమద్యంతో తృప్తి పరచుకోవాలనీ, అవివేకాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాలనీ నిశ్చయించుకొన్నాను. మనుషులు బ్రతికినన్నాళ్ళూ చేయవలసిన మంచి ఏమిటో తెలుసుకుందామనుకొన్నాను.4 ✽నేను ఘన కార్యాలు సాధించాను. ఇండ్లు కట్టించుకొన్నాను. ద్రాక్షతోటలు నాటించాను. 5 వేరే తోటలూ, శృంగార వనాలూ నాటించాను. వాటిలో అన్ని రకాల ఫల వృక్షాలను పెంచాను. 6 చెరువులు త్రవ్వించి ఉధ్యాన వనంలోని చెట్లకు నీటి సదుపాయం చేశాను. 7 దాసదాసీ జనాన్ని సంపాదించాను. నా ఇంట్లోనే పుట్టిన సేవకులు కూడా నాకున్నారు. గొర్రెల మందలు మేకల మందలు నాకెన్నో ఉన్నాయి. నాకు పశు సంపద విస్తారంగా ఉంది. అసలు, జెరుసలంలో నాకు మునుపున్న వారందరికంటే నాకు ఎక్కువ ఉంది. 8 వెండి బంగారాలు సమకూర్చుకొన్నాను. ఆయా దేశాలనుంచి రాజ సంపదను సేకరించాను. నాదగ్గర గాయనీ గాయకులను, మనుషులు ఆశించే విలాసాలన్నీ సంతరించు కొన్నాను. అనేకమంది ఉంపుడుకత్తెలు ఉన్నారు నాకు. 9 ✽జెరుసలంలో నాకు మునుపు ఉన్న వారందరికంటే నేనెంతో గొప్పవాణ్ణయ్యాను, నాకు జ్ఞానం ఉండనే ఉంది కూడా.
10 ✽నా కండ్లకు ఇంపైనదేదో దాన్నల్లా స్వేచ్ఛగా అనుభవించాను. నా హృదయం ఆశించే సుఖ సంతోషాల్లో దేన్నీ నేను నిరాకరించలేదు. నేను చేసిన దానివల్ల నాకు సంతోషం కలిగింది కూడా. నా క్రియాకలాపాలన్నిటికీ ఇదే నాకు లభించిన ఫలితం. 11 ✽అప్పుడు నా చేతులతో నేను చేసిన పనులన్నీ ఒక సారి కలయ చూశాను. వీటన్నిటికోసం నేను పడ్డ ప్రయాస విషయం ఆలోచించాను. తీరా చూస్తే, ఇదంతా వ్యర్థమే అని తేలింది. ఇదంతా గాలికోసం శ్రమించినట్టే అనిపించింది.
12 ✽రాజు తరువాత వచ్చినవాడు ఏం చేస్తాడు? అంతకు ముందు ఏం చేయబడినదో అదే చేయగలడు. నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, అవివేకాన్ని పరిశీలించడానికి నా మనసు తిప్పుకొన్నాను. 13 నేను గ్రహించేదేమిటంటే చీకటికంటే వెలుగు మేలు. అలాగే తెలివితక్కువతనం కంటే జ్ఞానం మేలు. 14 జ్ఞానికి కండ్లు తలలో ఉంటాయి. మూర్ఖుడు చీకట్లో నడుస్తాడు. అయినా అందరికీ ఒకటే విషయం సంభవిస్తుందని నాకు తెలుసు. అప్పుడు నాలో ఈ తలంపు కలిగింది: 15 “మూర్ఖుడికి ఏం సంభవించబోతుందో అదే నాకూ సంభవిస్తుంది. మరి, నాకింత జ్ఞానం ఉండడం వల్ల ప్రయోజనమేమిటి?” ఇది కూడా వ్యర్థం అనుకొన్నాను. 16 అజ్ఞానీ, జ్ఞానీ – వీరిద్దరినీ అందరూ ఇట్లే మరిచిపోతారు. రాబోయే రోజుల్లో వీరిని ఎవ్వరూ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు. జ్ఞానులూ, అజ్ఞానులూ ఒకేలాగా చస్తారు!
17 ✽ఇదంతా చూస్తూ ఉంటే సూర్యమండలం క్రింద జరుగుతున్నదంతా నాకెంతో విచారం కలిగించింది. అంతా వ్యర్థం. గాలికోసం శ్రమించినట్టే అనిపించింది. బ్రతుకు అంటే నాకు అసహ్యం వేసింది. 18 ✽సూర్యమండలం క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తరువాత మరొకడికి విడిచిపెట్టవలసి వస్తుందని నాకు తెలుసు. గనుక అవి కూడా నాకు అసహ్యకరమయ్యాయి. 19 నా తరువాత వచ్చేవాడు ఎలాంటివాడో ఏమో! ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు. అతడు ఎలాంటివాడైనా, నేను సూర్యమండలం క్రింద జ్ఞానంతో కష్టపడి సంపాదించుకొన్న నాకష్టార్జితమంతా అతడి స్వాధీనం అవుతుంది. ఇది కూడా వ్యర్థం!
20 సూర్యమండలం క్రింద నేను పడ్డ సమస్తమైన ప్రయాస విషయం నేను నిరాశ చెందాను. 21 మనిషి జ్ఞానంతో, తెలివితో, ప్రవీణతతో ఏదో పని సాధిస్తాడు. అయితే ఇదంతా మరొకడికి వారసత్వంగా విడిచిపెట్టవలసి వస్తుంది. దానికోసం ఇతడు ప్రయాసపడినది ఏమీ లేదు. ఇది కూడా వ్యర్థం, చాలా దుఃఖకరం. 22 సూర్యమండలం క్రింద మనిషికి ఎంతో ప్రయాస. అతడు ఎన్నో కార్యక్రమాలు తలపెడతాడు. కాని, వీటన్నిటిమూలంగా అతడికి ఏం ఒరిగినట్టు? 23 మనిషి బ్రతికినన్నాళ్ళూ బాధ! అతడు పడే పాట్లన్నీ విసుగు! రాత్రిపూట సహా అతడికి మనశ్శాంతి ఉండదు. ఇది కూడా వ్యర్థం!
24 ✽మనిషి అన్నపానాలు పుచ్చుకోవడం, కష్టార్జితంతో మేలు అనుభవించడం మంచిది కాదా? అయినా, ఇది కూడా దేవుని వశంలో ఉందని నాకు తెలుసు. 25 దేవుని అనుమతి లేకుండా ఎవడు భోజనం చేయగలడు? ఎవడు సంతోషంగా ఉండగలడు? 26 దేవుని దృష్టిలో ఎవరు మంచివారో వారికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ప్రసాదిస్తాడు. తరువాత దేవుని దృష్టిలో మంచివారి స్వాధీనం కావడానికి ఆస్తి, ధనం సమకూర్చడం, కూడబెట్టడం అనే పని దేవుడు పాపాత్ములకు నియమించాడు. ఇది కూడా వ్యర్థం. గాలికోసం శ్రమించినట్టే అనిపిస్తుంది.