ప్రసంగి
1
1 దావీదు కొడుకూ, జెరుసలం రాజూ అయిన ప్రసంగి వాక్కులు. 2 వ్యర్థం! వ్యర్థం! అంటున్నాడు ఈ ప్రసంగి. కేవలం వ్యర్థం! అంతా వ్యర్థం!
3 సూర్యమండలం క్రింద మనుషులు చేసే కష్టమైన పని అంతటిమూలంగా వారికి ఏమి ప్రయోజనం కలుగుతున్నట్టు?
4 ఒక తరం గతిస్తే, మరో తరం వస్తుంది. భూమి మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది.
5 పొద్దు పొడుస్తుంది, పొద్దు కుంకుతుంది. అది తను ఉదయించే స్థలానికి త్వరగా మళ్ళీ చేరుకుంటుంది.
6 గాలి దక్షిణంవైపు వీస్తుంది. అంతలో మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. ఈ విధంగా గాలి సుళ్ళు తిరిగి సంచరిస్తూ ఉంటుంది.
7 నదులన్నీ పారుతూ సముద్రంలో చేరుతాయి. అయినా సముద్రం నిండడం లేదు. నదులు తమ ఉత్పత్తి స్థానానికి మరలిపోతాయి. 8 విషయాలన్నీ ఆయాసం పుట్టిస్తాయి – మనిషి వివరించలేనంత ఆయాసం. ఎంత చూచినా కంటికి తృప్తి లేదు, ఎంత విన్నా చెవికి తృప్తి లేదు.
9 ఇంతవరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది. ఇంతవరకూ జరిగినదే ఇక ముందూ జరగబోతుంది. సూర్యమండలం క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.
10 ఏదో ఒకదాన్ని గురించి “ఇదిగో ఇది క్రొత్తది” అంటాడు ఒకడు. అయినా అది మనకు పూర్వం, గత తరాలలో ఉండేదే.
11 మునుపు ఉన్నవి జ్ఞాపకంలో లేవు. జరగబోయేవి ఆ తరువాతి తరంవాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకోరు.
12 నేను ప్రసంగిని. జెరుసలంలో ఇస్రాయేల్‌ప్రజలకు రాజును నేను.
13 ఆకాశం క్రింద ఏమి జరుగుతుందో అంతా జ్ఞానదృష్టితో చూచి, అర్థం చేసుకోవాలని నా మనసును అందులో లగ్నం చేశాను. మనుషులు కష్టపడాలని దేవుడు వాళ్ళకు నియమించిన ప్రయాస కఠినమైనది. 14 సూర్యమండలం క్రింద జరిగే క్రియాకలాపాలన్నీ నేను చూశాను. అవన్నీ వ్యర్థం! గాలికోసం శ్రమించినట్టే ఉన్నాయి ఇవన్నీ! 15 వంకర టింకరగా ఉండేదానిని సరి చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు. లేని వాటిని లెక్క పెట్టడం ఎవరికి చేతా కాదు.
16 నేను అనుకొన్నాను, “జెరుసలంలో నాకు ముందున్న వారందరి కంటే నేను గొప్ప జ్ఞానినయ్యాను. నేనెంతో జ్ఞాన సముపార్జన చేశాను. జ్ఞానాన్ని, విద్యను అధికంగా అభ్యాసం చేశాను.” 17 నా మనసును ఈ విషయంమీద కేంద్రీకరించాను – జ్ఞానమంటే ఏమిటి? ఏది వెర్రి? ఏది అవివేకం? ఇదంతా తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఇది కూడా గాలికోసం శ్రమించినట్టే అని గ్రహించాను. 18 అధిక జ్ఞానం వల్ల అధిక దుఃఖం కలుగుతుంది! జ్ఞాన సంపాదన అధికమైనకొలది శోకం అధికం అవుతుంది.