30
1 ఇవి యాకె కొడుకు ఆగూర్ పలికిన మాటలు. ఇది దేవోక్తి. ఆగూర్ ఈతీయేల్‌కు – ఈతీయేల్‌కూ ఉక్కాల్‌కూ – ఈ మాటలు చెప్పాడు:
2 నిజం చెప్పాలంటే, మనుషులందరిలో నేను మొద్దువాణ్ణి. మనుషులకు ఉండవలసిన తెలివి నాకు లేదు.
3 నేను జ్ఞానం అభ్యసించినవాణ్ణి కాను. పవిత్రుడైన దేవుని విషయమైన జ్ఞానం నాకింకా లభించలేదు.
4 పరలోకానికి పోయి క్రిందికి దిగినవారెవరు? తన పిడికిట గాలిని పట్టుకొన్నవారెవరు? తన ఉత్తరీయంలో జలాలు మూట కట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినదెవరు? ఆయన పేరేమిటి? ఆయన కుమారుని పేరేమిటి? నీకు తెలుసా?
5 దేవుని మాటలన్నీ పరీక్షకు నిలిచినవి. ఆయన శరణు జొచ్చినవారికి ఆయన డాలులాంటివాడు.
6 ఆయన మాటలకేమీ కలపకూడదు. అలా చేస్తే ఆయన నీ మీద కోపపడుతాడు. నీవు అబద్ధికుడివని రుజువు చేస్తాడు.
7 దేవా, నేను నిన్ను రెండు విషయాలు అడిగాను. నేను చావకముందే వాటిని దయ చెయ్యి.
8 మోసం, అబద్ధాలు నాకు దూరం చెయ్యి. చాలినంత ఆహారం నాకు దయ చెయ్యి. బీదతనం నాకు వద్దు. ఐశ్వర్యమూ నాకు వద్దు.
9 మరీ సంపాదన ఎక్కువైతే, నేను సంతుష్టి పొంది, నిన్ను విసర్జించి, “అసలు యెహోవా ఎవడు?” అనేటంతవరకూ వస్తానేమో. మరీ దరిద్రుణ్ణయితే, దొంగతనం చేసి దేవుని పేరు దూషణకు గురి చేస్తానేమో.
10 దాసుడిమీద అతడి యజమానికి అపనింద మాటలు చెప్పవద్దు. అలా చేస్తే అతడు నిన్ను శపించుకుంటాడు. నీమీదికి శిక్ష వస్తుంది.
11 మనుషులలో తండ్రిని శపించేవాళ్ళూ తల్లిని దీవించనివాళ్ళూ ఉన్నారు.
12 తమకు తామే శుద్ధులం అనుకొని, తమ కల్మషంనుంచి శుద్ధికానివాళ్ళు కూడా ఉన్నారు.
13 కండ్లు నెత్తిమీదికి వచ్చినవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కండ్లు చిన్న చూపు చూస్తాయి.
14 వాళ్ళ పళ్ళు ఖడ్గంలాంటివి. వాళ్ళ దవడ పళ్ళు కత్తులలాంటివి. వాటితో దరిద్రులను అమాంతంగా మింగివేసి, వారు దేశంలో లేకుండా చేయాలనీ, మనుషులమధ్య బీదలు లేకుండా వారిని నిర్మూలం చేయాలనీ ప్రయత్నిస్తారు.
15 జలగకు ఇద్దరు కూతుళ్ళున్నారు. ఇద్దరూ “ఇవ్వు! ఇవ్వు!” అని అరుస్తారు. తృప్తి ఎన్నడూ పొందనివి మూడు. “చాలు” అని ఎప్పటికీ చెప్పనివి నాలుగు.
16 అవేవంటే, మృత్యులోకం, గొడ్డుబోతు గర్భం, నీళ్ళతో నిండని భూమి, “చాలు” అనని మంట.
17 తండ్రిని హేళన చేసి, తల్లి మాట తిరస్కరించేవాళ్ళ కండ్లను లోయలోని కాకులు పీకుతాయి. గరుడపక్షి పిల్లలు వాటిని తింటాయి.
18 నా బుద్ధికి మించినవి మూడు, నాకు అర్థం కానివి నాలుగు.
19 అవి ఏవంటే, ఆకాశంలో గరుడపక్షి జాడ, బండమీద పాము జాడ, నడి సముద్రంలో నడిచే ఓడ జాడ, కన్య విషయంలో పురుషుడి జాడ.
20 వ్యభిచారిణి విధానం ఇలా ఉంది: అది తిని నోరు తుడుచుకుంటుంది. “నేనేమీ చెడుగు చేయలేదు” అంటుంది.
21 భూమిని వణికించేవి మూడు, భూమి మొయ్యలేనివి నాలుగు.
22 అవి ఏవంటే, సింహాసనమెక్కిన బానిస, కడుపు నిండిన మూర్ఖుడు, 23 పెళ్ళాడి ద్వేషానికి గురి అయిన స్త్రీ, యజమానురాలి హక్కును కాజేసిన దాసి.
24 భూమిమీద ఈ నాలుగు ప్రాణులు చిన్నవైనా చాలా తెలివైనవి.
25 చీమలు బలంగల ప్రాణులు కావు. అయినా అవి ఎండ కాలంలో తమ ఆహారాన్ని కూడబెట్టుకొంటాయి.
26 చిన్న కుందేళ్ళు కూడా బలం గల ప్రాణులు కావు. కాని, అవి బండల సందుల్లో నివాసం ఏర్పరచుకుంటాయి.
27 మిడతలకు రాజు ఉండడు. అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.
28 బల్లిని చేతితో పట్టుకోవచ్చు గాని, అది రాజగృహంలో ఉంటుంది.
29 గంబీరంగా నడిచేవి మూడున్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు.
30 అవి ఏవంటే, మృగాలన్నిటిలో పరాక్రమం కలిగి, దేనికీ వెన్ను చూపని సింహం.
31 యుద్ధాశ్వం, మేకపోతు, తన సైన్యానికి ముందుగా నడిచే రాజు.
32 నీవు మూర్ఖంగా ప్రవర్తించి, గర్వపడి ఉంటే, దురాలోచన చేసి ఉంటే, చేతితో నోరు మూసుకో.
33 పాలు చిలికితే వెన్న వస్తుంది. ముక్కు పిండితే నెత్తురు వస్తుంది. కోపం రేపితే జగడం వస్తుంది.