28
1 ✝దుర్మార్గులు తమకు తామే పారిపోతారు. వారిని ఎవరూ తరమనక్కరలేదు. సన్మార్గులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు.2 దేశప్రజల తిరుగుబాటుకు ఫలితంగా దాని పాలకులు అనేకులవుతారు. తెలివి, జ్ఞానం గల నాయకుడివల్ల దేశాధికారం సుస్థిరం అవుతుంది.
3 ✝బీదసాదలను బాధించే దరిద్రగొట్టు మనిషి పైరుపంట లేకుండా చేసే గాలివానలాంటివాడు.
4 ✽ఉపదేశం విసర్జించేవారు దుర్మార్గులను స్తుతిస్తారు. ఉపదేశం పాటించేవారు దుర్మార్గులను ఎదిరిస్తారు.
5 ✽దుర్మార్గులకు న్యాయం ఎలాంటిదో తెలియదు. యెహోవాను వెదకుతూ ఉండేవారు దాన్నంతా గ్రహించ గలుగుతారు.
6 ✝కుటిల విధానాలు అనుసరించే ధనికులకంటే, నిజాయితీగా ప్రవర్తించే బీదవారు మేలు.
7 ✽ఉపదేశం ప్రకారం ప్రవర్తించే కొడుకు తెలివైనవాడు. నీచుల స్నేహం పట్టిన కొడుకు తండ్రికి చెడ్డ పేరు తెస్తాడు.
8 అన్యాయంగా అధిక వడ్డీ✽లతో ఆస్తి వృద్ధి చేసుకొనేవారు తుదకు బీదలపట్ల దాతృత్వం✽ గలవారి కోసం కూడబెడు తున్నారు.
9 ✽ ఉపదేశానికి చెవులు మూసుకొనే వ్యక్తి ప్రార్థన కూడా అసహ్యకరం.
10 ✝నిజాయితీపరులను దుర్మార్గంలోకి పడలాగేవారు తాము త్రవ్వుకొన్న గోతిలో తామే పడుతారు. నిర్దోషులకు మంచి వారసత్వం లభిస్తుంది.
11 ✝బాగా డబ్బున్న వాడు తనకు తానే జ్ఞానిని అనుకోవచ్చు. వివేకి అయిన దరిద్రుడు అతణ్ణి పసిగడతాడు.
12 ✽సన్మార్గులకు విషయం చేకూరిందంటే అది చాలా గౌరవనీయం. దుర్మార్గులు అధికారంలోకి వస్తే ప్రజలు దాగుకోవలసిందే.
13 ✽ తన అపరాధాలను కప్పిపుచ్చేవారికి క్షేమం అంటూ ఉండదు. వాటిని ఒప్పుకొని, విసర్జించేవారికే కరుణ దొరుకుతుంది.
14 ఎప్పుడూ భయభక్తులతో✽ మెలిగేవారే ధన్యజీవులు✽. హృదయాన్ని కఠినం✽ చేసుకొనేవారికి తిప్పలు తప్పవు.
15 ✽దిక్కులేని ప్రజలమీద ప్రభుత్వం చేసే దుర్మార్గుడు గర్జించే సింహంలాంటివాడు, తీక్షణమైన ఆకలితో తిరిగే ఎలుగుబంటిలాంటివాడు.
16 ప్రజలను విపరీతంగా బాధించే అధికారి తెలివి తక్కువవాడు. అన్యాయ లాభాన్ని ద్వేషించడం వల్ల మనిషి తన జీవిత కాలాన్ని పొడిగించుకుంటాడు.
17 ✝రక్తపాతం విషయంలో అపరాధి సమాధిలోకి పోయేవరకూ పారిపోతూ ఉండేవాడవుతాడు. అలాంటివాడికి ఎవరూ సహాయం చేయకూడదు.
18 ✽ నిజాయితీపరులకు సంరక్షణ ఉంది. కుటిలంగా ప్రవర్తించేవారు హఠాత్తుగా కూలిపోతారు.
19 ✝తమ పొలం దున్నుకొనేవారికి కడుపునిండా తిండి. వెర్రి పోకడలు పోయేవారికి కటిక దరిద్రం వస్తుంది.
20 నమ్మకమైన వారికి ఆశీస్సులు✽ సమృద్ధిగా లభిస్తాయి. ధనికుణ్ణి✽ కావాలని ఆతురపడే వారికి శిక్ష వస్తుంది.
21 ✽పక్షపాతంతో వ్యవహరించడం మంచిది కాదు. రొట్టెముక్క కోసం ఒకరు ద్రోహం చేస్తారు.
22 చూచిన ప్రతిదీ కావాలనే వ్యక్తులు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి తాపత్రయపడుతారు. తమకు దరిద్రం కలగబోతుందని వారికి తెలియదు.
23 ✝నాలుకతో ముఖస్తుతి చేసే వాడికంటే ఎదుటి మనిషిని మందలించేవాడికి చివరికి అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
24 ✝తల్లిదండ్రుల సొత్తు దోచుకువచ్చి, “ఇదేమీ ద్రోహం కాదులే” అనేవాడు నాశనగొట్టు మనిషికి చెలికాడు.
25 ✝పేరాశగలవారు జగడాలు రేపుతారు. యెహోవామీద నమ్మకం పెట్టేవారికి అభివృద్ధి కలుగుతుంది.
26 ✽తమ మనసును తామే నమ్ముకొనేవారు తెలివితక్కువ వారు. జ్ఞానంగా మసులుకొనేవారికి విడుదల కలుగుతుంది.
27 ✽ బీదలకు దానం చేసేవారికి కొదువ అంటూ ఉండదు. బీదల విషయం కండ్లు మూసుకుపోయినవారి మీదికి శాపాలెన్నో వస్తాయి.
28 దుర్మార్గులు అధికారంలోకి వస్తే ప్రజలు దాగుకోవలసిందే. దుర్మార్గులు నాశనమైతే సన్మార్గుల సంఖ్య పెరుగుతుంది.