27
1 ✝రేపటి గురించి గొప్పలు చెప్పుకోవద్దు. ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు.2 ✝నిన్ను నీవే పొగడుకోవద్దు. ఆ పని ఇతరులు చెయ్యాలి. నీ గురించి నీ పెదవులు స్తుతిపాఠం చెప్పకూడదు. ఆ పని మరెవరైనా చెయ్యాలి.
3 రాయి బరువైనది. ఇసుక కూడా భారమైనదే. మూర్ఖుడు కలిగించిన విసుగు వీటికంటే బరువైనది.
4 ✽ ఆగ్రహం క్రూరమైనది. కోపం వరదలాంటిది. అయితే అసూయ ఎదుట నిలబడగలవాడెవడు?
5 ✽తెలియజేయని ప్రేమకంటే బహిరంగంగా మందలించడం మేలు.
6 నీ మేలే ఉద్దేశించి స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడు. పగవాడు పదే పదే ముద్దు పెట్టుకుంటాడు.
7 కడుపు నిండితే తేనె తెట్టెను కూడా కాలరాచివేస్తారు. ఆకలైన కడుపుకు చేదు పదార్థం కూడా తీపిగానే ఉంటుంది.
8 ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడిచి తిరిగేపక్షిలాంటివాడు.
9 అత్తరు, పరిమళ ద్రవ్యాలు హృదయానికి ఉల్లాసం కలిగిస్తాయి. అలాగే స్నేహితులు హృదయంలో నుంచి వచ్చే సలహా మనోహరంగా ఉంటుంది.
10 నీ స్నేహితుణ్ణి గానీ, నీ తండ్రి స్నేహితుణ్ణి గానీ విసర్జించకు. నీకు ఆపద సంభవిస్తే, నీ సోదరుడి ఇంటికి వెళ్ళవద్దు. దూరాన ఉన్న సోదరుడి కంటే దగ్గరే ఉన్న నీ పొరుగువాడు మేలు.
11 ✝నా కుమారా! జ్ఞానం సంపాయించుకొని, నా హృదయానికి సంతోషం చేకూర్చు. అప్పుడు నన్ను చిన్నబుచ్చే వారితో ధైర్యంగా మాట్లాడగలుగుతాను.
12 బుద్ధిమంతులు కీడు రావడం చూచి దాగుకుంటారు. తెలివితక్కువవారు ముందుకు సాగిపోయి బాధల పాలవుతారు.
13 ✝పరాయివాడికి జామీను ఉండేవాడి వస్త్రం తీసుకో. పరాయివాళ్ళకు అతణ్ణి జామీను ఉండనియ్యి.
14 పొద్దున్నే లేచి పొరుగువారికి పెద్ద కంఠంతో ఆశీర్వచనం పలికితే దానిని శాపంగా ఎంచడం జరుగుతుంది.
15 ✝ముసురు పట్టి ఏక ధారగా వాన కురవడం ఎలా ఉంటుందో, గయ్యాళి పెళ్ళాంతో కాపురం అలాంటిదే.
16 ఆమెను అదుపులో పెట్టడం గాలిని ఆపడంలాంటిపనే. నూనెను చేతితో పట్టుకొని ఉండే ప్రయత్నంలాంటిదే.
17 ✽ఇనుము ఇనుమువల్ల పదును అవుతుంది. అలాగే మనిషి సాటి మనిషి వల్ల చురుకైనవాడు అవుతాడు.
18 ✝అంజూరచెట్టు పెంచేవాడు దాని పండు తింటాడు. తన యజమాని విషయాలను చూచుకొనేవానికి ఘనత చేకూరుతుంది.
19 ✽ఎవడు నీళ్ళలోకి చూస్తే, అతడి ముఖ ప్రతిబింబం కనిపిస్తుంది. ఏ మనిషి మనసులో ప్రతిబింబించేది ఆ మనిషే.
20 ✽ మృత్యులోకానికి, నాశనమైన అగాధానికి తృప్తి ఎప్పటికీ ఉండదు. అలాగే మనుషుల కంటిచూపుకు తృప్తి అంటూ ఉండదు.
21 ✽వెండిని పరీక్షించేందుకు మూస ఉంది. బంగారంకోసం కొలిమి ఉంది. మనిషి తాను పొందిన కీర్తి ప్రతిష్ఠల మూలంగా పరీక్షకు గురి అవుతాడు.
22 మూర్ఖుణ్ణి గోధుమల్లాగా రోట్లో వేసి, రోకటితో దంచినా అతడి మూర్ఖత్వం పోదు.
23 ✽నీ గొడ్డూ గోదా వ్యవహారాలు తెలుసుకో. నీ పశువుల మందలను జాగ్రత్తగా చూచుకో.
24 ఎందుకంటే, ధనధాన్యాలు శాశ్వతమైనవి కావు. రాజ కిరీటం తరతరాలకు నిలిచి ఉండకపోవచ్చు.
25 ఎండిన గడ్డి వామి వేసినతరువాత, పచ్చిక బయళ్ళు కనబడ్డప్పుడు, కొండమీది గడ్డి కోసుకొన్న తరువాత 26 నీ గొర్రెపిల్లల ఉన్ని చాలినంతగా నీ కట్టుబట్టలకు లభిస్తుంది. పొలం కొనుక్కోవాలంటే మేకపోతులను అమ్మవచ్చు.
27 నీకూ నీ ఇంటివారికీ నీ పనికత్తెల పోషణకూ ఆహారంగా మేక పాలు సమృద్ధిగా లభిస్తాయి.