26
1 ఎండకాలంలో చల్లనిమంచు, కోతకాలంలో వానలు ఏ విధంగా సరిపడకుండా ఉంటాయో, అలాగే మూర్ఖుడికి గౌరవం తగినది కాదు.
2 తగని శాపం, రెక్కలు రెపరెపలాడించే పిచ్చుకలాగా, ఎగిరిపోయే వానకోయిలలాగా ఉంటుంది. అది ఎవరి మీదికీ దిగిరాదు.
3 గుర్రానికి కొరడా, గాడిదకు కళ్ళెం, మూర్ఖుడి వీపుకు బెత్తం.
4 మూర్ఖుడికి అతడి మూర్ఖత్వం ప్రకారం జవాబు చెప్పకు. అలా చెపితే, నీవూ వాడిలాంటి మనిషివే అవుతావు.
5 మూర్ఖుడికి అతడి మూర్ఖత్వం ప్రకారం జవాబు చెప్పు. లేకపోతే, తానే జ్ఞానిననుకొంటాడేమో.
6 మూర్ఖుడి చేత కబురు పంపాలంటే కాళ్ళు తెగగొట్టుకొని, విషం త్రాగినట్టే!
7 మూర్ఖుడి నోట సామెత కుంటివాళ్ళ ఊగిసలాడే కాళ్ళలాంటిది.
8 మూర్ఖుడికి గౌరవం చూపడం వడిసెలలో రాయి కట్టి ఉంచినట్టే.
9 మద్యంచేత మత్తిల్లినవాడి చేతికి ముల్లు గుచ్చుకొంటే ఎంతో, మూర్ఖుడి నోట సామెత కూడా అంతే.
10 మూర్ఖుణ్ణి గానీ దారిని వెళ్ళే వాణ్ణి గానీ పనికి పెట్టుకొనేవాడు అందరినీ గాయపరచే విలుకాడులాంటివాడు.
11  తన తెలివితక్కువ పని తిరిగి చేసే మూర్ఖుడు తన వాంతికి మరలిపోయే కుక్కలాంటివాడు.
12  తనకు తానే జ్ఞానిననుకొనేవాణ్ణి చూశావా? అలాంటివాణ్ణి బాగు చేయడంకంటే మూర్ఖుణ్ణయినా బాగుచేయడం సులభం.
13 సోమరిపోతు “దారిలో సింహం ఉంది” అంటాడు. “వీధిలో సింహం తిరుగుతూ ఉంది” అంటాడు.
14 బందుల మీద తలుపు అటూ ఇటూ తిరుగుతుంది. సోమరిపోతు పడకమీద అటూ ఇటూ పొర్లుతాడు.
15 సోమరిపోతు కంచంలో చెయ్యి పెడతాడు, కాని చెయ్యి నోటిదాకా ఎత్తడానికి బద్ధకం!
16 వివేకంగా జవాబు ఇవ్వగల ఏడుగురికంటే సోమరిపోతు తాను గొప్ప జ్ఞాని ననుకుంటాడు.
17 తనకు సంబంధించని జగడంలో తల దూర్చేవాడు తన దారిన తాను పోయేకుక్క చెవులు పట్టేవాడితో సమానం.
18 పొరుగువాణ్ణి కావాలని మోసగించి, “సరదాగా తమాషాకు అలా చేశానులే” అనేవాడు 19 మరణాన్ని, నిప్పుకొరువులను, బాణాలను విసిరివేసే వెర్రివాడితో సమానం.
20 కట్టెలు లేకపోతే, మంట కాస్తా ఆరిపోతుంది. చాడీలు చెప్పేవారు లేకపోతే కలహం అంతరించిపోతుంది.
21 మండే బొగ్గులకు ముడిబొగ్గు చేరిస్తే ఎలాగో, మంటలో కట్టెలు వేస్తే ఎలాగో, వివాదానికి జగడగొండ్లు అలాంటివారు.
22 చాడీలు చెప్పేవారి మాటలు రుచిగల కబళాల లాంటివి. అవి మనిషి అంతరంగంలోకి దిగిపోతాయి.
23  చెడ్డ హృదయంతోపాటు స్నేహంతో మాట్లాడే పెదవులు గలవారు వెండి పూత పూసిన మట్టి పాత్రతో సమానం.
24 పగవాడికి భ్రమపరిచే పెదవులు ఉంటాయి. అతడు అంతరంగంలో కపటోపాయం పన్నుతూ ఉంటాడు.
25 అతడు నీతో దయగా మాట్లాడుతున్నాడని అతణ్ణి నమ్మవద్దు. అతడి హృదయంలో అసహ్యకరమైనవి ఏడు ఉన్నాయి.
26 అతడు దొంగవేషం వేసి, కపటాన్ని దాచి పెట్టవచ్చు గాని, అతడి దుర్మార్గం సంఘం ఎదుటే బట్టబయలు అవుతుంది.
27  ఎవడు త్రవ్వుకొన్న గోతిలో వాడే పడుతాడు. రాయి పొర్లించే వాడిమీదికే అది పొర్లివచ్చి పడుతుంది.
28 అబద్ధాలాడే నాలుక గలవారు తాము అణగద్రొక్కిన వారిని ద్వేషిస్తారు. ముఖస్తుతి పలికే నోరు నాశనం తెస్తుంది.