25
1  ఇవి కూడా సొలొమోను సామెతలు. యూదా రాజు హిజ్కియాకు చెందిన మనుషులు వీటిని ఎత్తి రాశారు.
2  సంగతి దాచిపెట్టడం దేవునికి ఘనత. సంగతి పరిశోధించడం రాజులకు ఘనత.
3 ఆకాశం ఎంతో ఎత్తయినది. భూమి ఎంతో లోతు. రాజుల హృదయాన్ని పరిశోధించడం అసాధ్యం.
4 వెండిలోని కల్మషం తీసివేసి వెండిపని చేసేవాడు ఓ పాత్ర తయారు చేస్తాడు.
5 రాజు దగ్గరనుంచి దుర్మార్గులను తొలగించివేస్తే, అతడి సింహాసనం న్యాయంవల్ల సుస్థిరం అవుతుంది.
6 రాజు సమక్షంలో నిన్ను నీవే హెచ్చించుకోకు. గొప్పవారున్న చోటికి వెళ్ళి నిలవకు.
7 నీవు చూచిన ప్రధాని ఎదుట వారు నిన్ను చిన్నబుచ్చడంకంటే ఆ ప్రధాని “ఇక్కడికి రా” అని నీతో చెప్పడం మంచిది గదా.
8 తొందరపడి పొరుగువాడితో వ్యాజ్యెమాడడానికి వెళ్ళకు. చివరికి అతడి మూలంగా నీకు తలవంపులు కలిగితే నీవు ఇంకేం చేస్తావు?
9 పొరుగువాడితో వివాదం పెట్టుకొంటే పెట్టుకొన్నావు, గాని మరొకడి గుట్టు బయట పెట్టబోకు.
10 బయట పెట్టావూ అంటే అది విన్నవాడు నిన్ను అవమానించవచ్చు. వచ్చిన చెడ్డ పేరు మళ్ళీ పోదు.
11  సమయానికి తగినట్టు పలికిన మాటలు వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు ఆపిలుపండ్లలాంటివి.
12 జ్ఞానంతో మందలించేవాడు వినేవాడి చెవికి బంగారు కుండలాంటివాడు, బంగారు హారంలాంటివాడు.
13 కోతకాలం మంచు ఎంత చల్లగా ఉంటుందో నమ్మకమైన దూత తనను పంపినవాడికి అంత చల్లన. యజమాని ప్రాణాన్ని అతడు సేద తీర్చినవాడవుతాడు.
14 కానుకలు ఇవ్వకుండా, ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకొనేవారు మబ్బు పట్టి, గాలి వీచి, వర్షం రాని వాతావరణం లాంటివారు.
15 సహనంతో పాలకుణ్ణి ఒప్పించవచ్చు. సాత్వికమైన మాట ఎముకలు విరుస్తుంది.
16 తేనె దొరికితే తృప్తిగా తాగు. గాని, అతిగా తాగావూ అంటే వాంతి చేసుకుంటావు.
17 పొరుగువాడి ఇంటిలో తరచుగా అడుగు పెట్టబోకు. అతడు నీవంటే మొహం మొత్తి, నిన్ను ద్వేషిస్తాడేమో!
18 తన పొరుగువాడి మీద తప్పుడు సాక్ష్యం పలికేవాడు దుడ్డుకర్ర, ఖడ్గం, పదునైన బాణంలాంటివాడు.
19 కష్టకాలంలో ద్రోహిని నమ్ముకోవడం కదులుతున్న పంటిని, బెణికిన పాదాన్ని నమ్మడం లాంటిదే.
20 శోకంతో క్రుంగిపోయినవాడికి పాటలు పాడేవాడు చలికాలంలో పైవస్త్రం తీసివేసేవాడితో సమానం. సురేకారం మీద పులిసిన ద్రాక్షరసం పోసేవాడితో సమానం.
21 నీ శత్రువుకు ఆకలి వేస్తే, భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి.
22 అలా చేస్తే అతడి తలపైన నిప్పుకణికెలు పోసినట్టుంటుంది. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు.
23 ఉత్తరం గాలి వర్షం తెస్తుంది. చాడీ చెప్పే నాలుక కోపం రప్పిస్తుంది.
24 గయ్యాళి పెళ్ళాంతో భవనంలో ఉండడం కంటే మిద్దెమీద ఏదో ఒక మూల పడి ఉండడం మేలు.
25 దప్పిగొన్నవాడికి చల్లని నీళ్ళు ఎలాంటివో దూర దేశం నుంచి వచ్చిన శుభవార్త అలాంటిది.
26 దుర్మార్గుడికి లొంగిపోయిన న్యాయవంతుని అడుగు బురద లేచిన నీటి ఊట లాంటివాడు, పాడైపోయిన బావిలాంటివాడు.
27 అతిగా తేనె త్రాగడం మంచిది కాదు. సొంత గౌరవాన్ని పరిశోధించడం గౌరవనీయం కాదు.
28 మనసును అదుపులో పెట్టుకోలేనివారు గోడలు కూలిపోయి, పాడైపోయిన పట్టణంలాగా ఉంటారు.