24
1 ✽దుర్మార్గులను చూచి, అసూయపడకు. వాళ్ళతో స్నేహాన్ని ఆశించకు.2 వాళ్ళ హృదయం దౌర్జన్యం చేయాలని చూస్తుంది. వాళ్ళ పెదవులు కీడును గురించి మాట్లాడుతాయి.
3 ✽ జ్ఞానం ఉంటే గృహసీమ నిర్మాణం అవుతుంది. వివేకం వల్ల అది సుస్థిరం అవుతుంది.
4 తెలివిమూలంగా ఇంటి గదుల నిండా అన్ని రకాల విలువైన, అందమైన వస్తువులు నిండి ఉంటాయి.
5 ✝జ్ఞానం లభించిన మనిషికి ప్రభావం ఉంది. తెలివైనవాడు బలాభివృద్ధి చెందుతాడు.
6 యుద్ధం చేస్తే మంచి సంప్రతింపులు అవసరం. విజయంకోసం చాలామంది సలహాదారులు అవసరం.
7 ✽మూఢులకు జ్ఞానం అందుబాటులో ఉండదు. గుమ్మందగ్గర పంచాయితీలో అలాంటివారు నోరు తెరవలేరు.
8 ✽కీడు చేయడానికి దురాలోచన చేసేవాణ్ణి టక్కరి మనిషి అంటారు.
9 అవివేకాన్ని పన్నడం పాపం. మనుషులు హేళన చేసేవాళ్ళను ఏవగించుకొంటారు.
10 ✝కష్టకాలంలో నీకు ధైర్యం చెడితే నీ బలం ఎంత అల్పం!
11 ✽ ప్రాణాపాయంలో చిక్కుబడి పోయినవాళ్ళను విడిపించు. హతమైపోయేందుకు మొగ్గేవాళ్ళను రక్షించు.
12 “ఈ విషయం మాకేమీ తెలియదు” అంటే లాభం లేదు. హృదయాన్ని పరిశోధించేవానికి గ్రహింపుశక్తి లేదా? నిన్ను కనిపెట్టి చూచేవానికి నీ విషయం తెలియదా? మనుషులందరికీ వారి వారి పనుల ప్రకారం ఆయన ప్రతిఫలం ఇస్తాడు గదా.
13 ✽ నా కుమారా, తేనె త్రాగు. అది మధురం. తేనె తుట్టె నుంచి కారే తేనె బిందువులను గ్రోలు. అవి నాలుకకు తియ్యగా ఉంటాయి.
14 నీ ఆత్మకు జ్ఞానం కూడా అలాంటిదే అని తెలుసుకో. అది నీకు లభిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు ఆశాభంగం కలగదు.
15 ✽దుర్మార్గుడిలాగా న్యాయవంతుని ఇంటి దగ్గర పొంచి ఉండకు. అతని విశ్రాంతి స్థలాన్ని పాడు చేయకు.
16 న్యాయవంతుడు ఏడు సార్లు పడినా, తిరిగి లేస్తాడు. విపత్తు వస్తే, దుర్మార్గులు కుప్పకూలిపోతారు.
17 ✝నీ శత్రువు పతనమయ్యాడని సంతోషించకు. వాడు తొట్రుపడినప్పుడు నీ మనసులో ఆనందించకు.
18 ఆనందిస్తే యెహోవా అది చూచి బాగా లేదని నీ శత్రువు మీద కోపగించుకోవడం మానుకొంటాడేమో!
19 ✽ చెడుగు చేసేవాళ్ళను చూచి అసూయ చెందకు. దుర్మార్గులను చూచి కుళ్ళుకోకు.
20 చెడ్డవాళ్ళకు మంచి భవిష్యత్తు లేదు. దుర్మార్గుల దీపం కాస్తా ఆరిపోతుంది.
21 ✝నా కుమారా, యెహోవాపట్ల భయభక్తులతో ఉండు. రాజును గౌరవించు. అలా ప్రవర్తించని వాళ్ళతో సహవాసం చేయకు.
22 అలాంటివాళ్ళకు హఠాత్తుగా నాశనం ముంచుకు వస్తుంది. వాళ్ళ కాలం ఎప్పుడు తీరుతుందో ఎవరికి తెలుసు?
23 ✽✝ఇవి కూడా జ్ఞానులు పలికిన సామెతలు: తీర్పు చెప్పేటప్పుడు పక్షపాతానికి చోటు పెట్టడం మంచిది కాదు.
24 దుర్మార్గులకు “నీవు నిర్దోషివి” అని చెప్పే వారిని ప్రజలు శపిస్తారు. జనాలకు వారంటే అసహ్యం.
25 న్యాయసమ్మతంగా తీర్పు చెప్పేవారికి శ్రేయస్సు కలుగుతుంది. వారిమీద మంచి ఆశీస్సులు ఉంటాయి.
26 ✽ నిష్కపటమైన జవాబు చెప్పడం పెదవులమీద ముద్దు పెట్టుకున్నట్టే ఉంటుంది.
27 ✽ముందుగా బయట చేయవలసిన పని సరి చేసుకో. నేల సిద్ధం చేసుకో. తరువాత ఇల్లు కట్టుకోవచ్చు.
28 ✽ నిష్కారణంగా నీ పొరుగువాడికి వ్యతిరేక సాక్ష్యం పలకవద్దు. నీ పెదవులతో మోసంగా మాట్లాడవద్దు.
29 “అతడు నాకు చేసినదే, వాడికి నేనూ చేస్తాను. వాడి క్రియకు ప్రతిక్రియ చేసితీరుతాను” అనుకోవద్దు.
30 ✽ సోమరిపోతు పొలం దాటి వచ్చాను. తెలివితక్కువవాడి ద్రాక్షతోట మీదుగా వచ్చాను.
31 అంతటా ముండ్లతుప్పలు నేలను నిండి ఉన్నాయి. దురదగొండి మొక్కలు నేలను కప్పి ఉన్నాయి. రాతి గోడ కూలిపోయిన స్థితిలో ఉంది.
32 వాటిని చూచి ఆలోచించాను. వాటిని చూచి బుద్ధి తెచ్చుకొన్నాను:
33 “ఇంకా కాసేపు కునుకడం, ఇంకా కొంచెం నిద్ర కావాలి. కాసేపు చేతులు ముడుచుకొని పడుకోవాలి” –
34 ఇలా నీ మీద దోపిడీదొంగలాగా దరిద్రం వచ్చి పడుతుంది. ఖడ్గం ధరించిన భటుడిలాగా లేమి నీ మీదికి ఎగబడుతుంది.