23
1 పాలకుడితో భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఎవరి ఎదుట ఉన్నావో బాగా ఆలోచించుకో.
2 నీవు తిండిపోతువైతే, నీ గొంతుమీద కత్తి పెట్టుకో.
3 పాలకుడు పెట్టే రుచిగల భోజనంకోసం ఆశపడకు. అది నిన్ను మోసపుచ్చుతుంది.
4 ధనవంతుడివి కావడానికి కష్టించకు. అలాంటి తలంపే రాకుండా జాగ్రత్తపడు.
5 ధనంమీద చూపు నిలిపీ నిలపడంతోనే అది మాయమైపోతుంది. దానికి రెక్కలు మొలిచి అది కాస్తా ఎగిరిపోవడం ఖాయం. గరుడపక్షిలాగా గగన వీధికి ఎగిరిపోతుంది.
6 ఎదుటివాడి అభివృధ్ధిని చూచి, కుళ్ళుకొనే పిసినారి మనిషితో పాటు భోజనం చెయ్యబోకు. వాడు పెట్టే రుచిగల భోజన పదార్థాలను ఆశించకు.
7 అలాంటివాడు తనలో తానే లెక్కలు గణించుకుంటాడు. పైకి “తిను, త్రాగు” అంటాడు. అంతే! అవి లోపలనుంచి వచ్చిన మాటలు కావు.
8 నీవు కొంచెం తిన్నా, దాన్ని కక్కుతావు. నీవు చెప్పే మధురమైన మాటలు వృథా!
9 మూర్ఖులకు నీ మాటలు వినిపించకు. వాటిలోని జ్ఞానాన్ని వారు త్రోసిపుచ్చుతారు.
10  పూర్వకాలంలో నాటిన సరిహద్దు రాయి తొలగించకు. తండ్రిలేని వారి పొలంలోకి చొరబడవద్దు.
11 వారి విమోచకుడు బలవంతుడు. నీకు విరోధంగా ఆయన వారి పక్షాన వాదిస్తాడు.
12 ఉపదేశం మీద మనసు పెట్టు. తెలివైన మాటలు చెవిని బెట్టు.
13 నీ పిల్లలను శిక్షించకుండా ఉండబోకు. బెత్తం ప్రయోగిస్తే అది వారిని చంపదు.
14 బెత్తంతో వారిని శిక్షిస్తే మృత్యులోకంలోకి పోకుండా వారిని తప్పించినవాడివవుతావు.
15  నా కుమారా! నీవు జ్ఞానాన్ని మనసుకు పట్టించుకొంటే, నా మనసుకూ సంతోషం కలుగుతుంది.
16 నీ పెదవులు యథార్థం ఉచ్చరిస్తే, నా అంతరంగం ఆనందిస్తుంది.
17 పాపిష్టి మనుషులను చూచి హృదయంలో అసూయ చెందకు. ఎప్పుడూ యెహోవాపట్ల భయభక్తులతో మసులుకో.
18 అప్పుడు నీకు భవిష్యత్తు తప్పక ఉంటుంది. నీకేమీ ఆశాభంగం కలగదు.
19 నా కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. హృదయపూర్వకంగా యథార్థమైన మార్గంలో సాగిపో.
20 తాగుబోతులతో, అతిగా మాంసం మెక్కేవాళ్ళతో స్నేహం చెయ్యకు.
21 త్రాగుబోతులూ, తిండిబోతులూ దరిద్రులు అవుతారు. నిద్రామత్తు చింపిరి గుడ్డలు వేసుకొనే స్థితికి దిగజారుస్తుంది.
22 నీ కన్నతండ్రి ఉపదేశం చెవిని బెట్టు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చెయ్యకు.
23 సత్యాన్ని సంపాదించుకో, దాన్ని అమ్మివేయకు. జ్ఞానం, తర్బీతు, వివేకం సంపాదించుకో.
24 న్యాయవంతుని తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. జ్ఞానం గల కొడుకును కన్నవాడికి పుత్రోత్సాహం కలుగుతుంది.
25 నిన్నుబట్టి నీ తల్లిదండ్రులు సంతోషించాలి. నిన్ను కన్నతల్లికి ఆనందం చేకూరాలి.
26 నా కుమారా, నీ హృదయాన్ని నాకు ఇచ్చివెయ్యి! నా విధానాలు నీ కన్నులకు ఆకర్షణీయంగా కనబడాలి.
27 వేశ్య లోతైన గుంటలాంటిది. వ్యభిచారిణి ఇరుకు గుండంలాంటిది.
28 ఆమె దోపిడీదొంగలాగా పొంచి ఉంటుంది. చాలామందిని ఆమె ద్రోహులను చేస్తుంది.
29 ఎవరు విలపించవలసివస్తుంది? ఎవరు దురవస్థలో పడతారు? ఎవరికి జగడాలు? ఎవరికి విచారం? ఊరికే ఎవరికి గాయాలు తగులుతాయి? ఎవరికి మందదృష్టి?
30 చాలా రాత్రి గడిచేవరకు ద్రాక్షమద్యం త్రాగుతూ ఉండేవాళ్ళకే అవన్నీ, మిశ్రమ ద్రాక్షమద్యం రుచి చూడడానికి వెళ్ళేవారికే.
31 ద్రాక్షమద్యం ఎర్రగా ఉండి, గిన్నెలో తళతళ మెరుస్తుందనీ, త్రాగడానికి రుచిగా ఉంటుందనీ దానివైపు చూడవద్దు.
32 త్రాగిన తరువాత అది పాములాగా కరుస్తుంది. కట్లపామై నిన్ను కాటు వేస్తుంది.
33 అప్పుడు నీ కండ్లకు విపరీతమైనవి కనిపిస్తాయి. నీవు పిచ్చిగా మాట్లాడుతావు.
34 నడి సముద్రంలో పడుకొన్నవాడి స్థితే అవుతుంది నీ పని. ఓడ కొయ్య అంచున పడుకొన్న వాడిలాగా ఉంటావు.
35 నీకిలా అనిపిస్తుంది: “నన్ను కొట్టారు, గదా! అయితే నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడ్డాయేమో – నాకు తెలియదు. నేను నిద్రమేల్కొనేదెప్పుడు? ఇంకా తాగడానికి పోతా!”