22
1 గొప్పసంపదకంటే మంచి పేరు కోరతగ్గది. వెండి బంగారాలకంటే దయ శ్రేష్ఠం.
2 ధనికులకూ పేదలకూ ఈ విషయంలో భేదం లేదు – వారందరి సృష్టికర్త యెహోవాయే.
3 వివేకవంతులు అపాయాన్ని ముందుగా చూచి, దాగుకొంటారు. తెలివితక్కువవారు ముందుకు సాగిపోయి బాధలపాలవుతారు.
4 వినయానికీ, యెహోవామీది భయభక్తులకూ ప్రతిఫలంగా ఐశ్వర్యమూ గౌరవమూ జీవమూ చేకూరుతాయి.
5  ముండ్లు, ఉరులు కుటిలాత్ముల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా తొలగి నడుస్తాడు.
6 చిన్నవారు నడవవలసిన మార్గం వారికి నేర్పు. వారు పెరిగి పెద్దవారై అందులోనుంచి వైదొలగరు.
7 భాగ్యవంతులు బీదలమీద పెత్తనం చెలాయిస్తారు. అప్పు తీసుకొనేవారు ఇచ్చేవారికి దాసులు.
8 దౌర్జన్యాన్ని నాటేవారు కీడు అనే పంట కోయవలసి వస్తుంది. వారి దుడ్డుకర్రలాంటి కోపం అంతరిస్తుంది.
9  ఇతరులను దయ చూచేవారికి ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే, తమకున్న ఆహారంలో కొంత బీదలతో పంచుకుంటారు.
10 హేళన చేసేవాణ్ణి వెళ్ళగొడితే, వాడితోపాటు కలహాలు పోతాయి. పోరూ ఉండదు, అవమానమూ కలగదు.
11 హృదయ శుద్ధి అంటే ఇష్టం కలిగి దయగా మాట్లాడేవానికి రాజు కూడా మిత్రుడవుతాడు.
12 యెహోవా దృక్కులు జ్ఞానాన్ని కాపాడుతాయి. వంచకుల మాటలను ఆయన తుడిచివేస్తాడు.
13  సోమరిపోతు ఇలా సాకు చెప్తాడు: “బయట సింహం ఉంది”; లేదా, “వీధిలోకి వెళ్ళితే నన్ను చంపేస్తారు.”
14 వ్యభిచారిణి నోరు లోతైన గుంట. యెహోవా శాపానికి గురి అయినవాడు దానిలో పడిపోతాడు.
15 పిల్లవాడి హృదయంలో మంకుతనం స్వాభావికమే. దండంతో శిక్షించడం దాన్ని అతడిలోనుంచి తొలగిస్తుంది.
16 లాభంకోసం పేదసాదలకు అన్యాయం తలపెట్టినవారూ, ధనం ఉన్నవారికి ఇంకా ఇచ్చేవారూ అక్కరపడుతారు.
17 జ్ఞానుల ఉపదేశం చెవిని బెట్టు, సావధానంగా విను. నా తెలివైన మాటలు మనసుకు పట్టించుకో.
18 నీ అంతరంగంలో వాటిని నిలుపుకొంటే సంతోషకరం. నీ పెదవులమీద అవి నిలిచేలా చూచుకో.
19 ఈ వేళ ఈ ఉపదేశం నిన్ను ఉద్దేశించి చేస్తున్నాను. దీనిమూలంగా నీవు యెహోవామీద నమ్మకం ఉంచాలని నా ఆశయం.
20 నేను నీకోసం శ్రేష్ఠమైన సామెతలు రాశాను, గదా. ఈ సామెతలు ఆలోచన చెపుతాయి. ఇవి జ్ఞానపూరితమైనవి.
21 సత్యవాక్కుల గురించిన నిశ్చయం నీకు కలిగిస్తాయి. నిన్ను పంపినవారికి సరైన జవాబులు ఇవ్వడానికి సమర్థుడివి కావాలని నా ఆశయం.
22  నిస్సహాయులని దిక్కులేనివారిని దోచుకోవద్దు. పంచాయితీ సభలో బీదలను బాధించకు.
23 బీదల పక్షాన యెహోవా వాదిస్తాడు. బీదలను దోచుకొనే వాళ్ళ ప్రాణాన్ని యెహోవా దోచుకుంటాడు.
24 కోపం రెచ్చిపొయ్యే మనిషితో స్నేహం చెయ్యకు. ముక్కోపితో పరిచయం చేసుకోబోకు.
25 చేసుకొంటే నీవు అతడి విధానాలు నేర్చుకొని నీ ప్రాణానికి ఉరి కొనితెచ్చుకొంటావు జాగ్రత్త!
26 చేతిలో చెయ్యి వేసి ఒట్టు అనేవాళ్ళలో, అప్పులు ఇప్పించడానికి జామీను నిలబడే వాళ్ళలో ఒకడివి కాకు.
27 తీరా చెల్లించేందుకు నీ దగ్గర ఏమీ ఉండదనుకో – అతడు నీవు పడుకొన్న పరుపు కాస్తా తీసుకుపోవడం ఏం బావుంటుంది?
28 నీ పూర్వీకులు నాటిన పురాతనమైన సరిహద్దు రాళ్ళను తొలగించకు.
29 నేర్పుతో పని చేసుకొనే మనిషిని చూశావా? అలాంటివాడు ఊరూ పేరులేని వాళ్ళకు సేవ చేయడు. రాజుల ఎదుటే నిలుస్తాడు.