21
1  రాజు హృదయం యెహోవా చేతిలో ఉంది. ఆయనకు ఇష్టం వచ్చినట్లు నీటి కాలువల్లాగా దాన్ని తిప్పుతాడు.
2 మనిషికి తన విధానాలన్నీ సరైనవే అనిపిస్తాయి. యెహోవా హృదయాలను తులనాత్మకంగా పరిశీలిస్తాడు.
3 నీతి న్యాయాల ప్రకారం ప్రవర్తించడం బలికంటే యెహోవాకు ఎక్కువ ఇష్టం.
4 గర్వంతో కూడిన చూపులు, అహంభావ హృదయం దుర్మార్గులకు దీపం. ఇవన్నీ పాపాలే!
5 శ్రద్ధతో పనిచేసేవారి ప్రణాళికలు సమృద్ధి కలిగిస్తాయి. తొందరపడి పని చేసే ప్రతి ఒక్కరూ అక్కరపడతారు.
6  అబద్ధాలాడే నాలుకతో డబ్బు సంపాయించుకొన్న ధనం ఎగిరిపోయే ఆవిరిలాంటిది. అది కావాలనేవాడు మరణం వెదుకుతున్నాడన్నమాట.
7 దుర్మార్గులు చేసే దౌర్జన్యం వాళ్ళను తుడిచివేస్తుంది. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ప్రవర్తించడానికి ఒప్పుకోరు.
8  అపరాధి విధానాలు వంకరటింకర. శుద్ధుల ప్రవర్తన యథార్థమైనది.
9 గయ్యాళి పెళ్ళాంతో భవనంలో ఉండడం కంటే మిద్దెమీద ఏదో ఒక మూల పడి ఉండడం మేలు.
10 దుర్మార్గుల మనసు కీడువైపే మొగ్గుతుంది. తమ పొరుగువారి మీద కూడా వారికి దయ కలగదు.
11 హేళన చేసేవారు శిక్షకు గురి అయితే, అమాయకులు చూచి తెలివి తెచ్చుకుంటారు. జ్ఞానికి ఉపదేశం వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది.
12 న్యాయవంతుడైన దేవుడు దుర్మార్గుల ఇంటి సంగతి కనిపెట్టి చూస్తాడు. దుర్మార్గులను ధ్వంసంలోకి తిప్పుతాడు.
13  ఒకవ్యక్తి దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకొంటే, అతడు కూడా మొర పెట్టవలసివస్తుంది గాని, జవాబు మాత్రం రాదు.
14 గుప్తంగా ఇచ్చిన బహుమానం కోపాగ్నిని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన కానుక తీవ్రమైన ఆగ్రహాన్ని శాంతపరుస్తుంది.
15 న్యాయాన్ని జరిగించడం న్యాయవంతులకు సంతోషం. చెడుగు చేసేవారికి అది భయంకరం.
16 వివేకవంతమైన మార్గంనుంచి వైదొలగి తిరిగేవారు చచ్చినవాళ్ళ గుంపులో చేరుతారు.
17 సుఖం మరిగినవారు దరిద్రులవుతారు. ద్రాక్షమద్యం, నూనె కావాలని పేరాశగలవారు ధనికులు కాలేరు.
18  దుర్మార్గులు సన్మార్గులకు విడుదల కలిగించే వెలగా ఉంటారు. యథార్థపరులకు బదులు విద్రోహులు నశిస్తారు.
19 విసికించే గయ్యాళి పెళ్ళాంతో ఉండేకంటే అరణ్యవాసం చేయడం మేలు.
20 జ్ఞానుల ఇంట్లో శ్రేష్ఠ భోజన పదార్థాలు, నూనె నిలువ ఉంటాయి. మూర్ఖులు తనకున్నదంతా దిగమింగివేస్తారు.
21 న్యాయాన్ని, దయను అనుసరించేవారు జీవం, న్యాయం, గౌరవం పొందుతారు.
22 జ్ఞానమున్న మనిషి బలాఢ్యుల నగర ప్రాకారమెక్కి వాళ్ళకు ఆశ్రయ స్థానమైన కోటను పడగొట్టివేస్తాడు.
23 మాటల విషయం జాగ్రత్తగా ఉండేవారు బాధలనుంచి తమను కాపాడుకొంటారు.
24  హేళన చేసేవాణ్ణి అహంకారి అనీ, గర్విష్ఠి అనీ వ్యవహరిస్తారు. అతడు అతి గర్వంతో ప్రవర్తిస్తాడు.
25 సోమరిపోతుల చేతులు పని చేయవు, గనుక వారి ఆశలే వారికి చావు తెస్తాయి.
26 వారికి పొద్దస్తమానమూ గొంతెమ్మ కోరికలే. న్యాయవంతులు వెనక్కు తీయకుండా ఇతరులకు ఇస్తారు.
27 దుర్మార్గుల బలి అసహ్యకరం. అలాంటప్పుడు వాళ్ళు దురుద్దేశంతో బలి అర్పిస్తే, మరింకెంత అసహ్యం!
28 అబద్ధ సాక్షి నాశనమవుతాడు. సత్యానికి లోబడేవాడు నిజాయితీతో మాట్లాడుతాడు.
29 దుర్మార్గులు ముఖంమీద సిగ్గు, బిడియం లేకుండా చేస్తారు. యథార్థపరులు తమ ప్రవర్తనను చక్కపరచుకొంటారు.
30 యెహోవాకు వ్యతిరేకంగా ఏ జ్ఞానమూ, వివేకమూ, ఆలోచనా నిలవలేవు.
31 యుద్ధ దినంకోసం గుర్రాలను సిద్ధం చేస్తారు. కానీ రక్షణ యెహోవా అధీనంలో ఉంది.