20
1 ద్రాక్షమద్యం నగుబాట్లపాలు చేస్తుంది. మద్యపానం వల్ల మనిషి రెచ్చిపోతాడు. వాటి వశం అయిన వాళ్ళంతా తెలివితక్కువవాళ్ళు.
2 రాజు బెదిరింపు సింహ గర్జనలాంటిది. రాజుకు కోపం తెప్పించే వాళ్ళు ప్రాణాపాయానికి గురి అయ్యేవాళ్ళు.
3 కలహాలకు దూరం కావడం మనిషికి గౌరవం. ప్రతి మూర్ఖుడూ జగడాలు పెట్టుకుంటాడు.
4 విత్తనాలు వేసేకాలంలో సోమరి పొలం దున్నడు. కోతకాలంలో ప్రాధేయపడుతాడు గాని, అతడికేమీ లభించదు.
5 మనిషి హృదయంలోని ఉద్దేశాలు లోతైన నీళ్ళలాంటివి. తెలివైనవారు వాటిని బయటికి తీస్తారు.
6  చాలామంది తాము దయగలవాళ్ళమని చాటుతారు. అయితే నమ్మకమైన వ్యక్తిని ఎవరు కనుక్కోగలరు?
7 న్యాయవంతులు నిజాయితీగా ప్రవర్తిస్తారు. వారి తదనంతరం వారి పిల్లలు ధన్యజీవులవుతారు.
8 రాజు న్యాయపీఠాన్ని అధిష్టించి, తన కంటిచూపుతోనే చెడుగంతా చెదరగొట్టివేస్తాడు.
9 “నా హృదయం శుద్ధి చేసుకొన్నాను. నా పాపాలన్నీ పోయాయి. నేను పవిత్రుణ్ణి” అని చెప్పగల వ్యక్తి ఎవరు?
10 తూకం రాళ్ళు, కొలతలు భిన్నమైనవైతే ఈ రెండూ యెహోవాకు అసహ్యకరం.
11 పిల్లవాడు ఏలాంటివాడో అతడి క్రియలను బట్టి తెలుసు. అవి శుద్ధమైనవో, సరైనవో, కాదో, చూచి ఆ విషయం తెలుసుకోవచ్చు.
12 వినే చెవి, చూచే కన్ను ఈ రెండూ యెహోవా కలుగజేసినవే.
13 దరిద్రుడివి కాకుండేలా నిద్రను ప్రేమించక మేల్కొని ఉండు. ఆహారం పుచ్చుకొని, తృప్తిపడు.
14 వస్తువు కొనేవారు “ఇదేమి మంచిది కాదు” అంటారు. తమ దారిని తాము వెళ్ళి వస్తువులను మెచ్చుకుంటారు.
15 బంగారం ఉంది. రత్నాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికంటే తెలివిగా మాట్లాడే పెదవులు ప్రశస్తమైనవి.
16 పరాయివాడికి జామీను ఉండేవాడి వస్త్రం తీసుకో. పరాయివాళ్ళకు అతణ్ణే జామీను ఉండనియ్యి.
17 మోసంతో సంపాదించిన ఆహారం మనిషికి ఎంతో రుచి అనిపిస్తుంది. ఆ తరువాత వాడి నోటినిండా మన్నే.
18 సలహాలు విని నీ ఏర్పాట్లు చేసుకో. యుద్ధం చేయకముందు మంచి సంప్రతింపులు పాటించు.
19 చాడీకోరులు తిరుగుతూ రహస్యాలను బట్టబయలు చేస్తారు. వదరుబోతుల జోలికి పోవద్దు.
20 తండ్రిని గానీ, తల్లిని గానీ దూషించేవాడి దీపం కాస్తా కటిక చీకట్లో ఆరిపోతుంది.
21 మొదట్లో పేరాశతో దక్కించుకొన్న ఆస్తికి చిట్టచివరకు దీవెనలు కలగవు.
22 కీడుకు బదులు కీడు చేస్తాననవద్దు. యెహోవా కోసం నమ్మకంతో ఎదురు చూడు. ఆయన నిన్ను కాపాడుతాడు.
23 తూనికెరాళ్ళు భిన్నమైనవైతే, అది యెహోవాకు అసహ్యకరం. దొంగ త్రాసు ఆయనకు ఇష్టమేమీ లేదు.
24  మనిషి పోకడలు యెహోవా వశంలో ఉన్నాయి. తన జీవిత మార్గాన్ని ఎవరైనా ఎలా గ్రహించగలరు?
25 మనిషి ఆలోచించకుండా ఏదైనా దేవునికి ప్రతిష్ఠ చేస్తానని చెప్పి, తరువాత ఆ మొక్కుబడిని గురించి మళ్ళీ విచారిస్తే, అతడు వలలో చిక్కుపడ్డాడన్నమాటే.
26 రాజు జ్ఞాని అయితే, దుర్మార్గులను చెదరగొట్టివేస్తాడు. వాళ్ళమీదిగా రాజ్యచక్రం దొర్లిస్తాడు.
27  మనిషి ఆత్మ యెహోవా దీపం. అది అతని అంతర్యాన్ని అంతా పరిశోధిస్తుంది.
28 అనుగ్రహం, సత్యం రాజుకు భద్రత కలిగిస్తాయి. అనుగ్రహం చేత అతడి సింహాసనం సుస్థిరంగా ఉంటుంది.
29 యువకుల బలమే వారికి ఘనత. నెరసిన తల వృద్ధులకు అందం.
30 గాయపరిచే దెబ్బలు మనిషి చెడుగును తుడిచివేస్తాయి. దెబ్బలు అంతరంగానికి శుద్ధి కలిగిస్తాయి.