19
1  మూర్ఖంగా మాట్లాడే మూఢుడికంటే నిజాయితీతో ప్రవర్తించే దరిద్రుడే మేలు.
2 తెలివిమాలి ఉండడం మంచిది కాదు. తొందరపాటులో మనిషి పాదాలు తప్పుదారి పడతాయి.
3 మనిషి మూర్ఖత్వం అతడి నడతను తారుమారు చేస్తుంది. అప్పుడతడి హృదయం యెహోవాకు వ్యతిరేకంగా రెచ్చిపోతుంది.
4 ధనంమూలంగా స్నేహితులు ఎక్కువవుతారు. దరిద్రంలో పడ్డవారికి స్నేహితులు దూరమవుతారు.
5 అబద్ధ సాక్షికి శిక్ష రాకమానదు. కల్లలు చెప్పేవారు తప్పించుకోలేరు.
6 చాలామంది ఘనబుద్ధి గలవారినుంచి దయను అభ్యర్థిస్తారు. ఇచ్చేవాడికి అంతా స్నేహితులే!
7 అక్కరలో ఉన్నవారిని చుట్టాలంతా ద్వేషిస్తారు. అలాంటి వారికి స్నేహితులు కూడా దూరమవుతారు. వాళ్ళను మాటలతో వెంటాడాలని చూస్తారు గాని, ప్రయోజనం శూన్యం.
8 తమ ప్రాణాన్ని ప్రేమతో చూచుకొనేవారు జ్ఞానం సంపాదించుకొంటారు. వివేకాన్ని పాటించేవారికి మేలు కలుగుతుంది.
9 అబద్ధసాక్షికి శిక్ష రాకమానదు. కల్లలు చెప్పేవారు నాశనం అవుతారు.
10 మూర్ఖులు విశేష భోగం అనుభవించడం తగని విషయం. దాసుడు నాయకులమీద పెత్తనం చేయడం మరీ అనుచితం.
11 మనిషి వివేకం అతడికి సహనం చేకూరుస్తుంది. అపరాధాలు క్షమించడం అతడి ఘనత.
12 రాజు ఆగ్రహం సింహ గర్జనలాంటిది. అతడి దయ గడ్డిమీద కురిసే మంచులాంటిది.
13 తెలివిమాలిన కొడుకు తండ్రికి నాశనం తెచ్చిపెడతాడు. జగడగొండి అయిన భార్య ఎడతెరిపి లేకుండా పడే నీటి బిందువుల్లాంటిది.
14 ఇల్లు, సంపద పిత్రార్జితం. వివేకవతి అయిన భార్య దేవుడు ఇచ్చినది.
15 సోమరితనం గాఢ నిద్రామత్తులను చేస్తుంది. పని చేయనివారికి చాలినంత ఆహారం దొరకదు.
16 ఆజ్ఞను శిరసావహించేవాడు తన ప్రాణాన్ని కాపాడుకొంటున్నాడన్నమాట. తన ప్రవర్తనలో అజాగ్రత్తచేత మనిషి చస్తాడు.
17  బీదలకు దయ చూపేవాడు యెహోవాకు బాకీ ఇచ్చాడన్నమాట. అతడి ఉపకారానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు.
18  ఆశాభావం గతించకముందే నీ కొడుకును క్రమశిక్షణలో పెట్టు. కొడుకు మరణాన్ని కోరవద్దు.
19 అతికోపి శిక్షను భరించవలసిందే. అతణ్ణి తప్పించినా, మళ్ళీ అలాంటిదే చేస్తూ ఉంటాడు.
20 సలహా విను. క్రమశిక్షణ పాటించు. నీ జీవితంలో మిగిలిన కాలం జ్ఞానివి అవుతావు.
21  మనిషి హృదయంలో అనేక ఆలోచనలు రూపొందుతాయి. కాని, యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.
22 మనిషిలో దయ అనేది ఆకర్షణీయం. అబద్ధాలు చెప్పడం కంటే అక్కరలో ఉండడమే మంచిది.
23 యెహోవామీది భయభక్తులు జీవానికి దారి. భయభక్తులున్న వారికి తృప్తి కలుగుతుంది. వారిమీదికి కీడు రాదు.
24 సోమరివాడు కంచంలో చెయ్యి పెడతాడు. కాని, చెయ్యి నోటిదాకా ఎత్తడానికి బద్ధకం!
25 హేళన చేసేవాళ్ళకు శిక్ష గనుక వస్తే అమాయకులు చూచి, తెలివి తెచ్చుకుంటారు. వివేకులను మందలిస్తే వాళ్ళకు జ్ఞానాభివృద్ధి.
26 తండ్రిని దౌర్జన్యం చేసి, తల్లిని వెళ్ళగొట్టేవాడు అవమానం, అపకీర్తి కలిగించే కొడుకు.
27 నా కుమారా! నీవు ఉపదేశం వినడం మానుకొంటే, జ్ఞాన వాక్కులనుంచి వైదొలగిపోయినవాడివి అవుతావు.
28 పనికిమాలిన సాక్షి న్యాయాన్ని వేళాకోళం చేస్తాడు. దుర్మార్గుల నోరు చెడుగును మ్రింగివేస్తుంది.
29 హేళన చేసేవాళ్ళకు తీర్పులు, మూర్ఖుల వీపుకు దెబ్బలు.