18
1 ఇతరులనుంచి దూరమైనవారు స్వప్రయోజనం వెదికేవారు. సరైన జ్ఞానం అంటే వారికి గిట్టదు.
2 మూర్ఖులకు వివేకంలో సంతోషం ఉండదు. తమ ఉద్దేశాలను వెలిపుచ్చడం వారికి సరదా.
3 దుర్మార్గులు వస్తే, వారితోపాటు తిరస్కారం ఉంటుంది. అలాగే అవమానంతోపాటు నింద వస్తుంది.
4  మనిషి నోటి మాటలు లోతైన నీళ్ళలాంటివి. జ్ఞానం యొక్క ఊట పారే నదిలాంటిది.
5 చెడ్డవాళ్ళ పట్ల పక్షపాతం చూపడం, నిర్దోషులకు అన్యాయంగా తీర్పు తీర్చడం మంచిది కాదు.
6 మూర్ఖుల పెదవులు జగడానికి సిద్ధం. తాము దెబ్బలకు గురి కావాలని అడిగినట్టుంటారు.
7 మూర్ఖుల నోరు వాళ్ళ నాశనానికే! వాళ్ళ పెదవులు వాళ్ళ ప్రాణానికి ఉరి.
8  చాడీ చెప్పేవారి మాటలు రుచిగల కబళాలలాంటివి. అవి మనిషి అంతరంగంలోకి దిగిపోతాయి.
9  తన పనిలో బద్దకంగా ఉండేవాడు నాశనగొట్టు మనిషికి సోదరుడు.
10 యెహోవా పేరు బలమైన కోట. న్యాయవంతులు అందులోకి పరిగెత్తి క్షేమంగా ఉంటారు.
11 ధనికుడి సంపద అతడికి బలమైన పట్టణంలాంటిది. అది తనకు ఎత్తయిన ప్రాకారం అనుకొంటాడు.
12 విపత్తు ప్రాప్తించేముందు మనిషి హృదయం మిడిసిపడుతుంది. వినయం గౌరవానికి దారి.
13 అసలు సంగతి వినకుండా జవాబు చెప్పేవారు తమ తెలివితక్కువతనం తామే బయటపెట్టుకుంటారు. వారు సిగ్గుపడవలసి వస్తుంది.
14 మనిషికి జబ్బు చేస్తే తన హృదయం సహిస్తుంది గాని, గాయపడిన హృదయాన్ని ఎవరు ఓర్చుకోగలరు?
15 జ్ఞానుల చెవి జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకవంతమైన మనసుకు జ్ఞానం లభిస్తుంది.
16 కానుకలు ఇచ్చేవారికి అవకాశాలు ఎక్కువ. కానుక గొప్పవారి ఎదుటికి వెళ్ళేట్టు చేస్తుంది.
17 ప్రతివాది వచ్చి ప్రశ్నలు అడిగేముందు వ్యాజ్యెం చేసేవాడికి అనుకూలంగా కనిపిస్తుంది.
18 చీట్లు వేస్తే జగడం చల్లారిపోతుంది, బలాఢ్యుల మధ్య వివాదం పరిష్కారం అవుతుంది.
19 అక్రమానికి గురి అయి నొచ్చుకొన్న సోదరుణ్ణి చేరదీయడం బలమైన పట్టణాన్ని వశం చేసుకోవడం కంటే కష్టతరం. కలహాలు కోట తలుపుల గడియల్లాంటివి.
20 నోటి మాటల ఫలంమూలంగా కడుపు నిండుతుంది. పెదవుల ఆదాయం తృప్తి కలిగిస్తుంది.
21 జీవమూ, మరణమూ నాలుక వశంలో ఉన్నాయి. నాలుకను ప్రేమించేవారికి దాని ఫలం ముడుతుంది.
22 భార్య లభించినదంటే మేలు దొరికినట్టే. అలాంటివానికి యెహోవా దయ ప్రాప్తించిందన్న మాట.
23 దరిద్రులు ప్రాధేయపడి అడుగుతారు. ధనవంతుడు పౌరుషంగా జవాబిస్తాడు.
24 ఎక్కువమంది స్నేహితులు ఉండడంవల్ల నష్టం కలుగవచ్చు. సోదరుడి కంటే సన్నిహితంగా ఉండబోయే స్నేహితుడొకడు ఉన్నాడు.